యోగా అంటే కేవలం బరువు తగ్గడానికో, కొవ్వు కరిగించుకోవడానికో చేసే ఆసనాలే కాదు. దానితో చాలా లాభాలు ఉన్నాయి. మనిషి శారీరక దృఢత్వాన్నీ, ఏకాగ్రతను పెంచుకోవడానికి ఇది సాయపడుతుంది. అందుకే దీన్ని అనుసరించేవారి సంఖ్య ఏటా పెరుగుతోంది. మానసిక ఒత్తిడి, కుంగుబాటు నుంచి ఉపశమనం, శారీరక ఎదుగుదల, ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెంచుకోడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది.
యోగాలో ఎన్నో ఆసనాలు, భంగిమలు ఉన్నా.. ఎక్కువమంది ఇష్టపడేది 'శవాసనం'. ఎందుకంటే ఎలాంటి కష్టం లేకుండా హాయిగా రిలాక్స్ కావచ్చు కదా..! మరి యోగా సెషన్ మొత్తం రిలాక్స్ కావడమే అయితే...? సాధారణ విశ్రాంతి భంగిమలకే కొంత యోగా ట్విస్ట్ ఇచ్చి అద్భుతమైన ఫలితాలను సాధించగలిగితే..? అలా వచ్చిందే 'రెస్టొరేటివ్ యోగా'. ఈ మధ్యే పాపులర్ అవుతున్న ఈ ప్రత్యేకమైన యోగా గురించి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.
ఎక్కడిదీ యోగా..?
1950ల్లో మన యోగ శాస్త్రాన్ని పాశ్చాత్య దేశాలకు ప్రచారం చేసిన బి.కె.ఎస్.అయ్యంగార్ ఈ రెస్టొరేటివ్ యోగాను కనిపెట్టారు. ఆయన శిష్యులలో మొదటితరం వారైన జుడిత్ హాన్సన్ లాసేటర్ ఈ రెస్టొరేటివ్ యోగాను ప్రచారంలోకి తీసుకువచ్చారు. 1955లో ఆమె రాసిన 'రిలాక్స్ అండ్ రెన్యూ: రెస్ట్ఫుల్ యోగా ఫర్ స్ట్రెస్ఫుల్ టైమ్స్' అనే పుస్తకం ఇందుకు ఎంతగానో తోడ్పడింది. తర్వాత ఆమె రెస్టొరేటివ్ యోగాలో స్పెషల్ టీచర్ సర్టిఫికేషన్ కూడా ప్రవేశపెట్టారు.
రెస్టొరేటివ్ యోగా అంటే..?
మన శరీర తత్వాన్ని బట్టి, ఫ్లెక్సిబిలిటీని బట్టి రకరకాల యోగాసనాలను సాధన చేస్తాం. మనం ఆశించిన ఫలితాలను పొందడానికి, శరీరాన్ని నిత్యం ఆరోగ్యంగా ఉంచడానికి క్రమం తప్పకుండా యోగ సాధన చేస్తుంటాం. అలాగే మానసిక ప్రశాంతత కోసం, ఏకాగ్రత కోసం ధ్యానాన్ని సాధన చేస్తాం. ఈ రెండిటి ప్రయోజనాలనూ ఏకకాలంలో అందించగలగడం రెస్టొరేటివ్ యోగా ప్రత్యేకత.
యోగా చేసేటప్పుడు ఎక్కువసేపు ఒకే పొజిషన్‌లో ఉండడం వల్ల శరీరానికి ఆ భంగిమను నెమ్మదిగా అలవాటు చేస్తూ అందులోని పూర్తి లాభాలను పొందడమే రెస్టొరేటివ్ యోగా ఫార్ములా. శరీరానికి, మనసుకు విశ్రాంతినిస్తూనే అధిక బరువును తగ్గించడం రెస్టొరేటివ్ యోగా సక్సెస్ కావడానికి ప్రధాన కారణం. ఇందులో బాలాసనం చాలా ముఖ్యమైనది.