తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

పిల్లలు రాత్రిళ్లు బాగా నిద్రపోతున్నారా? అయితే లావు అవ్వరట!

రాత్రిపూట ఎక్కువసేపు గాఢ నిద్రపోయే శిశువులకు (Infants sleep cycle) అధిక బరువు ముప్పు తక్కువని తాజా అధ్యయనంలో వెల్లడైంది. కనీసం ఒక గంట సేపు ఎక్కువ నిద్రపోయినా (Infants sleep time) ఊబకాయం ముప్పు 26% తగ్గుతుండటం గమనార్హం. అందువల్ల తొలిదశలో ఊబకాయాన్ని తగ్గించటానికి శిశువులకు కమ్మటి నిద్ర ఎంతైనా అవసరమని సూచిస్తున్నారు.

infants sleep and weight
కమ్మటి నిద్రతో శిశువులు ఊబకాయానికి దూరం

By

Published : Oct 27, 2021, 7:01 AM IST

రాత్రిపూట కమ్మటి నిద్ర ఏ వయసులోనైనా అవసరమే. శిశువులకైతే మరీనూ. రాత్రిపూట తరచూ మేల్కొనకుండా, ఎక్కువసేపు గాఢ నిద్రపోయే శిశువులకు (Infants sleep cycle) తొలి ఆర్నెల్లలో అధిక బరువు ముప్పు తక్కువని తాజా అధ్యయనం పేర్కొంటోంది మరి. ఇందులో భాగంగా 298 మంది శిశువులను ఎంచుకొని, రాత్రి 8 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు నిద్ర (Infants sleep time) తీరుతెన్నులను పరిశీలించారు. ఒక గంట సేపు ఎక్కువ నిద్రపోయినా ఊబకాయం ముప్పు 26% తగ్గుతుండటం గమనార్హం. అలాగే నిద్రలోంచి మేల్కోవటం తగ్గినకొద్దీ (Infants sleep schedule) అధిక బరువు ముప్పు 16% వరకు (Baby Sleep Obesity) తగ్గుముఖం పడుతోంది.

కారణాలు ఇవి..

రాత్రిపూట సరిగా నిద్రపోని శిశువులకు తల్లిదండ్రులు పాలు పట్టటం, ఘనాహారం ఆరంభించటం వంటి వాటితో సముదాయిస్తుండొచ్చు. కంటి నిండా నిద్రపోని పిల్లలకు మర్నాడు ఆకలి వేస్తున్నట్టు అనిపించొచ్చు. అలసటకూ గురికావొచ్చు. దీంతో మరింత ఎక్కువగానూ తినొచ్చు, తక్కువగా కదలొచ్చు. ఇవన్నీ బరువు పెరగటానికి దోహదం చేస్తుండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. అందువల్ల తొలిదశలో ఊబకాయాన్ని తగ్గించటానికి శిశువులకు కమ్మటి నిద్ర ఎంతైనా అవసరమని సూచిస్తున్నారు.

అన్ని వయసుల్లో మాదిరిగానే నిద్ర, ఊబకాయం మధ్య సంబంధం శైశవంలోనూ కనిపిస్తోందని, ఇది మున్ముందు ఆరోగ్యం తీరుతెన్నులను అంచనా వేయటానికి ఉపయోగపడగలదని పరిశోధకులు చెబుతున్నారు. నిద్రకూ ఆరోగ్యానికీ అవినాభావ సంబంధం ఉంటున్నట్టు ఇప్పటికే పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. పిల్లల విషయంలోనైతే ఊబకాయం, మధుమేహం ముప్పు తగ్గుతుంది. ఎదుగుదల సక్రమంగా సాగుతుంది. నేర్చుకోవటం, ప్రవర్తన మెరుగవుతాయి. కాబట్టి శిశువుల నిద్రపై ఓ కన్నేసి ఉంచటం మంచిది.

ఇదీ చదవండి:తక్కువ బరువుతో శిశువు జన్మించిందా.. కారణమేంటో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details