తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

'ఆ మాత్రం గుప్పెడు పొట్ట ఉండదా?' అనుకోవద్దు! ఆ కొవ్వుతో ఎంతో ప్రమాదం!

Reduce Fat Around Waist : అధిక బ‌రువెప్పుడూ మ‌న పాలిట శాప‌మే. చాలా మంది చిరు పొట్ట‌ను పెద్ద‌గా ప‌ట్టించుకోరు. పైగా మ‌గ‌వారికి ఆ మాత్రం పొట్ట ఉండ‌టం అలంకారంగా భావిస్తారు. నిజానికి మ‌హిళ‌ల‌కైనా, పురుషుల‌కైనా న‌డుం చుట్టూ కొల‌త పెర‌గ‌టం అనారోగ్య సంకేతమ‌ని అనేక ప‌రిశోధ‌నల్లో వెల్ల‌డైంది. న‌డుం చుట్టూ కొల‌త పెర‌గ‌డ‌మ‌నేది ఎందుకు మంచిది కాదో, జీవ‌న శైలి జ‌బ్బులు రావ‌డానికి ఇదెలా కార‌ణ‌మ‌వుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

reduce-fat-around-waist
reduce-fat-around-waist

By ETV Bharat Telugu Team

Published : Dec 31, 2023, 7:43 AM IST

Reduce Fat Around Waist :మ‌గ‌వాళ్ల‌కు పెద్ద పొట్ట‌, బ‌ట్ట‌త‌ల ఉన్నా వారు పెద్ద‌గా ప‌ట్టించుకోరు. వివాహం త‌ర్వాత లేదా సంతానం క‌లిగిన త‌ర్వాత మ‌హిళ‌లు బ‌రువు పెర‌గ‌డం ప్రారంభిస్తారు. బ‌రువు పెర‌గ‌డం, న‌డుం చుట్టు కొల‌త క్ర‌మంగా పెరుగుతూ పోవ‌డం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. దీని వ‌ల్ల గుండెపోటు, షుగ‌ర్‌, కిడ్నీలు పాడ‌వ‌టం, దాంప‌త్య సుఖం పొంద‌లేక‌పోవ‌డం, నిద్ర స‌రిగా ప‌ట్ట‌క‌పోవ‌డం లాంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి. వీటి వెన‌క మ‌న పొట్ట‌లో భారీగా పేరుకుపోయిన కొవ్వు ప్ర‌త్య‌క్షంగానో, పరోక్షంగానో కార‌ణంగా ఉంటుంద‌ని ప‌రిశోధ‌న‌ల్లో వెల్ల‌డ‌వుతోంది. బీపీ, షుగ‌ర్ లాగే న‌డుం చుట్టు కొల‌త ఆరోగ్యాన్ని అంచ‌నా వేయ‌డానికి తోడ్ప‌డుతుంది.

"పొట్ట చుట్టూ కొవ్వు పెరిగే అవ‌కాశాలు మ‌న భారతీయులకు ఎక్కువ‌గా ఉంటుంది. మ‌గవాళ్లలో 90 సెంటీమీట‌ర్లు, ఆడ‌వాళ్ల‌లో 80 శాతం చుట్టు కొల‌త దాటినా బీపీ, షుగ‌ర్‌, కిడ్నీ వ్యాధులు వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ ఉన్నాయి. న‌డుం చుట్టుకొల‌తను చూడాలంటే ఒక మెజ‌రింగ్ టేప్ తీసుకుని కొలుచుకోవాలి. అది రిక‌మెండేష‌న్ కంటే త‌క్కువ ఉంటే కొవ్వు త‌క్కువ ఉన్న‌ట్లు, ఎక్కువ ఉంటే కొవ్వు అధికంగా ఉన్న‌ట్లు. పొట్ట‌భాగంలో ఉండే కొవ్వును విస‌ర‌ల్ ఫ్యాట్ అంటారు. స‌బ్ క్యుట‌న‌స్ ఫ్యాట్ అంటే చ‌ర్మం కింద ఉండేవి. విస‌ర‌ల్ ఫ్యాట్ వ‌ల్ల క్రానిక్ వ్యాధులు వ‌చ్చే అవ‌కాశాలుంటాయి. డెక్సా స్కాన్ అనే ప‌రీక్ష ద్వారా మ‌న‌కు ఎక్క‌డ‌ ఎంత శాతం కొవ్వు ఉందో తెలుసుకోవ‌చ్చు. అందులో వ‌చ్చిన ఫ‌లితాల‌ను బ‌ట్టి త‌గిన మార్గాలు వెతుక్కోవాలి."
- డా. దిలీప్ నంద‌మూరి, జ‌న‌ర‌ల్ ఫిజీషియ‌న్‌, డ‌యాబెటాల‌జిస్ట్

నడుం చుట్టుకొల‌త అంద‌రికీ ఒకేలా ఉండాల‌ని లేదు. మ‌హిళల్లో 35 అంగుళాలు, పురుషుల్లో 31.5 అంగుళాలు మించితే అవ‌య‌వాల చుట్టూ కొవ్వు పేరుకుపోయింద‌న‌టానికి సూచ‌న‌గా భావించాలి. పొట్టలో కొవ్వు అధికంగా ఉండ‌టం మంచిది కాదు. అవ‌య‌వాల చుట్టూ పేరుకున్న కొవ్వు ఇంకా హాని క‌లిగిస్తుంది. ఈ కొవ్వు విచ్ఛిన్న‌మైన‌ప్పుడు ర‌క్తంలోకి కొవ్వు ఆమ్లాలు పెద్ద మొత్తంలో చేరుకుంటాయి. ఫ‌లితంగా ర‌క్తంలో కొలెస్ట్రాల్ మోతాదు పెరుగుతుంది. గుండె జ‌బ్బులు వ‌చ్చే అవ‌కాశం పెరుగుతుంది. కొవ్వు మూలంగా క‌ణాలు ఇన్సులిన్ హార్మోనుకు స్పందించ‌డం త‌గ్గుతుంది. దీని వ‌ల్ల మ‌ధుమేహం వ‌చ్చే ఛాన్స్ ఉంది. అవ‌య‌వాల చుట్టూ పెరిగే కొవ్వు క‌ణజాలం లోప‌లి ర‌క్త‌నాళాలు సన్న‌బ‌డ‌టానికి తోడ్ప‌డుతుంది. దీంతో ర‌క్త‌పోటు కూడా పెరుగుతుంది. న‌డుం చుట్టూ కొవ్వు పెర‌గ‌డం జీవ‌క్రియ రుగ్మ‌త‌గా వైద్యులు చెబుతారు.

కొల‌త ఇలా తీసుకోవాలి
న‌డుం చుట్టు కొల‌త‌ను లెక్కించ‌డానికి ఒక టేపు తీసుకుని తిన్న‌గా నిలుచుకోవాలి. త‌ర్వాత తుంటి ఎముకకు పైన న‌డుము చుట్టూ టేపును తిప్పి కొల‌వాలి. ఆ స‌మ‌యంలో పొట్ట లోప‌లికి లాక్కోవ‌ద్దు. విశ్రాంతిగా నిలుచుని శ్వాస బ‌య‌టికి వ‌దిలిన‌ప్పుడు చుట్టు కొల‌త తీసుకోవాలి. కొంద‌రికి బొజ్జ లేక‌పోయినా లోప‌ల కొవ్వు ఎక్కువ‌గా ఉండొచ్చు. ఇలాంటి వారు ఆహార, వ్యాయామాల‌తో కొవ్వును క‌రిగించుకునే ప్ర‌య‌త్నం చేయాలి.

ఇవి తినాలి!
కొవ్వు క‌రిగించుకునేందుకు మ‌హిళ‌ల‌కు కాల్షియం బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. కాబ‌ట్టి వారు ఆకుకూర‌లు, పాలు, పాల ప‌దార్థాలు, చీజ్‌, చేప‌లు తినాలి. వ‌న‌స్ప‌తి, సాఫ్ట్ డ్రింక్స్​కు దూరంగా ఉండాలి. ర‌క‌ర‌కాల పండ్లు, కూర‌గాయ‌లు, చిరు ధాన్యాలు ఆహారంలో భాగం చేసుకోవాలి. ప్రొటీన్ కోసం ప‌ల్చ‌టి మాంసం, గుడ్లు తీసుకోవ‌చ్చు. శాకాహారులైతే చిక్కుళ్లు, వెన్న తీసిన పాల ఉత్ప‌త్తులు తినొచ్చు. కొవ్వును క‌రిగించే విష‌యంలో ఆహార, వ్యాయామ విష‌యాల్లో అస్స‌లు మొహ‌మాట‌ప‌డ‌కూడ‌దు. కొవ్వు ప‌దార్థాలకు, బేక‌రీ ఐటెమ్స్, రెడీమేడ్ ఆహార ప‌దార్థాల‌కు దూరంగా ఉండాలి. ఆల్క‌హాల్, బేవ‌రేజెస్ బాగా త‌గ్గించుకోవాలి. ఉద‌యం భారీగా, మ‌ధ్యాహ్నం మ‌ధ్య‌స్థంగా, రాత్రికి కొంచెం త‌క్కువ తిన‌టం అల‌వాటు చేసుకోవాలి. ప్ర‌త్యేకించి పొట్ట‌ను త‌గ్గించే వ్యాయామాలేవీ లేవు. కానీ, మొత్తం బ‌రువును అదుపులో ఉంచి శ‌రీరాన్ని ఆరోగ్యంగా ఉంచే న‌డ‌క‌, జాగింగ్, ఈత, యోగ వంటి వాటిని సాధ‌న చేయ‌డం మేలు.

'ఆ మాత్రం గుప్పెడు పొట్ట ఉండదా?' అనుకోవద్దు! ఆ కొవ్వుతో ఎంతో ప్రమాదం!

పొట్ట కొవ్వు కరిగించాలా? ఈ 5 సింపుల్​ ఆసనాలు ట్రై చేయండి!

Curry Leaves Benefits : క‌రివేపాకు ఆరోగ్య ప్రయోజనాలు.. కొవ్వు కరుగుతుంది!.. క్యాన్సర్​ దరిచేరదు!

ABOUT THE AUTHOR

...view details