తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

చిన్నవయసులోనూ గుండెపోటు ముప్పు.. కారణమేంటి? - యుక్తవయులో కార్డియక్​ అరెస్ట్

Cardiac Arrest: గుండెజబ్బుతో ఎవరైనా హఠాత్తుగా చనిపోయారనగానే ముందుగా గుర్తొచ్చేది గుండెపోటు. వయసు మీద పడటం, శారీరక శ్రమ అంతగా చేయకపోవడం, రక్తంలో కొలెస్ట్రాల్‌ పెరగటం, ఊబకాయం, పొగ తాగే అలవాటు.. మధుమేహం, అధిక రక్తపోటు వంటి జబ్బులు ఉండటం దీని ముప్పు పెరిగేలా చేస్తాయి. మరి ఇలాంటి కారకాలేవీ లేకపోయినా.. శారీరక శ్రమ, వ్యాయామం చేసేవారు సైతం చిన్నవయసులోనే హఠాత్తుగా గుండెజబ్బుతో ఎందుకు మరణిస్తున్నారు? ఇప్పుడు చాలామంది మదిలో మెదులుతున్న ప్రశ్న ఇది. దీనికి కారణమేంటి?

HEALTH STORY
యువ గుండెకు షాక్‌

By

Published : Mar 1, 2022, 11:02 AM IST

Cardiac Arrest: గుండెపోటుతో ఉన్నట్టుండి గుండె చేతులెత్తేయటం నిజమే. పూడికలతో గుండె రక్తనాళాలు మూసుకుపోవటమో, పూడికలు చిట్లిపోయి రక్తం గడ్డకట్టటమో.. కారణమేదైనా గుండెకు రక్తసరఫరా నిలిచిపోవటం గుండెపోటుకు దారితీస్తుంది. దీంతో కొన్నిసార్లు హఠాత్తుగా చనిపోయే ప్రమాదముంది. అయితే గుండెపోటు ఒక్కటే కాదు.. గుండె కొట్టుకోవటానికి తోడ్పడే విద్యుత్‌ వ్యవస్థ సమస్యలతోనూ హఠాత్తుగా మరణం సంభవించొచ్చు. దీన్నే 'సడెన్‌ కార్డియాక్‌ అరెస్ట్‌' అంటారు. ఇందులో గుండె ఉన్నట్టుండి కొట్టుకోవటం ఆగిపోతుంది. దీంతో శ్వాస ఆగిపోతుంది. స్పృహ తప్పుతుంది. దీనికి రక్తనాళాల్లో పూడికలతో సంబంధం లేదు. గుండెపోటును ఇంట్లో నీటి గొట్టాల్లో ఏర్పడే అడ్డంకితో పోల్చుకోవచ్చు. అదే విద్యుత్‌ వ్యవస్థ అస్తవ్యస్తం కావటాన్ని విద్యుత్‌ తీగల్లో షార్ట్‌ సర్క్యూట్‌గా అనుకోవచ్చు. ఈ రెండు సమస్యల మూలాలు వేరు. విద్యుత్‌ వ్యవస్థతో గుండె ఆగిపోయేవారిలో చాలామంది ఆరోగ్యంగానే ఉంటారు. వ్యాయామం, శారీరకశ్రమ వంటివి బాగానే చేస్తుంటారు. కానీ విద్యుత్‌ వ్యవస్థ అస్తవ్యస్తం కావటంతో గుండె హఠాత్తుగా పనిచెయ్యటం మానేస్తుంది. వెంటనే చికిత్స అందకపోతే ప్రాణాపాయానికీ దారితీస్తుంది.

కారణాలేంటి?

శారీరకంగా ఫిట్‌గా ఉండి, అధిక రక్తపోటు, మధుమేహం వంటి ముప్పు కారకాలేవీ లేకపోయినా చిన్న వయసులోనే హఠాత్తుగా గుండె ఆగిపోయి చనిపోవటానికి రకరకాల అంశాలు దోహదం చేయొచ్చు.

గుండె లయ తప్పటం:

ప్రధాన కారణం ఇదే. మన గుండె కొట్టుకోవటానికి ప్రత్యేక విద్యుత్‌ వ్యవస్థ తోడ్పడుతుంది. గుండె వేగం, లయను నియంత్రించేది ఇదే. ఈ విద్యుత్‌ వ్యవస్థ అస్తవ్యస్తమైతే గుండెలయ దెబ్బతింటుంది (అరిత్మియా). దీంతో గుండె చాలా వేగంగా కొట్టుకోవచ్చు. లేదూ నెమ్మదిగా కొట్టుకోవచ్చు. కొన్నిసార్లు పూర్తిగా ఆగిపోనూ వచ్చు. గుండెలయ సమస్యల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది గుండె కింది గదులకు సంబంధించిన వెంట్రిక్యులర్‌ టెకీకార్డియా, వెంట్రిక్యులర్‌ ఫిబ్రిలేషన్‌ గురించే. హఠాత్తుగా గుండె ఆగిపోవటానికి 99% వరకు కారణం ఇవే. వెంట్రిక్యులార్‌ ఫిబ్రిలేషన్‌లో గుండె కొట్టుకోవటమనేదే ఉండదు. విద్యుత్‌ వ్యవస్థలో షార్ట్‌ సర్క్యూట్‌ తలెత్తినట్టుగా గుండె ఆగిపోతుంది. అదే టెకీ కార్డియాలో గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది. ఇది హఠాత్‌ మరణానికి దారితీయదు. కానీ క్రమంగా వెంట్రిక్యులర్‌ ఫిబ్రిలేషన్‌కు దారితీస్తుంది. ఇది ఉన్నట్టుండి గుండె ఆగిపోయి, చనిపోవటానికి కారణమవుతుంది.

రక్తనాళాల్లో పూడికలు:

గుండెపోటు, విద్యుత్‌ వ్యవస్థ సమస్యలు వేర్వేరు అయినా కొందరికి గుండె రక్తనాళాల్లో పూడికల మూలంగానూ హఠాత్తుగా గుండె ఆగిపోవచ్చు. గుండెపోటుతో చనిపోతున్నవారిలో 50% వరకు మరణాలకు కారణమిదే. ఇలాంటివారు సాధారణంగా ఛాతీ నొప్పి, అసౌకర్యం వంటి లక్షణాలు మొదలైన గంటలోపు కుప్పకూలటం చూస్తుంటాం.

జన్యువులు:

కొందరికి జన్యువుల్లో తేడాల వల్ల కణస్థాయిలో సొడియం, పొటాషియం మార్గాల్లో లోపాలు ఉంటాయి. దీంతో గుండె విద్యుత్‌ వ్యవస్థ సరిగా పనిచేయక కుప్పకూలుతుంది.

మందులు:

గుండె విద్యుత్‌ వ్యవస్థ అస్తవ్యస్తమయ్యే స్వభావం గలవారికి కొన్ని మందులు సైతం ప్రమాదకరంగా పరిణమించొచ్చు. ముఖ్యంగా యాంటీహిస్టమిన్లు, అజిత్రోమైసిన్‌ వంటివి విద్యుత్‌ వ్యవస్థ ప్రక్రియ అస్తవ్యస్తమయ్యేలా చేయొచ్చు. ఇవి వెంట్రిక్యులార్‌ ఫిబ్రిలేషన్‌ను ప్రేరేపిస్తాయి. దీంతో ఉన్నట్టుండి కుప్పకూలిపోయే ప్రమాదముంది.

తీవ్ర శ్రమ:

కొందరికి తీవ్రమైన వ్యాయామం, శారీరక శ్రమ, ఆటలతోనూ గుండె విద్యుత్‌ వ్యవస్థ విఫలం కావచ్చు. అయితే వీరిలో చాలామందికి అప్పటికే వంశపారంపర్యంగా గుండె కండరం మందం కావటం (హైపర్‌ట్రోపిక్‌ కార్డియోమయోపతీ) వంటి గుండె సమస్యలుంటాయి. ఇలాంటివారు తీవ్రమైన శ్రమ చేసినప్పుడు అడ్రినలిన్‌ హార్మోన్‌ విడుదలై, విద్యుత్‌ వ్యవస్థ మీద విపరీత ప్రభావం పడుతుంది.

ఇతర భాగాల్లో రక్తం గడ్డలు: కొందరికి ఇతర భాగాల్లో ఏర్పడే రక్తం గడ్డలు గుండె రక్తనాళాలకు చేరుకోవటంతోనూ (పల్మనరీ ఎంబాలిజమ్‌) హఠాత్తుగా గుండె ఆగిపోవచ్చు. ఉదాహరణకు- గంటలకొద్దీ కదలకుండా కూర్చొని ప్రయాణాలు చేసేవారిలో కాళ్లలోని రక్తనాళాల్లో రక్తం గడ్డలు ఏర్పడొచ్చు. ఇవి ఊపిరితిత్తులకు, అక్కడ్నుంచి గుండె రక్తనాళాలకు చేరుకొని హఠాత్తుగా గుండె ఆగిపోయేలా చేయొచ్చు.

ఖనిజ లవణాల లోపం: గుండె విద్యుత్‌ వ్యవస్థలో పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజ లవణాలు కీలక పాత్ర పోషిస్తాయి. రక్తంలో వీటి మోతాదులు పడిపోవటమూ హఠాత్‌ గుండె మరణాలకు దారితీయొచ్చు.

దురలవాట్లు: పొగ తాగటం, గుట్కా నమలటం.. కొకైన్‌ వంటి మాదక ద్రవ్యాల వాడకంతోనూ హఠాత్తుగా గుండె ఆగిపోయే ప్రమాదముంది.

కొవిడే కారణం కాదు

గుండెజబ్బు మరణాలను ఇటీవల కొవిడ్‌-19తో ముడిపెట్టటం కనిపిస్తోంది. ప్రస్తుతం కొవిడ్‌ ఎక్కువగా వ్యాప్తిలో ఉండటం.. ఇది గుండె సమస్యలకు, రక్తం గడ్డలకు దారితీసే అవకాశం ఉండటమే దీనికి కారణం. కానీ ప్రతి గుండెజబ్బు మరణానికి కొవిడే కారణం కాదని గుర్తించాలి. గుండెపోటుతో, గుండెజబ్బుతో చనిపోతున్న వారి సంఖ్య ప్రస్తుతం హఠాత్తుగా ఎక్కువేమీ కాలేదని తెలుసుకోవాలి.

నివారించుకోవచ్చా?

గుండె ఆగిపోవటం అప్పటికప్పుడు తలెత్తే సమస్య. ఎవరికైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. ఇటీవల చిన్నవయసులోనే ఎంతోమంది దీని బారినపడటం కలవరం కలిగిస్తోంది. దురదృష్టవశాత్తు దీన్ని నివారించుకోవటానికి ప్రత్యేకమైన విధానాలేవీ లేవు. గుండె ఆరోగ్యానికి తోడ్పడే పద్ధతులే దీనికీ ఉపయోగపడతాయి. అప్పుడప్పుడు రక్తంలో కొలెస్ట్రాల్‌, గ్లూకోజు మోతాదులు, రక్తపోటు పరీక్షలు చేయించుకోవాలి. ఎక్కువైతే తగు చికిత్సలు తీసుకోవాలి. కొలెస్ట్రాల్‌ ఎక్కువైనవారికి స్టాటిన్స్‌ బాగా ఉపయోగపడతాయి.

  • ఇటీవలి కాలంలో జిమ్‌లో కఠినమైన వ్యాయామాలు చేయటం, పెద్ద పెద్ద బరువులెత్తటం ఎక్కువైంది. ఏవైనా గుండెజబ్బులుంటే కఠినమైన వ్యాయామాలు చేసినప్పుడు గుండె లయ అదుపుతప్పే ప్రమాదముంది. కాబట్టి ఇలాంటి వ్యాయామాలను ఆరంభించే ముందు ఒకసారి ఈసీజీ పరీక్ష చేయించుకోవాలి. అప్పటికే గుండెజబ్బులేవైనా ఉంటే గుర్తించి, జాగ్రత్త పడటానికి వీలుంటుంది.

నిర్ధరణ ఎలా?

హఠాత్తుగా గుండె ఆగిపోవటం ఎలాంటి సంకేతాలు, హెచ్చరికలు లేకుండానే విరుచుకుపడుతుంది. కాబట్టి దీన్ని పరీక్షలతో నిర్ధరించటమనేది అరుదు. చాలావరకు జబ్బు తలెత్తాకే పరీక్షలు చేస్తుంటారు. హఠాత్తుగా కుప్పకూలటానికి ఇతరత్రా సమస్యలేవైనా కారణమవుతున్నాయో తెలుసుకోవటానికివి ఉపయోగపడతాయి.

చికిత్సలేంటి?

హఠాత్తుగా గుండె ఆగటం అత్యవసర సమస్య. కాబట్టి సత్వరం స్పందించాల్సి ఉంటుంది. శ్వాస ఆగటం, స్పృహ తప్పటం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డిఫ్రిబిలేటర్‌తో తిరిగి గుండె కొట్టుకునేలా చేయాల్సి ఉంటుంది. దీన్ని జాగ్రత్తగా ఛాతీకి తాకించి, తీస్తే గుండెకు విద్యుత్‌ షాక్‌ తగులుతుంది. ఫలితంగా ఆగిన గుండె తిరిగి కొట్టుకోవటం మొదలవుతుంది. కొన్నిసార్లు కార్డియో పల్మనరీ రిససికేషన్‌ (సీపీఆర్‌) పద్ధతి ఉపయోగపడుతుంది. ఇందులో ఛాతీ మధ్యలో అరచేతితో పదే పదే గట్టిగా నొక్కుతూ, పైకి తీయాల్సి ఉంటుంది. ఇది గుండె తిరిగి కొట్టుకోవటానికి తోడ్పడుతుంది. ఛాతీనొప్పి, స్పృహ తప్పటం వంటివి మొదలైన వెంటనే దీన్ని చేయగలిగితే కొంతరకు ఫలితం కనిపించొచ్చు. ఆలస్యంగా చేస్తే పెద్దగా ఉపయోగమేమీ ఉండదు.

  • గుండె లయ తప్పే సమస్యలు గలవారికి ఫేస్‌ మేకర్‌ అమర్చటం మేలు చేస్తుంది. ఇది గుండె ప్రమాదకరంగా కొట్టుకుంటున్నప్పుడు గుండెకు ప్రచోదనాలు అందిస్తుంది. దీంతో గుండె తిరిగి సక్రమంగా కొట్టుకుంటుంది. ఫలితంగా హఠాత్తుగా గుండె ఆగిపోయే ముప్పు తగ్గుతుంది.

లక్షణాలు

  • హఠాత్తుగా గుండె ఆగటంలో ముందస్తు లక్షణాలేవీ ఉండవు. లక్షణాలు అప్పటికప్పుడే మొదలవుతాయి.
  • ఉన్నట్టుండి కుప్పకూలటం
  • నాడి కొట్టుకోకపోవటం
  • శ్వాస తీసుకోకపోవటం
  • స్పృహ తప్పటం
  • అయితే కొన్నిసార్లు హఠాత్తుగా గుండె ఆగిపోవటానికి ముందు కొన్ని లక్షణాలు, సంకేతాలు కనిపించొచ్చు.
  • ఛాతీలో బిగపట్టినట్టు ఉండటం
  • ఆయాసం
  • బలహీనత
  • శ్వాస వేగంగా తీసుకోవటం
  • గుండె అదరటం

గుండెలో విద్యుత్తు వ్యవస్థ

గుండెలో ప్రత్యేకమైన విద్యుత్‌ ప్రసరణ వ్యవస్థ ఉంటుంది. కర్ణికలు (పై రెండు గదులు- ఏట్రియమ్స్‌), జఠరికలు (కింది రెండు గదులు- వెంట్రికల్స్‌) లయబద్ధంగా కొట్టుకోవటానికి తోడ్పడేది ఇదే. కుడి కర్ణికలో సైనోఏట్రియల్‌ (ఎస్‌ఏ) నోడ్‌ అనే ప్రత్యేక కణ సముదాయం ఉంటుంది. దీన్ని గుండె సహజ చోదకశక్తిగా పిలుచుకుంటారు. దీన్నుంచి పుట్టుకొచ్చే విద్యుత్‌ ప్రచోదనం గోడల గుండా ప్రసరిస్తూ కర్ణికలు సంకోచించేలా చేస్తుంది. అనంతరం ఈ ప్రచోదనం గుండె మధ్యలోని ఏట్రియోవెంట్రిక్యులర్‌ (ఏవీ) నోడ్‌ అనే ప్రత్యేక కణ సముదాయానికి చేరుకుంటుంది. ఈ నోడ్‌ గేటులా పనిచేస్తూ.. విద్యుత్‌ ప్రచోదనం వేగాన్ని తగ్గించి జఠరికల్లోకి వెళ్లేలా చేస్తుంది. పర్కింజీ అనే ప్రత్యేకమైన కణాలతో కూడిన మార్గాలు జఠరికల గోడలకు ప్రచోదనాన్ని చేరవేస్తాయి. ఫలితంగా జఠరికలు సంకోచిస్తాయి. ఇదంతా ఒక లయబద్ధంగా సాగుతుంది. విద్యుత్‌ ప్రసరణ వ్యవస్థ అస్తవ్యస్తమైతే గుండె కొట్టుకునే తీరూ దెబ్బతింటుంది. ఉన్నట్టుండి మరీ ఎక్కువగా అస్తవ్యస్తమైతే హఠాత్తుగా గుండె ఆగిపోచ్చు కూడా.

-డా. ఎన్​.కృష్ణారెడ్డి, కార్డియాలజిస్ట్​

ఇవీ చూడండి:

ఈ ఏడు సూత్రాలు గుండెకు ఎంతో మేలు..

CPR Technique: గుండె ఆగినా... సీపీఆర్‌ చేస్తే ప్రాణం పదిలమే..

Heart Attack Causes : యుక్త వయసులోనే ఆకస్మిక గుండెపోటు.. కారణాలు ఇవే..

ABOUT THE AUTHOR

...view details