Reason For Cheating In Relationship :పెద్దల సమక్షంలో.. బంధు మిత్రుల సాక్షిగా.. తాము నమ్మి ఆచరించే మత విశ్వాసాల ప్రకారం.. ఆడ, మగ ఇద్దరూ భార్యాభర్తలుగా మారుతారు. జీవితాంతం కష్టసుఖాల్లో తోడుగా ఉంటామని ప్రమాణం చేసిన వారు.. ఆ తర్వాత "తప్పు"టడుగులు వేస్తుంటారు. తాత్కలిక సుఖాల కోసం.. భాగస్వామికి నమ్మక ద్రోహం చేస్తుంటారు. ఈ "తప్పులే" సంసారాలను ఛిన్నాభిన్నం చేస్తాయి. చివరకు.. హత్యలు, ఆత్మహత్యలకూ దారితీస్తాయి. పిల్లలను అనాథలను కూడా చేస్తాయి. మరి.. ఇంతటి దారుణ పరిస్థితులకు.. తొలి అడుగు ఎక్కడ పడుతుంది? ఎందుకు ఇలా మారిపోతారు? అనే ప్రశ్నలకు చాలా కారణాలుంటాయని చెబుతున్నారు మానసిక నిపుణులు. అందులో ముఖ్యమైన 5 కారణాలు తెలుసుకుందాం.
1. దంపతుల మధ్య ప్రేమ లేకపోవడం..
భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని దెబ్బతీసే అంశాల్లో మొదటిది.. ఒకరిపై మరొకరికి ప్రేమ లేకపోవడం. ఇష్టం లేని వారికి ఇచ్చి పెళ్లి చేయడం.. బలవంతంగా ఇద్దరికీ ముడివేయడం.. పెళ్లికి ముందే మరొకరిని ప్రేమించడం.. వంటి కారణాలతో.. భార్యాభర్తల మధ్య ప్రేమ ఉండదు. ప్రేమ లేకపోతే ఏ బంధమైనా కాలం గడిచేకొద్దీ ముక్కలైపోతుంది. అందుకే.. దంపతుల మధ్య ప్రేమ అనివార్యం. ఒకరిపై ఒకరికి ఇష్టం లేకపోతే.. ఆ బంధం కలకాలం సజావుగా సాగే అవకాశాలు తక్కువ అంటున్నారు నిపుణులు.
2. లైంగిక అవసరాలు..
నిద్రహారాల తర్వాత మనిషికి సెక్స్ అనేది అత్యంత అవసరం. అందుకే.. పెళ్లి అనేది శృంగారానికి "లైసెన్స్" అనేవాళ్ల సంఖ్య కూడా పెద్దగానే ఉంది. దంపతుల మధ్య చక్కటి శృంగారం ఉండాల్సిందే. భాగస్వామి లైంగిక కోరికలను తీర్చలేకపోతే.. పక్క చూపులు చూడాల్సిన పరిస్థితులు రావొచ్చని అంటున్నారు. కుటుంబం, సంప్రదాయాలు, కట్టుబాట్లకు తలొగ్గి కొందరు అలాగే ఉండిపోతారు. కానీ.. కొందరు మాత్రం ఆ గీతను దాటేస్తారు. తమ లైంగిక అవసరాలను తీర్చుకోవడానికి వివాహేతర సంబంధాలను కొనసాగిస్తారు.
3. ఆధిపత్య ధోరణి..
దాంపత్యంలో.. ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఒకరికోసం మరొకరు బతకాలి. ఒకరి ఇష్టాలు మరొకరి ఇష్టంగా మారాలి. అప్పుడే ఆ బంధం సంతోషంగా ముందుకు సాగుతుంది. కానీ.. చాలా జంటల్లో ఆధిపత్య పోరు కొనసాగుతూ ఉంటుంది. నువ్వా? నేనా? అన్నట్టుగా వ్యవహరిస్తుంటారు. ఈ ధోరణి క్రమంగా ఇద్దరి మధ్యా దూరం పెంచుతుంది. మనసు విప్పి మాట్లాడుకోవడం అనేదే ఉండదు. పని నుంచి ఇంటికి రాగానే ప్రేమగా మాట్లాడుకోవడానికి బదులు.. చిరాకులు, అవమానాలు రాజ్యమేలుతాయి. ఇలాంటి పరిస్థితులు తారస్థాయికి చేరినప్పుడు.. ఇంట్లో మనశ్శాంతి, ప్రేమ కరువైందని మనసు భావించినప్పుడు.. అడుగు గడపదాటుతుంది. ఒకరి కోసం మరొకరు బతికినప్పుడు.. ఇలాంటి పరిస్థితి రాదు.