తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

కంటికి కనిపించని 'ఒత్తిడి'తో పోరాడుతున్నారా.. ఇలా జయించండి.. - Advice of doctors on health problems in women

ఈ మధ్య బరువు పెరిగారా? నెలసరి క్రమం తప్పుతోందా? అకస్మాత్తుగా నడుం నొప్పా? గుండె కొట్టుకునే వేగం ఉన్నట్టుండి పెరుగుతోందా? జుట్టు రాలడం?.. వీటిల్లో ఏ ఒక్కదానికైనా.. సమాధానం ‘అవును’ అయితే.. మీరు కంటికి కనిపించని ‘ఒత్తిడి’ అనే శత్రువు బారిన పడ్డట్టే.  దీని వల్ల మరెన్నో అనారోగ్యాలూ చుట్టుముడతాయని హెచ్చరిస్తున్నారు మానసిక సమస్యల నిపుణురాలు షణ్మితా రాణి.

How to overcome stress
How to overcome stress

By

Published : Nov 15, 2022, 1:29 PM IST

ఒత్తిడి చిన్న పదమే కానీ.. పదేళ్ల పాప నుంచి వయోవృద్ధుల వరకూ అందరినీ కలవరపెడుతోంది. భావోద్వేగాలు మనసుపై చూపే ప్రభావానికి ప్రతిరూపమే ఒత్తిడి. ఈ మానసిక సమస్యని నియంత్రించ లేకపోతే శారీరకంగానూ ఎన్నో బాధలు పడాలి.

అధ్యయనాలేం చెబుతున్నాయి:మగవారి కంటే మనమే రెండు రెట్లు ఎక్కువగా ఒత్తిడికి గురవుతున్నాం. 1990 - 2019 మధ్య ప్రపంచవ్యాప్తంగా మానసిక రుగ్మతలకు గురైన వారిలో స్త్రీలే ఎక్కువ. 15 - 19 వయసున్న అమ్మాయిలపై ఈ ప్రభావం కాస్త ఎక్కువ. హోలోజిక్‌ నివేదిక ప్రకారం 2020-21లో ఉద్యోగ స్థితితో సంబంధం లేకుండా ఒత్తిడి, విచారం, ఆందోళన, కోపం స్థాయులు మగవారిలో 1%, స్త్రీలలో 4% పెరిగాయి.

ఎందుకీ ఒత్తిడి?:అందరినీ మెప్పించాలనే ఆలోచన, ఎవరేం అను కుంటారోనన్న బాధ, అన్నీ మనమే చేయాలనుకునే తత్వం... కారణమేదైనా మనసు స్పందించే విధానం, దాని ప్రభావమే ఒత్తిడి. రేపేం వండాలి, పిల్లలు హోంవర్క్‌ సరిగా చేయట్లేదు, ఆఫీసు నుంచి ఆయన ఇంకా రాలేదు, ఇంట్లో గొడవలు, కుటుంబ సభ్యుల ఆరోగ్యం, జీవన శైలిపై అసంతృప్తి, ఆర్థిక వ్యవహారాలు.. ఇలా ఒకటేమిటి అన్నీ ఒత్తిడి కారకాలే. ఇవికాక శారీరక, లైంగిక వేధింపులు, హార్మోన్ల అసమతుల్యత, గర్భధారణ, ప్రసవానంతర మార్పులు, మెనోపాజ్‌ వంటివీ ఒత్తిడికి దారితీస్తాయి.

ఎలా గుర్తించాలి?:ఇది ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. భావోద్వేగాలు, ప్రవర్తన, ఆలోచనా శక్తి, శారీరక ఆరోగ్యం.. ఇలా అన్నింటినీ దెబ్బతీయొచ్చు. చెమటలు, దద్దుర్లు, కడుపు నొప్పి, అజీర్తి, ఛాతీ నొప్పి, అలసట, తల తిరగడం, తలనొప్పి, మగత, నిద్రలేమి, మతిమరుపు, న్యూనత, కోపం.. ఇలా ఏదోక సమస్య ఎదురవుతుంది. ఒక్క సారిగా బక్కచిక్కి పోతారు. లేదంటే బరువూ పెరుగుతారు. ఆకలి పెరుగుతుంది లేదా పూర్తిగా తగ్గుతుంది. ఏకాగ్రత కొరవడు తుంది, నిర్ణయాలు తీసుకోలేరు. దేనిమీదా ఆసక్తి ఉండదు. చిన్న విషయానికీ చికాకు, భయం, ఆందోళన. నలుగురితో కలవడానికి అయిష్టత. తమ గురించి తాము పట్టించు కోరు. భర్త పట్లా నిరాసక్తత.. ఇలా ఎన్నెన్నో లక్షణాలు కనిపిస్తాయి.

నష్టాలేంటి?:ఒత్తిడితో.. కార్టిసోల్‌, అడ్రినలిన్‌ హార్మోన్లు ఉత్పత్తవుతాయి. ఇవి కండరాలను ఉత్తేజితం చేస్తాయి. ఫలితంగా గుండె వేగంతో పాటు రక్తపోటూ పెరుగుతుంది. ఎప్పుడో ఓసారి పరిమితంగా వచ్చే ఒత్తిడి మేలు చేస్తుంది. కానీ తరచూ ఎదురైతే అనారోగ్యాలు కమ్మేస్తాయి. మొదట ఏర్పడే ముప్పు హార్మోన్ల అసమతుల్యత. ఆపై రక్తపోటు, గుండె సమస్యలు, ఊబకాయం, నెలసరి ఇబ్బందులు, పానిక్‌ డిజార్డర్స్‌, అబ్సెసివ్‌ కంపల్సివ్‌ డిజార్డర్‌ వంటివెన్నో.

అదుపు చేయలేమా?:చక్కగా చేయచ్చు. ముందు కారణాల్ని గుర్తించాలి. పరిష్కారం మీద దృష్టి పెట్టాలి. ఈ విషయంలో తోడ్పడాల్సింది భర్త, కుటుంబ సభ్యులు, స్నేహితులే. వారి సాయంతో.. ప్రణాళికా బద్ధంగా జీవనశైలిని మార్చుకోవాలి. యోగా, ధ్యానం వల్ల కార్టిసోల్‌ హార్మోన్‌, రక్తపోటు, గుండె వేగం తగ్గుతాయి. శ్వాస వ్యాయామాలూ ఫలితమిస్తాయి. కంటి నిండా నిద్రపోవాలి. సంగీతం, సైక్లింగ్‌.. ఇలా నచ్చిన వ్యాపకంపై సమయం వెచ్చిస్తే.. ఒత్తిడి దరిచేరదు.

గ్లూటెన్‌ వద్దు!:పోషకాలూ చాలా అవసరం. ముఖ్యంగా డి విటమిన్‌ లోపించినప్పుడు యాంగ్జైటీ, డిప్రెషన్‌ వంటివి ఎదురవుతాయి. నివారణకు.. ఎండ తగిలేలా చూసుకోవడం, పాలు, పెరుగు, చేపలు, గుడ్డులోని పచ్చసొన, పుట్ట గొడుగులు, మాంసం, చిలగడదుంప, అవకాడో.. వంటివి తీసుకోవాలి. వీటి నుంచి ‘డి’తోపాటు ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, బి, సి విటమిన్లూ పుష్కలంగా లభిస్తాయి. ఇవి ఒత్తిడికి కారణమయ్యే కార్టిసోల్‌ స్థాయుల్ని తగ్గిస్తాయి. వాల్‌నట్స్‌, గుమ్మడి, సబ్జా, అవిసె గింజలను తింటే మంచిది.

పసుపులోని కర్క్యుమిన్‌ యాంగ్జైటీ తీవ్రతను తగ్గిస్తుంది. అల్జీమర్స్‌, పార్కిన్సన్‌, డిప్రెషన్‌ల తీవ్రతను తగ్గిస్తుంది. కాఫీ, టీలతో పాటు జీర్ణ సమస్యలకు కారణమయ్యే గ్లూటెన్‌ అధికంగా ఉండే బ్రెడ్‌, గోధుమలు, పాస్తా, బిస్కెట్లు, చాక్లెట్లు, ప్రాసెస్డ్‌ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి. ఓట్స్‌, రాగులు, చిరుధాన్యాలు.. వంటివి ఆహారంలో భాగం చేసుకుంటే శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. ఇన్ని చేసినా తగ్గకపోతే వైద్యుల్ని కలవడానికి సంకోచించద్దు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details