మానసిక రుగ్మతలతో బాధపడుతున్నవారు మిగతావారితో పోల్చితే కొవిడ్-19తో అధికంగా మృత్యువాత పడడమో, ఆసుపత్రులపాలు కావడమో జరుగుతోందని యూరోపియన్ న్యూరో సైకోఫార్మకాలజీ కళాశాల తాజాగా చేసిన అధ్యయనం వెల్లడించింది. కొన్నిరకాల మందులకు అలవాటుపడ్డ మానసిక రోగులు కొవిడ్‌తో ఎక్కువగా ఆస్పత్రి పాలవుతున్నారని కూడా ఈ అధ్యయనం వెల్లడించింది. దీనికోసం 22 దేశాల్లో 1,469,731 కొవిడ్ రోగుల వివరాలను పరిశీలించారు. అందులో దాదాపు 44 వేలమంది వివిధ మానసిక రోగాలతో బాధపడుతున్నవారేనని తేలింది. అందువల్ల మానసిక రోగులకే మొదటి ప్రాధాన్యతగా వ్యాక్సిన్లు ఇవ్వాలని వైద్యరంగంలోని జాతీయ-అంతర్జాతీయ సంస్థలకు చెందిన పరిశోధకులు పేర్కొంటున్నారు.
వారికే ఎందుకు ప్రాధాన్యమివ్వాలి?
ఈ అధ్యయనంలో పాల్గొన్న బెల్జియంలోని యూనివర్సిటీ సైకియాట్రిక్ ఆసుపత్రి క్యాంపస్ డఫెల్‌కు చెందిన డా. లివియా డి పికర్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ముందుగా మానసిక రోగులకు కొవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి చేయాలన్నారు. మానసిక రోగులే కొవిడ్ వల్ల ఎక్కువగా నష్టపోతున్నారని చెప్పేందుకు ఇంతవరకూ సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో విధానకర్తలు ఈ సూచనలను అమలు చేయలేదన్నారు.
"ఎన్నో దేశాల్లో మానసిక రోగులకు ప్రాథమ్యం ఇవ్వాలని అడిగినప్పడు అక్కడి జాతీయ వైద్య సంస్థలు ఫలానా కేటగరీ రుగ్మతలతో బాధపడుతున్నవారికే కొవిడ్ ముప్పు ఎక్కువనీ, వారిలోనే అత్యధిక మరణాలు ఉన్నాయని, అందువల్ల వారికే ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పే ఆదేశాలేవీ తమకు లేనందున తామేం చేయలేమని జవాబు చెప్పేవారు. కానీ ఈ అధ్యయనం వల్ల ఇక నుంచి అలా చెప్పి, తప్పించుకునేందుకు ఇక వారికి ఆస్కారం ఉండదు" అని ఆయన చెప్పారు.
"మా వద్ద ఉన్న డాటా తీవ్రమైన మానసిక రుగ్మతలతో బాధపడుతున్నవారికి, ఇతరులకు మధ్య తేడాను స్పష్టం చేస్తోంది. సాధారణంగా మానసిక వ్యాధులతో బాధపడేవారిని ఆస్ప్రత్రికి తీసుకెళ్లడంలోనూ ఇబ్బందులు ఉన్నందువల్ల కొవిడ్ మరణాల రేటు వారిలోనే ఎక్కువగా ఉంది. తీవ్ర ముప్పు గల మానసిక రోగులందరికీ పూర్తి స్థాయిలో వ్యాక్సినేషన్ అందించేందుకు వైద్యాధికారులు దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అలాగే కొవిడ్ సోకిన మానసిక రోగులను చాలా జాగ్రత్తగా చూసుకునేందుకు వీలుగా వెంటనే వారిని పెద్ద ఆసుపత్రులకు రెఫర్ చేయాలి" అని డి పికర్ తెలిపారు.