మన దినచర్యలో నిద్ర చాలా ముఖ్యమైన భాగం, కానీ చాలా మంది అనేక కారణాల వల్ల నిద్రలేమితో బాధపడుతున్నారు. ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్యకు కారణం కావచ్చనే విషయం విస్మరిస్తున్నాం. యువత కూడా తరచూ ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ డిజిటల్ ప్రపంచంలో రాత్రిపూట నిద్ర పట్టకపోతే మరో ఎపిసోడ్ లేదా ఇంకో సినిమా చూడటానికి ఇష్టపడతాం. నిద్రలేమి తాత్కాలికమైతే సమస్య కాదు. కానీ దీర్ఘకాలికమైతే మానసిక, శారీరక ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ఈ పరిస్థితి వ్యాధిగా మారినప్పుడు దాన్ని ఎలా అధిగమించాలో తెలుసుకోవటానికి ప్రముఖ మానసిక వైద్య నిపుణురాలు డాక్టర్ వీణ కృష్ణన్ ఏం చెప్పారో చూద్దాం.
నిద్రలేమి, తక్కువ నిద్ర, వేళకు నిద్ర లేకపోవడం చాలా కారణాల వల్ల కలుగుతాయి. ఇవి ఇతర వ్యాధులకు దారితీయవచ్చు. దీనికి కారణం వారి వయస్సు, పరిస్థితి, శారీరక లేదా మానసిక ఆరోగ్యంతో పాటు వారి జీవనశైలికి సంబంధించి ఉంటుందని డాక్టర్ కృష్ణన్ వివరించారు. కొన్ని సందర్భాల్లో ఇది సర్వ సాధారణమైనా ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇతర జబ్బులకు దారితీసి శరీర పనితీరును ప్రభావితం చేయడంతో పాటు పలు శారీరక, మానసిక సమస్యలను కలిగిస్తుంది.
మంచి నిద్ర ఎందుకోసం?:
ఎలక్ట్రో ఎన్సఫలో గ్రఫీ (ఈ.ఈ.జీ) లో కనిపించే తీటా, డెల్టాల తరంగాలు మంచి నిద్రకు సంకేతాలు. నిద్రించే సమయంలో శరీర వ్యవస్థలన్నీ తమను తాము సరి చేసుకోవడానికి, రోగనిరోధక శక్తిని బలోపేతం చేసుకోడానికి సమాయత్తమౌతాయి. నిద్రలో ఈ దశలలో ఏదైనా ప్రభావితమైతే మొత్తం ప్రక్రియ ప్రభావితమవుతుందని డాక్టర్ కృష్ణన్ చెప్పారు. లోతైన నిద్ర చక్కటి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని, ఎదుగుదలను కలిగిస్తాయి.
నిద్రలేమి ఎందుకు కలుగుతుంది:
- అపరిశుభ్రత.
- చంచలత్వం, నిరాశ, ఒత్తిడి, ఆందోళన.
- ఇతర జబ్బులకు వాడుతున్న ఔషధాలు.
- నిద్రలో ఊపిరి ఆడకపోవడం (స్లీప్ అప్నియా), నిరంతరం కాళ్లు కదపడం (రెస్ట్‌లెస్ లెగ్స్ సిండ్రోమ్), నిద్రలో నిస్సత్తువ (స్లీప్ పెరాలిసిస్), సిర్కాడియన్ రిథమ్ డిజార్డర్, ఆకలి లేకపోవడం (అనోరెక్సియా)
- కెఫిన్, నికోటిన్, ఆల్కహాల్, మత్తుమందులు, వీటితో కూడిన ఆహారపానీయాలు శక్తిని ప్రేరేపించి అప్రమత్తతను పెంచుతాయి. ఇవి నిద్రకు ఆటంకం కలిగించడంతో పాటు నిద్ర నాణ్యతను కూడా తగ్గిస్తాయి.
నిద్రలేమి కారణంగా ఎదురయ్యే సమస్యలు:
- నిద్రలేమి వల్ల పక్షవాతం, మూర్ఛ వ్యాధులు, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ, ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు వంటి తీవ్రమైన సమస్యలు కలుగుతాయి.
- నిరాశ, ఒత్తిడి, గందరగోళం, ఆందోళన, చిరాకు ఏర్పడి ఏకాగ్రత లోపిస్తుంది.
- లైంగిక ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.
- మద్యం, మాదకద్రవ్యాలకు బానిస కావడం వంటి సమస్యలు కూడా తలెత్తవచ్చు.
నిద్రలేమికి చికిత్స:
నిద్రలేమి సమస్య తీవ్రంగా ఉంటే, వారికి కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (సిబిటి), హిప్నోసిస్, యోగా, ధ్యానంతో పాటు చికిత్సలో ఔషధాలను కూడా అందిస్తామని డాక్టర్ కృష్ణన్ వివరించారు. ఇంతేకాకుండా, క్రమశిక్షణ కలిగిన దినచర్యను అనుసరించాలని, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను సూచిస్తూ మంచి నిద్ర కోసం రోజువారీ దినచర్యలో వ్యాయామం కూడా చేర్చాలి.
నిద్రలేమిని ఎలా నిరోధించాలి?:
- క్రమశిక్షణ కలిగిన జీవనశైలిని అనుసరించడం.
- నిద్రకు ముందు కాఫీ, టీ లేదా ఇతర ఉత్తేజకర పానీయాలకు దూరంగా ఉండటం.
- రాత్రి తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవడంతో పాటు నిద్రకు కనీసం రెండు గంటల ముందు భోజనాన్ని ముగించడం.
- పగలు నిద్రపోకుండా ఉండటం.
- నిద్రకు కనీసం ఒక గంట ముందు మొబైల్, లాప్ టాప్ స్క్రీన్‌లకు దూరంగా ఉండటం,
- కనీసం 30-45 నిమిషాలు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం.