తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

జబ్బుల మాట వినిపిస్తోందా! పెడచెవిన పెట్టకండి - hair loss

కళ్లు రంగు మారుతున్నాయా? గొంతు వాపు సమస్య ఉందా? పాదాలు చల్లబడుతున్నాయా? జుట్టు ఊడటం, పెదాలు పగలటం, గోళ్లు పొడిబారడం వంటి సమస్యలు ఉన్నాయా? అయితే తాత్సారం చేయకండి. ఇవన్నీ మీరు అనారోగ్యంగా ఉన్నారనేందుకు సంకేతాలు కావచ్చు!

SUKHIBHAVA
జబ్బుల మాట వినిపిస్తోందా! పెడచెవిన పెట్టకండి

By

Published : Jul 28, 2020, 9:36 AM IST

జబ్బులూ మాట్లాడతాయి. అవును.. హెచ్చరికలు, లక్షణాలన్నీ జబ్బుల మాటలే. వీటిని వినగలిగితే ముందుగానే మేల్కోవచ్చు. చిన్న సమస్యలు పెద్దవిగా మారకుండా చూసుకోవచ్చు.

కళ్లు రంగు మారటం

కళ్లు రంగు మారడం

తెల్లగుడ్డు ఎప్పుడూ తెల్లగానే ఉండాలి. ఏమాత్రం రంగు మారినా ఏదో సమస్య ఉన్నట్టే. కళ్ల కలకలో కళ్లు ఎర్రబడటం తెలిసిందే. నిద్రలేమి, తీవ్రమైన జలుబు, కంటి ఇన్‌ఫెక్షన్‌ వంటివీ ఎరుపునకు దారితీయొచ్చు. కామెర్లలోనే కాదు, కాలేయం, పిత్తాశయ సమస్యల్లోనూ కళ్లు పసుపుపచ్చగా అవ్వచ్చు. కళ్లు పచ్చబడి, అస్వస్థతగా ఉన్నట్టయితే తాత్సారం చేయరాదు.

గొంతు వాపు

గొంతు వాపు సమస్య

హఠాత్తుగా గొంతు వాచినట్టయితే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలనే అర్థం. గొంతు ముందు భాగం ఉబ్బితే థైరాయిడ్‌ సమస్యకు సంకేతం కావొచ్చు. జ్వరంతో పాటు గొంతు వద్ద లింఫ్‌ గ్రంథులు వాచినట్టయితే మోనోన్యూక్లియోసిస్‌ ఇన్‌ఫెక్షన్‌ అయ్యిండొచ్చు. చాలావరకు మామూలు జబ్బులతోనే లింఫ్‌ గ్రంథులు ఉబ్బుతుండొచ్చు గానీ కొన్నిసార్లు క్యాన్సర్ల వంటి తీవ్ర జబ్బులకూ ఇది సూచిక కావొచ్చు.

పాదాలు చల్లబడటం

పాదాలు చల్లబడటం

గుండె నుంచి పాదాలు దూరంగా ఉంటాయి. అందువల్ల పాదాలకు తగినంత రక్త సరఫరా జరగక చల్లగా అవ్వచ్చు. ఇది కొన్ని గుండె జబ్బులకూ సంకేతం కావొచ్చు. రోగనిరోధకశక్తి పొరపాటున మన మీదే దాడిచేయటం వల్ల తలెత్తే రేనాల్డ్‌ జబ్బులో రక్తనాళాల మార్గం సన్నబడి పాదాలు, చేతులు పాలిపోతాయి, చల్లగా అనిపిస్తాయి.

హఠాత్తుగా జుట్టు ఊడటం

జుట్టు రాలటం

వెంట్రుకలు ఊడిపోవటం పెద్ద విషయమేమీ కాదు. అకారణంగా హఠాత్తుగా జుట్టు ఊడిపోతుంటే మాత్రం జాగ్రత్త పడాల్సిందే. థైరాయిడ్‌ హార్మోన్‌ తగినంత విడుదల కాకపోయినా, ఎక్కువగా విడుదలైనా జుట్టు ఊడిపోవచ్చు. తీవ్రమైన పోషణలోపంతోనూ వెంట్రుకలు రాలిపోతుండొచ్చు.

పెదాలు పగలటం

పెదాలు పగలటం

ఒంట్లో నీటిశాతం తగ్గటం, విటమిన్ల లోపంతో పెదాలు పగలొచ్చు, పొడిబారొచ్చు. ఇలా వారాల తరబడి కొనసాగుతున్నా, ఏమాత్రం తగ్గకపోతున్నా ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ కారణమై ఉండొచ్చు. పెదాల మీద, చివర్లలో సన్నటి పొక్కులుంటే వెంటనే చికిత్స తీసుకోవాలి. మానసిక ఒత్తిడినీ తగ్గించుకోవాలి.

గోళ్ల మార్పు

గోళ్లు పొడిబారడం

మన ఆరోగ్యం తీరుతెన్నులను చేతివేళ్లు బాగానే చూపిస్తాయి. రంగు, ఆకారం మారిపోవటం వంటివి రకరకాల జబ్బులకు సంకేతాలు కావొచ్చు. రక్తహీనత, గుండె వైఫల్యం, కాలేయ జబ్బు, పోషణలోపంతో గోళ్లు పాలిపోవచ్చు. ఊపిరితిత్తుల జబ్బులో గోళ్లు నీలంగా మారొచ్చు. గోళ్ల పైభాగంలో సన్నటి రంధ్రాల వంటివి సోరియాసిస్‌కు తొలి సంకేతం కావొచ్చు. థైరాయిడ్‌ సమస్యలతో బాధపడేవారిలోనూ గోళ్లు పొడిబారి, చిట్లిపోవచ్చు.

ABOUT THE AUTHOR

...view details