శృంగారం మీద ఆసక్తి తగ్గటం, బలహీనత, నిస్సత్తువ వంటివి తలెత్తితే వయసుతో పాటు వచ్చిన మార్పులుగానే భావిస్తుంటారు. చాలామంది వీటిని కుంగుబాటు లక్షణాలనీ అనుకుంటుంటారు. అయితే మగవారిలో వీటితో పాటు విచారం, బాధ వంటివీ కనిపిస్తే పురుష హార్మోన్ అయిన టెస్టోస్టిరాన్ మోతాదులు తగ్గాయేమో కూడా చూసుకోవటం మంచిది. ఎందుకంటే దీని మోతాదుల్లో మార్పులు మూడ్‌ను సైతం ప్రభావితం చేస్తున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి.
టెస్టోస్టిరాన్ మోతాదులు తగ్గటం వల్ల తలెత్తే లక్షణాలు, కుంగుబాటు లక్షణాలు చాలావరకు కలిసిపోయి ఉంటుండటం గమనార్హం. చిరాకు, మూడ్ మారిపోవటం, శృంగారాసక్తి తగ్గటం, నిస్సత్తువ, హుషారు లేకపోవటం, నలుగురితో కలవలేకపోవటం, ఆందోళన, ఏకాగ్రత కుదరకపోవటం, నిద్ర సరిగా పట్టకపోవటం వంటివి రెండింటిలోనూ కనిపిస్తుంటాయి. దీని మూలంగానే కొన్నిసార్లు టెస్టోస్టిరాన్ తగ్గటాన్ని కుంగుబాటుగానూ పొరపడుతుంటారు.
కాబట్టి మగవారిలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే టెస్టోస్టిరాన్ లోపించి ఉండొచ్చనీ అనుమానించాలి. ఒకవేళ తగ్గినట్టు తేలితే నిర్లక్ష్యం చేయరాదు. ముఖ్యంగా హఠాత్తుగా బరువు పెరగటం, శృంగారాసక్తి లేదా శృంగార సామర్థ్యం తగ్గటం, భావోద్వేగ లక్షణాలను ఎదుర్కొంటుంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. ఇప్పుడు టెస్టోస్టిరాన్ మోతాదులు పెరగటానికి మంచి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి.