తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

కరోనా ఒత్తిడిపై వ్యాయామ ప్రభావం శూన్యం - exercise can not reduce corona pressure

కరోనా జబ్బుతో తలెత్తే ఒత్తిడి మీద వ్యాయామం అంత ప్రభావమేమీ చూపడం లేదని వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ అధ్యయనం పేర్కొంది. జన్యువులు, పరిసరాలు వ్యాయామ ప్రయోజనాలను తొక్కిపెడుతున్నాయని చెప్పింది.

pressure in corona patients can not be reduced with exercise
కరోనా ఒత్తిడిపై వ్యాయామం ప్రభావం శూన్యం

By

Published : Sep 15, 2020, 5:44 PM IST

కరోనా జబ్బు వ్యాయామాన్నీ ‘ఒత్తిడి’కి గురిచేస్తోంది! ఆశ్చర్యంగా అనిపించినా నమ్మక తప్పని పరిస్థితి ఇది. సాధారణంగా వ్యాయామంతో ఆందోళన, ఒత్తిడి తగ్గుముఖం పడతాయి. దీనికి కారణం మెదడులో హాయిని కలిగించే సెరటోనిన్‌ హార్మోన్‌ విడుదల కావటం. అయితే కరోనా జబ్బుతో తలెత్తే ఒత్తిడి మీద వ్యాయామం అంత ప్రభావమేమీ చూపటం లేదని వాషింగ్టన్‌ స్టేట్‌ యూనివర్సిటీ అధ్యయనం పేర్కొంటోంది. జన్యువులు, పరిసరాలు వ్యాయామ ప్రయోజనాలను తొక్కిపెడుతున్నాయని సూచిస్తోంది.

కొవిడ్‌ విజృంభణ మూలంగా ఇంటికే పరిమితమైన కవలల్లో- ఎప్పటి మాదిరిగానే వ్యాయామం చేసినవారితో పోలిస్తే మరింత ఎక్కువగా వ్యాయామం చేసినవారిలో ఒత్తిడి, ఆందోళన తగ్గకపోగా ఇంకాస్త అధికమైంది కూడా. కరోనా భయంతో ఇంటికే పరిమితం కావటం వల్ల ఎంతోమంది వ్యాయామం తగ్గించేస్తున్నారని.. ఇది మానసిక సమస్యలు పెరగటానికి దారితీస్తుందన్నది నిపుణుల భయం. కానీ ఫలితాలు విభిన్నంగా వెలువడటం విచిత్రం. కవలల్లో జన్యువులు దాదాపు ఒకేలా ఉంటాయి. సాధారణంగా ఒకే వాతావరణంలో పెరుగుతారు. అందుకే పరిశోధకులు వ్యాయామం, మానసిక ఆరోగ్యం మీద జన్యువులు, పరిసరాల ప్రభావాలను అర్థం చేసుకోవటానికి కవలలను ఎంచుకున్నారు.

ఒత్తిడిని నియంత్రించుకోవటానికి వ్యాయామం కచ్చితంగా తోడ్పడుతుందని చెప్పలేమని.. వ్యాయామానికీ జన్యువులకూ పరిసరాలకూ ఏదో సంబంధం ఉంటోందని అధ్యయన నేత గ్లెన్‌ డంకన్‌ చెబుతున్నారు. అలాగని వ్యాయామం తగ్గించేయటానికీ లేదు. రోజు మాదిరిగానే వ్యాయామం చేసినవారితో పోలిస్తే తగ్గించినవారిలో ఒత్తిడి, ఆందోళన మునుపటి కన్నా పెరిగిపోయాయి మరి. వృద్ధులు, మహిళల్లో ఇవి మరింత ఎక్కువగానూ కనిపించాయి. అంటే ప్రస్తుత పరిస్థితుల్లో భయంతో వ్యాయామం తగ్గించినా, అతి నమ్మకంతో వ్యాయామం పెంచినా పెద్దగా ప్రభావమేమీ ఉండటం లేదన్నమాట. కరోనా ఆంక్షలు, భయం తొలగిన తర్వాత ఇవి మారిపోయే అవకాశముండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details