Prediabetes Treatment :జీవనశైలిలో మార్పులు, ఉరుకుల పరుగులతో కూడిన జీవితం కారణంగా.. చిన్నా, పెద్ద అనే తేడాలేకుండా షుగర్ (మధుమేహం) వ్యాధి చాలా వేగంగా విస్తరిస్తుందని వైద్యనిపుణులు అంటున్నారు. ఈ వ్యాధినే డయాబెటిస్ అని కూడా పిలుస్తున్నారు. అయితే మధుమేహం వచ్చేముందు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? ప్రీ డయాబెటిస్ అంటే ఏంటి?. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వ్యాధి భారిన పడకుండా ఉండవచ్చు. ఈ విషయాలపై వైద్యుల సూచనలు మీ కోసం.
'జీవనశైలిలో మార్పులే ముఖ్యకారణం'
మారిన జీవన పరిస్థితులు కారణంగా మధుమేహం లాంటి వ్యాధులు వస్తున్నాయని వైద్యలు అంటున్నారు. నిద్రలేమి, ఒత్తిడి, మారిన ఆహారపు అలవాట్లు, శారీరక వ్యాయామం లేకపోవడం వల్ల షుగర్ వ్యాధి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే మధుమేహం వ్యాధి రెండు దశల్లో ఉంటుందని వారు తెలిపారు అవి ప్రీ డయాబెటిస్, డయాబెటిస్.
"షుగర్ వ్యాధి రావడానికి ముందు కనిపించే కొన్ని లక్షణాలను ప్రీడయాబెటిస్ అంటారు. ముఖ్యంగా ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 110 కంటే ఎక్కువగా ఉండి, ర్యాండమ్ షుగర్ 200 కంటే ఎక్కువగా ఉంటే దానిని డయాబెటిస్‌గా పరిగణిస్తారు. ప్రీ డయాబెటిస్ లక్షణాలు పాదాల్లో మంటలు, మెడ భాగంలో చర్మం రంగు మారడం లాంటి లక్షణాలు ఉంటాయి. ఈ షుగర్ వ్యాధి ఒత్తిడితో కూడిన జీవనశైలి కారణంగా వచ్చే అవకాశం ఉంది. తీసుకునే ఆహారం, శారీరక శ్రమ లాంటి పలు అంశాలపై ఆధారపడి ఉంటుంది."
--డాక్టర్. ప్రశాంత్ కుమార్, జనరల్ ఫిజీషియన్