Prediabetes symptoms and treatment: మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను సైతం ప్రభావితం చేస్తున్నాయి. రానున్న దశాబ్దకాలంలో ప్రపంచంలో అరవై కోట్ల మందికి పైగా ప్రజలు మధుమేహం బారిన పడతారని ఒక ప్రాథమిక అంచనా. వీరిలో మూడొంతుల మంది అల్పాదాయ దేశాలకు చెందినవారే ఉంటారని నిపుణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రీ డయాబెటిక్ దశలోనే మధుమేహాన్ని ఎలా నివారించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రీ డయాబెటిక్ అనేది మధుమేహానికి ముందు దశ. ఫాస్టింగ్ గ్లూకోజ్ చూసుకుంటే 100 నుంచి 126 మధ్యలో ఉంటుంది. గ్లూకోజ్ తీసుకున్న రెండు గంటల తర్వాత పరీక్ష చేస్తే 140 నుంచి 200 ఉంటే దానిని ప్రీ డయాబెటిక్‌గా నిర్ధరిస్తారు. హెచ్‌బీఎ1సీ 5.7 నుంచి 6.5 మధ్యలో ఉంటే ప్రీ డయాబెటిస్ అని చెప్పవచ్చు. ఒక్కసారి ఇది నిర్ధరణ అయితే మధుమేహం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.
సరైన ఆహార శైలి, తరచూ వ్యాయామం, బరువు ఎక్కువగా ఉంటే తగ్గడం లాంటి జాగ్రత్తలు పాటిస్తే మధుమేహాన్ని ముందుగానే నివారించవచ్చని అంటున్నారు డాక్టర్లు. ప్రీ డయాబెటిక్ నిర్ధరణ అయ్యాక ప్రతీ ఆరు నెలలకు మధుమేహ పరీక్ష చేయిస్తే మంచింది. ఎందుకంటే ప్రీ డయాబెటిక్‌గా నిర్ధరణ అయిన వారికి మధుమేహం వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి.