తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

వైఫైలా తిరుగుతున్న కరోనా వైరస్.. ‌ఆన్​లైన్‌ ఆర్డర్లతో బీకేర్​ఫుల్! - online orders

ఆన్‌లైన్‌ ఆర్డర్ల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆన్‌లైన్‌ ఆర్డర్స్‌ ద్వారా కూడా కరోనా ముప్పు పొంచి ఉండడమే ఇందుకు కారణం. కొందరు ఫుడ్‌ డెలివరీ బాయ్స్‌ ద్వారా కరోనా సోకిన పలు సంఘటనల గురించి మనం ఇదివరకే విన్నాం. కాబట్టి ఆన్‌లైన్‌ ఆర్డర్‌ చేసినప్పుడు బయటి నుంచి వచ్చే ఎలాంటి వస్తువులైనా, ఆహారమైనా సరే.. అవి ఇంటికొచ్చాక వాటిని ఓపెన్‌ చేసే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలంటున్నారు నిపుణులు. తద్వారా కరోనా ముప్పును మన ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుకోవచ్చంటున్నారు. మరి, ఏంటా జాగ్రత్తలు? రండి తెలుసుకుందాం..

precautions while receiving and opening of online orders
కరోనా అలర్ట్‌ : ఆన్‌లైన్‌ ఆర్డర్ల విషయంలో తస్మాత్‌ జాగ్రత్త!

By

Published : Jul 2, 2020, 12:36 PM IST

కరోనా పొంచి ఉన్న నేపథ్యంలో అత్యవసరమైతేనే బయటికి వెళ్లాలన్న విషయం తెలిసిందే. అయితే వృత్తి ఉద్యోగాల రీత్యా కొందరికి ఆఫీసులకు వెళ్లక తప్పని పరిస్థితి. అలాకాకుండా షాపింగ్స్‌ పేరుతో అనవసరంగా బయటికి వెళ్లడమెందుకని ఏది కావాలన్నా ఆన్‌లైన్‌లోనే ఆర్డర్‌ చేస్తున్నారు చాలామంది. ఇది మంచి పద్ధతే.. అయినప్పటికీ ఆయా వస్తువులకు డబ్బులు చెల్లించే విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలంటున్నారు నిపుణులు. ఎందుకంటే అన్ని ఆన్‌లైన్‌ షాపింగ్‌ సైట్స్‌ ఆన్‌లైన్‌లోనే డబ్బులు చెల్లించే ఆప్షన్‌ ఇవ్వకపోవచ్చు. తద్వారా వస్తువు ఇంటికొచ్చాకే డెలివరీ బాయ్‌కి మనం డబ్బివ్వాల్సి ఉంటుంది. ఇలా నాలుగు చోట్ల తిరుగుతూ వస్తువులు డెలివరీ చేసిన వారిని మనం మన ఇంటి దగ్గర కలవడం, డబ్బులు చేతులు మారడం వల్ల వైరస్‌ సోకే ప్రమాదం ఉంది.. కాబట్టి ఆన్‌లైన్‌లోనే క్యాష్‌ కట్టే సదుపాయం ఉన్న షాపింగ్‌ వెబ్‌సైట్స్‌నే ఎంచుకోవాలి. తద్వారా వస్తువు ఇంటికొచ్చినా డెలివరీ బాయ్‌ని కలవాల్సిన అవసరం ఉండదు.


ఇంటి బయటే ఈ ఏర్పాటు..

ఆన్‌లైన్‌లోనే క్యాష్‌ కట్టేశాం.. ఇక మనం కొన్న వస్తువు ఇంటికి రావడమే తరువాయి.. అనే ఆతృత వద్దు. ఎలాగో ఆన్‌లైన్‌ పేమెంట్‌ చేశాం కాబట్టి డెలివరీ బాయ్‌ని కలవాల్సిన అవసరం కూడా లేదు. అందుకే మీరు ఇంట్లో ఉన్నా, లేకపోయినా.. ఇంటి బయట, వీలుంటే గేటు బయటే ఒక బ్యాగ్‌ లేదా ఒక పెద్ద బాస్కెట్‌ లాంటిది అమర్చండి. తద్వారా డెలివరీ బాయ్‌ ఆ వస్తువును అందులో వేసి వెళ్లిపోతాడు. ఈ క్రమంలో బాయ్‌ ఎలాగూ మీకు ఫోన్‌ చేస్తాడు కాబట్టి.. అతను వెళ్లగానే మీరు మీ వస్తువును తీసుకోవచ్చు. తద్వారా సదరు వ్యక్తిని కాంటాక్ట్‌ అవ్వకుండా, కరోనా ముప్పును కొంత వరకు తగ్గించుకోవచ్చు.


శానిటైజేషన్‌ తప్పనిసరి!

అదేంటి.. ఆన్‌లైన్‌లోనే డబ్బు కట్టేశాం.. డెలివరీ బాయ్‌ని కూడా కలవలేదు.. కరోనా ముప్పు ఇంకా పొంచి ఉందంటారేంటి? అదెలా? అని ఆలోచిస్తున్నారా..? మీరు ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసిన వస్తువు ఎక్కడెక్కడి నుంచో వస్తుంది.. ఎంతోమంది చేతులు మారుతుంది.. కాబట్టి దాన్ని నేరుగా ఇంట్లోకి తీసుకొస్తానంటే అస్సలు కుదరదు. దాన్నీ ఓ పద్ధతి ప్రకారం శానిటైజ్‌ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఆర్డర్‌ చేసింది ఏదైనా ఆహార పదార్థం అనుకోండి.. అంటే దాన్ని వెంటనే తినేయాలన్న ఆతృతతో గబగబా ఓపెన్‌ చేసి తిన్నారనుకోండి.. ఇక అంతే సంగతులు! కాబట్టి ముందు మీ ఇంటి బయట బ్యాగ్‌లో ఉన్న వస్తువును తీసుకునే ముందు మీ చేతుల్ని శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలి. ఆపై ఒకవేళ బ్యాగ్‌ జిప్‌ పెడితే బ్యాగ్‌పై శానిటైజర్‌ స్ప్రే చేయండి.. తర్వాత జిప్‌ తీసి ఆ ఆర్డర్‌పై శానిటైజర్‌ని స్ప్రే చేయాలి.. అప్పుడే ఆ ప్యాకెట్‌ను ముట్టుకోవాలి.


రెండు గంటలు పక్కన పెట్టేయండి!

ఇక ఆ వస్తువును/ప్యాకెట్‌ను లోపలికి తీసుకొచ్చి ఓ రెండుమూడు గంటల పాటు పక్కన పెట్టేయాలి. ఎందుకంటే గాల్లో వైరస్‌ రెండుమూడు గంటలకు మించి బతకదు కాబట్టి ఇలా చేయడం వల్ల వైరస్‌ ఇతర చోట్ల అంటుకోకుండా అక్కడే నశిస్తుంది. అయితే ఈ క్రమంలో ఇంట్లో చిన్నారులు, ఇతర అనారోగ్యాలతో బాధపడే వారు, ముసలివాళ్లకు ఇలాంటి ప్యాకెట్లను దూరంగా ఉంచాలి. ఇక ప్యాకెట్‌ ఓపెన్‌ చేసే ముందు చేతుల్ని శుభ్రం చేసుకోవడంతో పాటు అందులోని ఆహారాన్ని వేడి చేసుకొని తినడం ఉత్తమం. అంతేకాదు.. ప్యాకెట్‌ ఉంచిన ప్రదేశాన్ని కూడా శానిటైజ్‌ చేసి ఆపై మీరు చేతులు కడుక్కోవడం మర్చిపోవద్దు.. ఈ ప్రాసెస్‌ అంతా పూర్తయ్యే సరికి ఆకలి చంపేస్తుందనుకునే వారు లంచ్‌ లేదా డిన్నర్‌ సమయానికి రెండుమూడు గంటల ముందే ఆర్డర్‌ చేసుకుంటే సరిపోతుంది.. ఎలాగూ తినేటప్పుడు వేడి చేసుకుంటారు కాబట్టి ఎలాంటి ఇబ్బందీ ఉండదు. అయితే సాధ్యమైనంతవరకు ఇంట్లో తయారు చేసిన పదార్థాలకే ప్రాధాన్యమివ్వాలి. బయటి నుంచి ఆహారాన్ని తెప్పించుకోకపోవడం శ్రేయస్కరం.


రెండ్రోజుల తర్వాతే ఓపెన్‌..

ఒకవేళ మనం ఆర్డర్‌ చేసింది ఆహార పదార్థం కాకుండా ఏ ఎలక్ట్రానిక్‌ వస్తువో, డ్రస్సో అయితే దాన్ని వెంటనే ఓపెన్‌ చేయడం కాకుండా ఓ రెండు రోజులు ఆ ప్యాకింగ్‌తోనే పక్కన పెట్టడం మంచిదంటున్నారు నిపుణులు. అయితే దాన్ని ఇంట్లోకి తెచ్చే ముందు కూడా ఇందాకటి లాగే ముందుగా మనం చేతుల్ని శానిటైజ్‌ చేసుకొని.. ఆపై ఆ ప్యాకింగ్‌పై శానిటైజర్‌ని స్ప్రే చేయాల్సి ఉంటుంది. ఇలా చేశాకే వస్తువును ఇంట్లోకి తీసుకురావాలి. ఆపై దాన్ని ఓ మూలన ఎవరికీ అందకుండా అమర్చాలి. రెండు రోజుల తర్వాత ఓపెన్‌ చేసి ఆ ప్యాకింగ్‌ కవర్‌ లేదా అట్టపెట్టెను బయటపడేసి.. లోపలున్న వస్తువును కూడా శానిటైజ్‌ చేయడం మంచిది. ఒకవేళ మీరు ఆ వస్తువును లేదా డ్రస్‌ను రిటర్న్‌ చేయాలనుకుంటే అందుకు కనీసం వారం పది రోజులైనా సమయముంటుంది కాబట్టి ఎలాంటి ఆదుర్దా పడాల్సిన పనిలేదు. అయితే మీరు రిటర్న్‌ చేయాలనుకున్నప్పుడు మాత్రం ఆ ప్యాకింగ్‌ కవర్‌ లేదా అట్టపెట్టెను పడేయకూడదని గుర్తుంచుకోండి.


కూరగాయలైతే ఇలా చేయండి!

కరోనా భయంతో ఇంటి పక్కనున్న కూరగాయల కొట్టుకు వెళ్లడానికి కూడా భయపడిపోతున్నారు చాలామంది. ఈ క్రమంలోనే గ్రాసరీ వెబ్‌సైట్స్‌ ద్వారా కాయగూరల్ని ఇంటి ముందుకే ఆర్డర్‌ చేసుకుంటున్నారు. అయితే వీటి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. ముందుగా చేతుల్ని శుభ్రం చేసుకొని ఆ కాయగూరల్ని అరగంట పాటు ఉప్పు నీటిలో లేదంటే పసుపు వేసిన నీటిలో నానబెట్టండి.. తర్వాత బాగా రుద్ది కడిగితే సరిపోతుంది. అలాగని వీటిపై కూడా శానిటైజర్‌ని స్ప్రే చేస్తే అందులోని పోషకాలు నశిస్తాయని నిపుణులు చెబుతున్నారు.. కాబట్టి కాయగూరల్ని శుభ్రం చేయడానికి సహజసిద్ధమైన పద్ధతులే మంచివి. ఒకవేళ కాయగూరలు ప్యాక్‌ చేసి వస్తే.. వాటిపై శానిటైజర్‌ని స్ప్రే చేయచ్చు.


చివరగా ఇది తప్పనిసరి!

మన ఇంటికొచ్చిన వస్తువును రెండు గంటల తర్వాతైనా, రెండ్రోజుల తర్వాతైనా ఓపెన్‌ చేసి దాన్ని శానిటైజ్‌ చేశాక.. మన చేతుల్ని కూడా సబ్బుతో ఇరవై సెకన్ల పాటు రుద్దుకొని కడుక్కోవడం మంచిది. ఒకవేళ ఆ వస్తువును మన డ్రస్‌పై పెట్టుకోవడం, అక్కడా ఇక్కడా పెట్టడం చేస్తే ఆయా ప్రదేశాల్నీ శానిటైజ్‌ చేయాలి. అలాగే మనం డ్రస్‌ మార్చుకోవడమో.. లేదంటే వేడి వేడి నీళ్లతో స్నానం చేయడమో చేస్తే మరీ మంచిది.
ఆన్‌లైన్‌ ద్వారా మన ఇంటికొచ్చే ప్రతి వస్తువును రిసీవ్‌ చేసుకునే విషయంలోనూ, వాటిని ఓపెన్‌ చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటిస్తే కరోనాకు దూరంగా ఉండచ్చు.. ఇవి గుర్తుపెట్టుకొని మీరు జాగ్రత్తగా ఉండండి.. ఇంట్లో వాళ్లనూ కాపాడుకోండి..!

ABOUT THE AUTHOR

...view details