Sleeping Problem At Night : నేటి ఉరుకుల పరుగుల జీవితం వల్ల కంటి నిండా నిద్ర కూడా పోని సందర్భాలెన్నో ఉన్నాయి. ఎప్పుడు చూసినా క్షణం తీరిక లేని బిజీ లైఫ్. రాత్రి సరిపడా నిద్ర లేకపోవడం వల్ల ఉదయం లేవడంతోనే ఒత్తిడి ప్రారంభమవుతుంది. ఫలితంగా ఏకాగ్రత లోపిస్తుంది. దాని ప్రభావం రోజంతా ఉంటుంది. ఒత్తిడితో తమ రోజు ప్రారంభించే వారిలో అధిక శాతం మందికి నిద్ర లేమి ప్రధాన కారణంగా చెబుతున్నారు.
తగినంత నిద్ర లేకుంటే ఇటు శారీరక సమస్యతో పాటు మానసిక సమస్యలూ వస్తాయి. నిద్రలేమి అనేక ఆరోగ్య సమస్యలకు హేతువని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యకరమైన జీవితానికి మంచి ఆహారంతో పాటు సరిపడా నిద్ర కూడా కావాలి. సాధారణంగా రోజుకి 8 గంటల నిద్ర అవసరమని వైద్యులు చెబుతారు. మరి హాయిగా నిద్ర పోవడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఆరోగ్యకర నిద్రకోసం కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ముందు రోజు రాత్రి సరిగ్గా నిద్ర పట్టకపోతే ఈ పనులు చేస్తే అంతా సెట్!
నీరు ఎక్కువ తీసుకోవాలి
Sleeping Problem Solution : ముందు రోజు రాత్రి సరిగా నిద్ర పట్టకపోతే.. మరుసటి రోజు ఉదయం లేచిన తర్వాత నీరు ఎక్కువగా తీసుకోవాలి. దీని వల్ల మన శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది. దీంతో పాటు వ్యాయామం చేసే అలవాటుంటే తేలికపాటిగా చేయాలి. ఒకవేళ ఆ అలవాటు లేకుంటే ఆ రోజైనా చెయ్యాలి. కనీసం 30 నిమిషాల పాటు నడిస్తే ఉత్తమం. దీని వల్ల మానసిక ఒత్తిడి సైతం దూరమవుతుంది.
ఆల్కహాల్‌కు దూరంగా ఉండాలి
ముందు రోజు రాత్రి ఆల్కహాల్ వల్ల సరిగా నిద్ర పోకుంటే మరుసటి రోజు కచ్చితంగా దానికి దూరంగా ఉండాల్సిందే. మందు వల్ల శరీరం డీ హైడ్రేట్ అవుతుంది. ఇలాంటి వారు తప్పకుండా ఎక్కువ నీటిని తాగాలి. స్మోకింగ్ చేసే వాళ్లకూ సరైన నిద్ర ఉండదు. ఈ అలవాటు ఉన్నవారు కూడా మరుసటి రోజు సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులు తాగకూడదు.