Skin Care In Winter : శీతాకాలంలో చాలామందిలో చర్మం, పెదాలు పొడిబారడమే కాకుండా మడమల్లో పగుళ్లు ఏర్పడుతుంటాయి. అంతేకాదు.. మోకాళ్లు, మోచేతులు.. వంటి భాగాల్లో చర్మం కందిపోయినట్లుగా నల్లగా, గరుకుగా మారిపోతుంటుంది. చిన్న పిల్లలు, వృద్ధులు చలికాలంలో ఎక్కువగా ఇబ్బంది పడుతుంటారు. మరి, ఇలాంటి సమస్యలన్నీ తొలగిపోవాలంటే ఈ చిన్న చిన్న చిట్కాలను పాటించమంటున్నారు సౌందర్య నిపుణులు.
నూనెతో మర్దన
చలికాలమనే కాదు.. కొంతమందికి రోజూ స్నానానికి ముందు చర్మాన్ని నూనెతో మర్దన చేసుకోవడం అలవాటు. అయితే ఈ అలవాటు శీతాకాలంలో మరింత మంచిదంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో నువ్వుల నూనె, ఆలివ్ నూనె, ఆవ నూనె.. వంటివి మరింత మేలు చేస్తుందని చెబుతున్నారు.
నురగ వచ్చే సబ్బులు వద్దు
శీతాకాలంలో చర్మం పొడిబారడానికి మనం స్నానానికి ఉపయోగించే సబ్బులు కూడా ఒక కారణమే! ఎందుకంటే ఆల్కహాల్ గుణాలు అధికంగా ఉన్న సబ్బుల్ని వాడడం వల్ల చర్మం మరింత పొడిబారిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ కాలంలో గ్లిజరిన్ ఆధారిత నురగ తక్కువ వచ్చే సబ్బుల్ని ఉపయోగించడం మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇక స్నానం పూర్తయ్యాక నాణ్యమైన మాయిశ్చరైజర్ రాసుకోవడం తప్పనిసరి. తద్వారా చర్మం తేమను కోల్పోకుండా జాగ్రత్తపడచ్చు.
శరీరాన్ని కప్పిఉంచేలా దుస్తులు ధరించండి
వాతావరణం చల్లగా ఉండటం వల్ల చర్మం తొందరగా పొడిబారిపోతుంటుంది. అందువల్ల చర్మం తేమను కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. బయటకు వెళ్లేటప్పుడు చర్మం పూర్తిగా కనిపించకుండా ఉండేలా చూసుకోవాలి. ఉన్నితో తయారు చేసిన దుస్తులను ధరించాలి. బయటకు వెళ్లేటప్పుడు గ్లౌజులు ధరించాలి. కాళ్లకు షూ వేసుకోవటం మంచిది. దీనివల్ల బయటకు వెళ్లినప్పుడు దుమ్ము, ధూళి కణాలు చర్మానికి హాని చేయకుండా ఉంటాయి. ఎండ నుంచి కూడా రక్షణగా ఉంటుంది.
దీర్ఘకాల వ్యాధిగ్రస్థులు జాగ్రత్త
శీతాకాలంలో కొన్ని చర్మ వ్యాధులు కూడా ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. వీరి కోసం ప్రత్యేకంగా మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ ఉంటాయి. రోజుకు నాలుగు సార్లు రాస్తే చర్మం పొడిబారకుండా ఉంటుంది. హార్మోనల్ సమస్య, థైరాయిడ్, డయాబెటిస్ సమస్యలు ఉన్న వారికి శీతాకాలంలో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి.