వేడిగాలుల కారణంగా ఒంట్లో తేమ తగ్గి శరీరంలో నీటి నిల్వలు హరించుకుపోతాయి. అవసరమైన ఖనిజ లవణాలు చెమట రూపంలో బయటికి పోతాయి. దాంతో శరీరం నిస్సత్తువగా మారుతుంది. దీన్నే వడదెబ్బ అంటాం.
ఎలాంటి లక్షణాలు ఉంటాయి...
తలనొప్పి, కళ్లు తిరగడం, నోరు ఆరిపోవడం, కండరాల నొప్పులు, గుండె వేగంగా కొట్టుకోవడం, వాంతులు చేసుకోవడం, మూత్ర సంబంధిత సమస్యలు వంటివెన్నో దీని లక్షణాలు. ఇవన్నీ ఎండబారిన పడిన కొద్దిగంటల్లోనే ప్రభావం చూపిస్తాయి.
వడదెబ్బ తగిలితే....
- తక్షణం చికిత్స అందించాలి. చల్లటి గాలి తగిలే ప్రదేశంలో ఉండి విశ్రాంతి తీసుకోవాలి.
- దుస్తుల్ని వదులుగా చేయాలి.
- ఉప్పు, పంచదార కలిపిన చల్లటి నీళ్లను తాగించాలి. ఆపై వైద్యుల దగ్గరకు తీసుకెళ్లడం మంచిది.
ఈ పరిస్థితి రాకూడదంటే...
ప్రధానంగా ఆహారంలో తగినన్ని మార్పులు చేసుకోవాలి. శరీరంలో నీటి నిల్వలు, మరీ ముఖ్యంగా ఎలక్ట్రోలైట్స్ తగ్గకుండా చూసుకోవాలి. మరో పక్క జీవనశైలిలో మార్పులు తప్పనిసరి. అంటే... నూలు దుస్తులు ధరించడం, కళ్లజోడు పెట్టుకోవడం, బయటకి వెళ్లినప్పుడు గొడుగుని ఉపయోగించడం, చర్మానికి సన్‌స్క్రీన్‌లోషన్ రాసుకోవడం వంటివి చేయాలి.
ఆహారం విషయంలో...
రోజువారీ ఆహారంలో ఆకుకూరలు, పండ్లు, ద్రవపదార్థాలు ఎక్కువగా ఉండేట్టు చూసుకోవాలి. అప్పుడే ఎలక్ట్రోలైట్స్ శరీరానికి తగినంతగా అందుతాయి. పాలకూరలో 92% నీరు ఉంటుంది. అదే క్యారెట్‌లో 87%, ఎర్రటి టొమాటోల్లో 94శాతం నీరు ఉంటుంది. ఈ కాలంలో ముల్లంగి, సొరకాయ వంటివి ఎక్కువగా తీసుకోవడం మేలు. అలానే ఈ కాలంలో దొరికే బత్తాయి, నిమ్మ, పుచ్చకాయ, కర్భూజా వంటి పండ్లను తరచూ తీసుకోవాలి. ఇవి శరీరానికి తగిన నీరు అందించడంతో పాటు పీచు, ఇతర పోషకాల్ని అందిస్తాయి. ఫలితంగా ఎండ ప్రభావానికి గురికాకుండా ఉండొచ్ఛు.
కర్భూజ: దీనిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. పొటాషియం, పిండి పదార్థాలు, పీచు ఎక్కువే. అందుకే దీన్ని తక్షణ శక్తి కోసం తీసుకోవచ్ఛు దీని వల్ల శరీరంలో నీటి నిల్వలు పెరుగుతాయి. కర్భూజ రసంలో ఉప్పు, పంచదార, కాస్త వెనిల్లా ఎసెన్స్ కూడా కలిపితే రుచిగానూ ఉంటుంది.
కమలా/బత్తాయి/నిమ్మ: ఈ నిమ్మజాతి పండ్లలో శరీరానికి ఎంతో కీలకమైన పొటాషియం వంటి పోషకాలతో పాటు ఫైటోన్యూట్రియంట్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ముఖ్యంగా విటమిన్ సి తగినంతగా లభిస్తాయి. ఇవి తక్షణశక్తిని ఇస్తాయి. వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. ఎండబారిన పడకుండా తగిన రక్షణ కలిగిస్తాయి.
చల్లబరిచే పానీయాలివి...