తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

రాత్రిపూట చెమటలతో ఎన్నో జబ్బులు.. ఈ జాగ్రత్తలు తీసుకుంటే సేఫ్! - రాత్రి పూట చెమటలు ఎందుకొస్తాయి

కొంతమంది రాత్రి పూట చెమట పట్టే సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఈ సమస్య తీవ్రం కాకుండా ఉండేందుకు కొన్ని సలహాలను, సూచనలను వైద్య నిపుణులు ఇస్తున్నారు. అవేంటంటే?..

night sweat problem
రాత్రిపూట చెమటలు

By

Published : Feb 9, 2023, 7:46 AM IST

Updated : Feb 9, 2023, 8:35 AM IST

రాత్రిపూట చెమటలు పట్టటం పెద్ద సమస్యేమీ కాదు. చాలాసార్లు దీని గురించి బాధపడాల్సిన అవసరమేమీ లేదు. కానీ కొన్నిసార్లు ఇవి తీవ్ర సమస్యలకు సంకేతం కావొచ్చు. ముఖ్యంగా బరువు తగ్గటం, జ్వరం, నొప్పి, ఆయాసం, విరేచనాల వంటి వాటితో ముడిపడి ఉన్నట్టయితే తప్పకుండా ఆలోచించాల్సిందే. ముందే జాగ్రత్త పడితే సమస్య తీవ్రం కాకుండా చూసుకోవచ్చు. రాత్రి చెమటలతో ముడిపడిన కొన్ని జబ్బులు ఇవీ..

థైరాయిడ్‌ జబ్బు
థైరాయిడ్‌ గ్రంథి అతిగా పనిచేయటం (హైపర్‌థైరాయిడిజమ్‌) వల్ల రాత్రిపూట చెమటలు రావొచ్చు. ఇందులో ఆకలి ఎక్కువగా వేయటం, బరువు తగ్గటం, గుండె దడ, అలసట, విరేచనాలు, చేతులు వణకటం, శరీరం వేడిగా అనిపించటం వంటి లక్షణాలూ ఉంటాయి.

గ్లూకోజు పడిపోవటం
రక్తంలో గ్లూకోజు మోతాదులు బాగా పడిపోయినా చెమటలు పట్టొచ్చు. ముఖ్యంగా మధుమేహుల్లో దీన్ని చూస్తుంటాం. ఎక్కువసేపు ఆకలితో ఉన్నప్పుడు వీరిలో చెమటలు పడుతుంటాయి. అందువల్ల మధుమేహంతో బాధ పడేవారు భోజనానికి భోజనానికి మధ్యలో కాస్త చిరుతిండి తినటం మంచిది.

ఇన్‌ఫెక్షన్లు
కొన్నిరకాల ఇన్‌ఫెక్షన్లూ రాత్రి చెమటలకు కారణం కావొచ్చు. వీటిల్లో అన్నింటికన్నా ముఖ్యమైంది క్షయ. ఇందులో జ్వరం, దగ్గు కూడా ఉంటాయి. ఎముకల ఇన్‌ఫెక్షన్‌ (ఆస్టియోమైలైటిస్‌), గుండె కవాటాల ఇన్‌ఫెక్షన్‌ (బ్యాక్టీరియల్‌ ఎండోకార్డయిటిస్‌) వంటివీ రాత్రి చెమటలకు దారితీయొచ్చు. హెచ్‌ఐవీలో బరువు తగ్గటం, జ్వరంతో పాటు రాత్రిపూట చెమటలూ పడతాయి.

ఛాతీలో మంట
జీర్ణాశయంలోని ఆమ్లం పైకి గొంతులోకి ఎగదన్నుకొని రావటం (జీఈఆర్‌డీ) మూలంగానూ చెమటలు పట్టొచ్చు. ఇందులో ఛాతీలో మంట, నొప్పి వంటివీ ఉంటాయి. జీఈఆర్‌డీ గలవారు ఆహారం తక్కువ తక్కువగా తినటం మంచిది. వేపుళ్లు, టీ, కాఫీ, కూల్‌డ్రింకులను మానెయ్యాలి.

క్యాన్సర్లు
హాడ్కిన్స్‌, నాన్‌-హాడ్కిన్స్‌ లింఫోమా వంటి కొన్నిరకాల క్యాన్సర్ల తొలిదశలో రాత్రిపూట చెమటలు పడుతుంటాయి. వీటిల్లో చెమటలతో పాటు స్వల్పంగా జ్వరం కూడా కనిపిస్తుంటుంది.

హైపర్‌హైడ్రోసిస్‌
ఇది అరుదైన సమస్య. ఇందులో అకారణంగా శరీరం చెమటను ఎక్కువ ఉత్పత్తి చేస్తుంది. ఇదేమీ తీవ్రమైన సమస్య కాదు గానీ చికాకు పెడుతుంది. చెమటను తగ్గించే మందులు వేసుకోవటం, వదులైన దుస్తులు ధరించటం, తేలికైన చెప్పులు వేసుకోవటం వంటివి దీనికి మేలు చేస్తాయి.

Last Updated : Feb 9, 2023, 8:35 AM IST

ABOUT THE AUTHOR

...view details