ఒక్క కరోనా జబ్బు అనే కాదు, వైరల్ ఇన్‌ఫెక్షన్లు ఏవైనా వచ్చిన తర్వాత ఒంట్లో రక్షణ వ్యవస్థలు దెబ్బతింటాయి. దీంతో బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్ల ముప్పు పెరుగుతుంది. అందువల్ల కొన్నిరోజుల పాటు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరోవైపు కరోనా ఇన్‌ఫెక్షన్ దుష్ప్రభావాల నుంచి పూర్తిగా కోలుకోవటానికి 4-8 వారాలు పడుతుంది. చికిత్స ఎప్పుడు మొదలు పెట్టారన్నదానిపై ఇది ఆధారపడి ఉంటుంది. సమస్యను తొలిదశలోనే గుర్తించి, ఆ వెంటనే చికిత్స ఆరంభిస్తే అనర్థాలు తక్కువగా ఉంటాయి.
కొందరు జ్వరం, దగ్గు మామూలుగానే ఉన్నాయనుకొని ఏదో ఓ మాత్ర వేసుకోవటం, లక్షణాలు ఎక్కువవుతున్నా ఆసుపత్రికి వెళ్లకపోవటం చూస్తున్నాం. దీంతో సమయం మించిపోతుంది. ఊపిరితిత్తులు దెబ్బతిని కణజాలం గట్టిపడటం (ఫైబ్రోసిస్) మొదలవుతుంది. చికిత్స ఆలస్యమైనకొద్దీ ఇదీ ఎక్కువవుతుంది. కరోనా జబ్బు నుంచి కోలుకున్న తర్వాత సుమారు ఏడాది వరకు దీని ప్రభావం కొనసాగొచ్ఛు ఊపిరితిత్తుల కణజాలం గట్టిపడితే ఆయాసం, నిస్సత్తువ వంటి లక్షణాలు వేధిస్తాయి. ఇంతకుముందు సునాయాసంగా 2 కిలోమీటర్ల నడిచే వాళ్లు ఇప్పుడు అర కిలోమీటరు నడవటానికే కష్టపడుతుండొచ్ఛు చిన్నపాటి పనులకే అలసిపోతుండొచ్ఛు మీరు ఆలస్యంగా చికిత్స తీసుకున్నట్టయితే ఇలాంటి లక్షణాలేవైనా కనిపిస్తున్నాయేమో గమనించండి.