Precautions For Being Safe: కొవిడ్-19 ఎన్నో పాఠాలు నేర్పించింది. వైరస్ బారిన పడకుండా చూసుకోవటం దగ్గర్నుంచి.. ఇన్‌ఫెక్షన్‌ను సమర్థంగా ఎదుర్కోవటం వరకూ ఎన్నెన్నో విషయాలు నేర్పించింది. రోగనిరోధకశక్తిని బలోపేతం చేసుకునే మార్గాల ప్రాధాన్యాన్నీ నొక్కి చెప్పింది. నిజానికివి మనకు తెలియనివి కావు. ఎప్పట్నుంచో ఉన్నవే. వాటన్నింటినీ కరోనా జబ్బు మరోసారి గుర్తుచేసింది. వీటి అవసరం ఇప్పటితో తీరేది కాదు. ఇవి ఒక్క కొవిడ్‌కే పరిమితమయ్యేవీ కావు. నిత్య జీవితంలో భాగం చేసుకోవటం తప్పనిసరి. ఈ సరళ సూత్రాలతో ఇన్‌ఫెక్షన్లను చాలావరకు నివారించుకోవచ్చు. కొత్త సంవత్సరంలో పండంటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.
టీకాలు వేయించుకోవాలి
ప్రతి సంవత్సరం ఫ్లూ వైరస్ మారుతోంది. గత టీకాలను తట్టుకునే శక్తిని సంతరించుకుంటోంది. దీనికి తోడు ఇప్పుడు కరోనా వైరస్ కూడా తోడైంది. దీని పరిణామాలను చవి చూస్తూనే ఉన్నాం. ఫ్లూ టీకాతో పాటు కొవిడ్ టీకా(బూస్టర్ టీకా)నూ ఎంత ఎక్కువ మంది తీసుకుంటే అంత ఎక్కువగా సామూహిక రోగనిరోధక శక్తి లభిస్తుంది. జబ్బుల బారినపడటం తగ్గుతుంది.
తాకే వస్తువులన్నీ తరచూ శుభ్రం చేయాలి
తలుపు గొళ్లాలు, పిడులు, నల్లాలు, వాషింగ్ మెషిన్లు, ఫోన్లు, ట్యాబ్లెట్లు, కీబోర్డులు, లైటు స్విచ్చులు, రిమోట్ కంట్రోళ్లు, పిల్లల ఆటబొమ్మలు.. ఇలాంటివన్నీ బ్యాక్టీరియా నిలయాలే. కాబట్టి వీటిని తరచూ శుభ్రం చేయాలి. దీంతో బ్యాక్టీరియా వృద్ధి చెందకుండా, ఇతరులకు వ్యాపించకుండా చూసుకోవచ్చు. ఇది జలుబు, అతిసారం, వాంతులు, కొవిడ్ వంటి ఎన్నెన్నో జబ్బుల నివారణకు ఎంతగానో తోడ్పడుతుంది.
చక్కెర వీలైనంత తక్కువగా
మద్యం మాదిరిగానే చక్కెర సైతం తెల్ల రక్తకణాల సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. దీంతో బ్యాక్టీరియా, వైరస్‌లతో పోరాడే శక్తి సన్నగిల్లుతుంది. కాబట్టి చక్కెర విషయంలో జాగ్రత్త అవసరం. ఆడవాళ్లు రోజుకు 6 చెంచాలు, మగవారు 9 చెంచాల కన్నా మించకుండా చూసుకోవాలి. ఒక మామూలు కూల్‌డ్రింకులో 10 చెంచాల చక్కెర ఉంటుందని తెలుసుకోవాలి.
ప్రొబయోటిక్స్ తగినంత
మన రోగనిరోధక వ్యవస్థ చాలావరకు పేగుల్లోనే ఉంటుంది. పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియా హానికర సూక్ష్మక్రిముల వృద్ధిని అరికడుతుంది. బ్యాక్టీరియా సమతుల్యతను కాపాడుతుంది. విటమిన్లను సృష్టిస్తుంది. శరీరం మందులను శోషించు కోవటానికి తోడ్పడుతుంది. కాబట్టి పెరుగు, మజ్జిగ, పులియబెట్టిన పదార్థాల వంటి మంచి బ్యాక్టీరియాను వృద్ధి చేసే (ప్రొబయోటిక్స్) పదార్థాలు తగినంత తీసుకోవాలి.
మద్యం అనర్థ దాయకం
మద్యం అతిగా తాగితే తెల్ల రక్తకణాల సామర్థ్యం తగ్గుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. దీంతో రోగనిరోధక వ్యవస్థ పనితీరు మందగిస్తుంది. బ్యాక్టీరియా, వైరస్‌లను ఎదుర్కొనే శక్తి తగ్గుతుంది. మద్యంతో ఒంట్లో నీటిశాతమూ తగ్గుతుంది. నిద్రకు సైతం భంగం కలుగుతుంది. ఇవీ రోగనిరోధక వ్యవస్థను అస్తవ్యస్తం చేసేవే. కాబట్టి మద్యం జోలికి వెళ్లకపోవటం మంచిది. ఒకవేళ అలవాటుంటే మితి మీరకుండా చూసుకోవాలి.
గోళ్లు కొరకటం మానెయ్యాలి
రోజంతా చేతులు ఎక్కడెక్కడ తాకారో ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. అక్కడ బ్యాక్టీరియా, వైరస్‌లు ఉన్నట్టయితే చేతులకు అంటుకుంటాయి కదా. ఆ చేతులను కడుక్కోకుండా నోట్లో పెట్టుకున్నా, కళ్లను తాకినా లేదా గోళ్లు కొరికినా కోరి ప్రమాదాన్ని తెచ్చుకున్నట్టే. నోరు, ముక్కు, కళ్ల ద్వారా హానికర సూక్ష్మక్రిములు ఒంట్లోకి ప్రవేశిస్తాయి. అందువల్ల సబ్బుతో శుభ్రం చేసుకోకుండా చేతులను ముఖానికి తాకనీయరాదు. గోళ్లు కొరికే అలవాటుంటే వెంటనే మానెయ్యాలి.