Pneumonia Symptoms and Causes : శీతాకాలంలో ఇబ్బంది పెట్టే వ్యాధుల్లో.. న్యూమోనియా ప్రమాదకరమైనది. ముందే అప్రమత్తం కావడం ద్వారా.. నష్టాన్ని నివారించుకోవచ్చు. ఇంతకీ న్యూమోనియా(Pneumonia) అంటే ఏమిటి? దీని లక్షణాలేంటి? ఈ వ్యాధి రావడానికి కారణాలేంటి ? దీని ద్వారా ఎవరికి ఎక్కువ ప్రమాదం? వంటి ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
న్యూమోనియా అంటే (What is Pneumonia) :ఇది ఊపిరితిత్తులకు వచ్చే వ్యాధి. లంగ్స్‌లో అల్వియోలీ అనే చిన్న చిన్న గదులుంటాయి. సాధారణంగా మనం గాలి పీల్చుకొన్నప్పుడు ఈ గదులలో ఆక్సిజన్ నిండుతుంది. అదే న్యూమోనియా వచ్చిన వ్యక్తికి మాత్రం.. ఆ గదులలో గాలి బదులు బ్యాక్టీరియల్ వైరస్‌తో నిండిన ద్రవపదార్థం చేరుతుంది. దీంతో.. గాలి పీల్చుకోవడం కష్టంగా మారుతుంది. తీసుకునే ఆక్సిజన్ మోతాదు తగ్గిపోతుంది.
లక్షణాలు..
- చలితో కూడిన 102పైన డిగ్రీల జ్వరం
- తీవ్రమైన దగ్గు, కఫం
- ఛాతిలో నొప్పి, శ్వాస తీసుకోవడం కష్టం
- ఆయాసం, తీవ్రమైన నీరసం
- ఆహారం తీసుకోకపోవడం
- కొందరిలో వికారం, వాంతులు
- అలసట
న్యూమోనియా రావడానికి కారణాలివే..
న్యూమోనియా అనేది పలు రకాల అంటువ్యాధుల ప్రేరకాల వల్ల వస్తుంది. అంటే.. బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ వల్ల ఈ వ్యాధి సోకుతుంది. ఇవి ఇతర వ్యక్తుల ద్వారా కానీ.. హాస్పిటల్ ద్వారా ఎక్కువగా మానవ శరీరంలోకి చేరుతాయి. అందులో ముఖ్యమైనవి చూస్తే..
- స్ట్రెప్టోకోకస్ :చిన్నపిల్లల్లో వచ్చే అత్యంత సాధారణమైన బాక్టీరియా ఆధారిత న్యూమోనియా ఇది. శ్వాసకోశ వ్యాధిగ్రస్థులు, బలహీన రోగ నిరోధక వ్యవస్థ ఉన్నవారు దీని బారినపడతారు.
- మైకోప్లాస్మా : సాధారణంగా 40 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తులకు, రద్దీగా ఉండే ప్రాంతాలలో నివసించే వారికి ఎక్కువగా సోకుతుంది. ఇది పెద్దగా ప్రభావం చూపదు.
- సూడోమోనాస్ : ఈ న్యూమోనియా సుదీర్ఘకాలం హాస్పిటల్లో ఉండడం వల్ల సోకే అవకాశం ఉంటుంది.
- లెజియోనెల్లా : ఇది ప్రమాదకరమైనది. ఇది వ్యక్తి నుంచి వ్యక్తికి వ్యాపించదు. కలుషితమైన నీటికి వల్ల వ్యాప్తి చెందుతుంది.
- క్లేబ్సియెల్లా :ఇది ఇతరుల నుంచి కాకుండా.. మన శరీరంలోని పేగులలో ఉండే ఒక రకమైన బాక్టీరియా కారణంగా తయారవుతుంది. పేగులలో ఉన్నంత వరకూ ఇబ్బంది లేదు. పేగుల నుంచి బయటపడి ఇతర శరీర భాగాలకు వ్యాప్తి చెందితే మాత్రం ప్రమాదకారిగా మారుతుంది.
- వైరస్‌తో, ఫంగస్‌తో :వైరస్‌తోపాటు ఫంగస్‌తో కూడా కొన్ని రకాల న్యూమెనియా మనిషి శరీరంలోకి చేరుతుంది.