దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అయితే.. వ్యాక్సిన్ వచ్చిందన్న ధీమాతో ప్రజలు నిబంధనలు ఉల్లంఘించడమే దీనికి కారణమని నిపుణులు చెబుతున్నారు. దీనినే పెల్ట్జ్ మ్యాన్ ప్రభావం అంటున్నారు వైద్యులు.
అమెరికాలో చికాగో విశ్వవిద్యాలయ ఆర్ధిక శాస్త్రవేత్త అయిన శ్యామ్ పెల్ట్జ్ మ్యాన్ 1975లో ఈ ప్రభావాన్ని గుర్తించారు. ఈ సిద్ధాంతం ప్రకారం కొన్ని ప్రమాదాల నుంచి రక్షించుకోడానికి ప్రభుత్వాలు తగు జాగ్రత్తలను తప్పనిసరి చేస్తే ప్రజలు ఆ ప్రమాదం కలిగే సంభావ్యతను తక్కువగా అంచనా వేస్తారు. అంటే.. జాగ్రత్తలు తీసుకుంటున్నాం కాబట్టి, ప్రమాదాలు జరగవనే ధీమాతో ఇబ్బందులను కొని తెచ్చుకుంటారు. ఉదాహరణకు వాహనాల్లో సీటుబెల్ట్లు తప్పనిసరి చేయటం ఎక్కువ ప్రమాదాలకు కారణమవుతోందట. ప్రమాదం జరిగినా చోదకుడికి కలిగే నష్టం కనీసమాత్రంగానే ఉంటుందని ప్రమాదకరంగా ప్రయాణాలు సాగిస్తారు.
టీకా ఉందన్న ధీమాతోనే..
కొవిడ్ టీకా కారణంగా.. ప్రజల్లో అజాగ్రత్త పెరిగి, అప్రమత్తత కోల్పోతున్నారు. మాస్క్లు వాడటం, భౌతిక దూరాన్ని పాటించటం, చేతులు శుభ్రంగా ఉంచుకోవటం అవసరం లేదనే భావన ప్రబలుతోంది. టీకా తీసుకున్న వెంటనే రక్షణ చేకూరదనే విషయం మరచిపోతున్నారు. వ్యాక్సిన్ కేంద్రాల వద్ద మాస్క్లు వాడటం కూడా తగ్గించేశారు. వ్యాధి నిరోదక శక్తి అందరిలో ప్రబలమవటానికి సుదీర్ఘ సమయం కావాలని న్యూయార్క్ విశ్వవిద్యాలయం వైద్యులు చెబుతున్నారు. వ్యాక్సిన్ తీసుకోవటానికి ప్రజలందరినీ ఒప్పించటం, సమాయత్తపరచటంలో విజయవంతమైనా మితిమీరిన ధైర్యం వల్ల కలిగే సామూహిక ప్రవర్తనలో లోపాలు చాలా నష్టం కలిగిస్తున్నాయి.
అందరూ టీకా తీసుకుంటున్నారని వ్యాక్సిన్ పొందని వారు కూడా కనీస జాగ్రత్తలను పాటించట్లేదని వైద్యులు చెబుతున్నారు. ఇంతకాలం అనేక జాగ్రత్తలు తీసుకున్నవారు ఒక రకంగా అలసిపోయారు. కొవిడ్ వార్తలు చూసి, విని విసుగు కలిగి అన్ని జాగ్రత్తలకు తిలోదకాలిస్తున్నట్టు ప్రవర్తిస్తున్నారు. ఇటువంటి ప్రవర్తన మొత్తం సమాజానికే చాలా ప్రమాదకరంగా మారబోతోంది. ఇటీవల దిల్లీలోని ఒక ఆసుపత్రిలో కొవిడ్ రోగులకు చికిత్సనందిస్తున్న 37 మంది వైద్యులు రెండు టీకాలు తీసుకున్న తరువాత కూడా కరోనా సోకింది.
కొవిడ్ మరోసారి విజృంభిస్తోందని మనం భావించవచ్చు. కానీ మన ప్రవర్తనలో అజాగ్రత్తలే దీనికి కారణం కావచ్చు. ఇదే పెల్ట్జ్ మ్యాన్ ప్రభావం.