నల్గొండ జిల్లా పర్వతగిరికి చెందిన కదిర సైదులు. మూత్రపిండాల వైఫల్య బాధితుడు.వారంలో 3 సార్లు రక్తశుద్ధి (డయాలసిస్) చేయించుకోవాల్సి వస్తోంది. నెల రోజులుగా రక్తశుద్ధి సేవల్లో వినియోగించే పరికరాల సరఫరాలో క్రమం తప్పుతుండటంతో.. స్థోమత లేకపోయినా డయలైజర్‌కు రూ.1300, బ్లడ్‌ట్యూబ్‌లకు రూ.450 ఖర్చు చేయాల్సి వస్తోంది. జిల్లాలో ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా.. ఎలాంటి ప్రయోజనం లేదని
మూత్రపిండాల వైఫల్య బాధితుల అవస్థలు తారస్థాయికి చేరుకున్నాయి. నెలరోజులుగా డయాలసిస్‌లో వినియోగించాల్సిన పరికరాలు అందుబాటులోకి రాక వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. రక్తశుద్ధి కేంద్రాల నిర్వహణకు ఒప్పందం కుదుర్చుకున్న ప్రైవేటు సంస్థ.. నిధుల లేమిని కారణంగా చూపుతూ కొన్ని పరికరాలను సమకూర్చలేకపోతోంది. దీంతో కొన్ని కేంద్రాల్లో రోగులు తప్పనిసరి పరిస్థితుల్లో సొంతంగా వాటిని కొనుగోలు చేయాల్సి వస్తుండగా.. మరికొన్ని చోట్ల మరుసటి రోజుకు డయాలసిస్‌ను వాయిదా వేసుకోవాల్సిన స్థితి నెలకొంది.
రక్తశుద్ధి తప్పనిసరి
మూత్రపిండాల రోగుల్లో కొందరు వారానికి రెండుసార్లు.. మరికొందరు మూడు సార్లు కూడా డయాలసిస్ చేయించుకోవలసి ఉంటుంది. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పరిధిలో ఈ తరహాలో రక్తశుద్ధి పొందుతున్న రోగులు సుమారు 10 వేలకు పైగానే ఉంటారని అంచనా. వీరి కోసం ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో 41 రక్తశుద్ధి కేంద్రాలను అమల్లోకి తెచ్చింది. జిల్లా, ప్రాంతీయ ఆసుపత్రులతో పాటు కొన్నిచోట్ల సామాజిక ఆరోగ్య కేంద్రాల్లోనూ ఒక్కోచోట 6-10 పడకలతో డయాలసిస్ కేంద్రాలను అందుబాటులోకి తెచ్చింది. ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన పని లేకుండా ఆరోగ్యశ్రీ పథకం కింద నమోదైన రోగులు ఉచితంగా రక్తశుద్ధి చికిత్సను పొందుతున్నారు. ఇందులో వినియోగించే ప్లాస్టిక్ ట్యూబ్, డయలైజర్‌లను ప్రతిసారీ తప్పనిసరిగా మార్చాలన్న నిబంధనలను కొత్తగా అమల్లోకి తీసుకొచ్చారు. నిధుల లేమితో నిర్వహణ సంస్థ వీటిని సకాలంలో పంపిణీ చేయడం లేదనే ఆరోపణలున్నాయి. దీంతో కొన్ని చోట్ల రోగులే సొంతంగా కొనుగోలు చేయాల్సి వస్తోంది. నిధులు విడుదల కాకపోతే మున్ముందు రాష్ట్రంలోని అన్ని కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి ఎదురయ్యే ప్రమాదముందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇదీ సమస్య...
* ఆరోగ్యశ్రీ పథకం సజావుగా సాగడానికి నెలకు రూ.100 కోట్లు ఇవ్వాలని ఉన్నత స్థాయిలో తీసుకున్న నిర్ణయాన్ని పక్కనబెట్టారు. దీంతో ఈ పథకం కింద సాధారణ వైద్యసేవలతో పాటు డయాలసిస్ సేవలకూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
* రక్తశుద్ధి నిర్వహణ సంస్థకు ఇప్పటి వరకూ సుమారు రూ.43 కోట్ల వరకూ బకాయిలున్నట్లుగా తెలుస్తోంది. వీటిలో ఇప్పటికే గడువు ముగిసిన నిధులు సుమారు రూ. 13 కోట్లు ఉంటాయని అంచనా. కనీసం వీటిని విడుదల చేసినా సేవలు కొనసాగే అవకాశాలుంటాయి. గత 5 నెలలుగా డయాలసిస్ కేంద్రాల్లో సిబ్బందికి వేతనాలు కూడా అందడం లేదు.
రెండ్రోజులకు సరిపడే కిట్లు