తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

Pain In Back Of Heel: ఇలా చేస్తే మడమ నొప్పి మాయం! - మడమ నొప్పికి ఉపశమనమెలా?

Pain In Back Of Heel: ఉదయం నిద్ర లేచి, మంచం మీది నుంచి కాలు కింద పెట్టగానే 'అమ్మో.. నొప్పి' అంటూ ఎంతోమంది విలవిల్లాడుంటారు. రెండడుగులు వేశాక నొప్పి కాస్త తగ్గినట్టు అనిపిస్తుంది. 'హమ్మయ్య' అని ఊపిరి పీల్చుకుంటారు. కొన్నిసార్లు నొప్పి పూర్తిగానూ తగ్గిపోవచ్చు. కొందరికి ఒక మడమలోనే నొప్పి ఉంటే.. మరికొందరికి రెండు మడమల్లోనూ నొప్పి పుట్టొచ్చు. ఎందుకిలా? దీన్ని తగ్గించుకునే చిట్కాలేవైనా ఉన్నాయా?

heel pain remedy
మడమ నొప్పి

By

Published : Jan 4, 2022, 9:40 AM IST

Pain In Back Of Heel: మడమనొప్పి ఆడవారిలో తరచూ చూస్తుంటాం. వయసు మీద పడుతున్నకొద్దీ ఇది ఎక్కువగా కనిపిస్తుంటుంది. సరైన చెప్పులు ధరించని వారికైతే ఏ వయసులోనైనా తలెత్తొచ్చు. ఊబకాయం, మధుమేహం గలవారికి దీని ముప్పు ఎక్కువ. ఇది క్రీడాకారులకూ.. ముఖ్యంగా పరుగెత్తేవారికి, పాదాలు నేలకు బలంగా తాకే ఆటలు ఆడేవారికీ రావొచ్చు. చెప్పులు వేసుకోకుండా గట్టి నేల మీద ఎక్కువగా నడిచేవారికి, గంటల తరబడి కదలకుండా నిల్చునేవారికీ మడమ నొప్పి వచ్చే అవకాశం ఎక్కువ.

కారణాలేంటి?

Heel Pain Cause: మడమ ఎముక గుండ్రంగా ఉంటుంది. దీన్ని కాల్కేనియం అంటారు. ఇది అరికాలులోని ప్లాంటార్‌ ఫేసియా అనే మందమైన కండర పొర ద్వారా పాదంలోని చిన్న ఎముకలకు అంటుకొని ఉంటుంది. మడమ వెనక భాగమేమో అచిలిస్‌ కండర బంధనం సాయంతో పిక్క కండరాలకు అనుసంధానమవుతుంది. ఈ రెండింటి మధ్య పల్చటి తిత్తులు (బర్సా) ఉంటాయి. వీటిల్లోంచి ఉత్పత్తయ్యే ద్రవం కందెనలా పనిచేస్తూ మడమ ఎముక, కండర బంధనం ఒరుసుకపోకుండా చూస్తాయి. ఇవన్నీ నడుస్తున్నప్పుడు ఒక సమన్వయంతో పనిచేస్తూ అడుగు సరిగా పడేలా చేస్తాయి. ఒకవేళ ప్లాంటార్‌ ఫేసియా చిరిగినా, బర్సా వాచినా మడమ నొప్పికి దారితీయొచ్చు. చదును పాదాలూ దీనికి కారణం కావొచ్చు. ఊబకాయుల్లో అధిక బరువు పాదాన్ని కిందికి నెడుతుంది. దీంతో పాదం మధ్యలోని ఒంపు తగ్గి, చదునుగా అవుతుంది. కొందరికి పుట్టుకతోనే పాదం చదునుగా ఉండొచ్చు. దీంతో మడమ మీద ఎక్కువ బరువు పడి, నొప్పి తలెత్తొచ్చు. కొన్నిసార్లు క్యాల్షియం పోగుపడి ఎముక మీద బుడిపెలాగా (స్పర్‌) ఏర్పడొచ్చు. ఇది నాడులను నొక్కటం వల్ల నొప్పి పుట్టొచ్చు. వయసు మీద పడటం వల్ల తలెత్తే కీళ్ల సమస్యల్లో భాగంగానూ మడమ నొప్పి తలెత్తొచ్చు. ఒత్తిడి మూలంగా ఎముక చిట్లటం, ఇన్‌ఫెక్షన్‌ వంటివీ నొప్పికి దారితీయొచ్చు.

ఉపశమనమెలా?

Heel Pain Home Remedies In Telugu:

  • మడమ నొప్పి చాలామందిలో కొంతకాలానికి తగ్గిపోతుంది. కొందరికి మాత్రం వస్తూ పోతూ వేధిస్తుంటుంది. ఇలాంటివారు కొన్ని చిట్కాలతో నొప్పిని అదుపులో ఉంచుకోవచ్చు.
  • పగటిపూట అప్పుడప్పుడు కింద కూర్చోవాలి. పాదాలు ఎత్తుగా ఉండేలా చూసుకోవాలి. వీటితో పాదాలకు విశ్రాంతి లభిస్తుంది.
  • పాత్రలో గోరువెచ్చటి నీరు పోసి, కాసేపు అందులో నిల్చోవాలి. ఒక పాదంతో మరో పాదాన్ని నెమ్మదిగా రుద్దుతూ ముందుకూ వెనక్కూ కదిలించాలి.
  • తువ్వాలులో మంచు ముక్కలను చుట్టి 20 నిమిషాల సేపు మడమ వద్ద పెట్టి ఉంచాలి. ఇలా రోజుకు మూడు సార్లు చేయాలి.
  • ఇంట్లో గట్టి టైల్స్‌, మార్బుల్‌ పరచినట్టయితే చెప్పులు లేకుండా నడవరాదు. సన్న బుడిపెలతో కూడిన రబ్బరు స్లిప్పర్లు ధరిస్తే మంచిది.
  • షూ చిరిగిపోతే వీలైనంత త్వరగా మార్చేయాలి.
  • మడమ తాకే చోట మెత్తగా ఉండే చెప్పులు, స్లిప్పర్లు, షూ ధరించాలి.
  • పాదం, పిక్కలను సాగదీసే వ్యాయామాలు తరచుగా చేయాలి.

ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నా.. రెండు వారాల్లో నొప్పి తగ్గనట్టయితే ఎముకల శస్త్రచికిత్స నిపుణులను సంప్రదించాలి. అవసరమైతే మడమ ఎక్స్‌రే, సీటీ స్కాన్‌, రక్త పరీక్షలు చేస్తారు. చాలామందిలో మామూలు నొప్పి మాత్రలతోనే ఉపశమనం లభిస్తుంది. వీటికి అల్ట్రాసౌండ్‌ చికిత్స కూడా తోడైతే మరింత ఎక్కువ ఫలితం కనిపిస్తుంది. అప్పటికీ నొప్పి తగ్గకపోతే మడమలోకి స్టిరాయిడ్‌ ఇంజెక్షన్లు ఇవ్వాల్సి రావచ్చు. అదనపు ఎముక పెరిగినట్టయితే శస్త్రచికిత్స చేసి తొలగించాల్సి ఉంటుంది.

జాగ్రత్తలు తప్పనిసరి

Heel Pain Precautions:

  • చికిత్సలతో నొప్పి తగ్గిన తర్వాతా కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరి.
  • బరువు అదుపులో ఉంచుకోవాలి.
  • మధుమేహం, గౌట్‌ వంటి సమస్యలుంటే నియంత్రణలో ఉంచుకోవాలి.
  • రోజూ పాదం, పిక్క సాగదీత వ్యాయామాలు చేయాలి.
  • పాదాలకు సరిపడిన చెప్పులు ధరించాలి. చెప్పులు లేకుండా నడవరాదు.

ఇదీ చదవండి:నడుంనొప్పి వేధిస్తుందా?- 15 నిమిషాలు ఇలా చేస్తే..

ABOUT THE AUTHOR

...view details