నరాల సంబంధిత సమస్యలు తరచూ ఎదురవుతున్నా.. దేశవ్యాప్తంగా 60 శాతం మంది నిర్లక్ష్యం చేస్తున్నట్లు పీఅండ్‌జీ హెల్త్ సంస్థ చేపట్టిన అధ్యయనంలో తేలింది. హైదరాబాద్‌లో దాదాపు 34 శాతం ఇలాంటి వాళ్లే ఉన్నారు. సెప్టెంబరు నెల జాతీయ పోషకాహార మాసం సందర్భంగా పీఅండ్‌జీ హెల్త్ సంస్థ దేశవ్యాప్తంగా 12 నగరాల్లో నాడీ వైద్యులు, సిబ్బందితో అధ్యయనం చేపట్టి నివేదికను విడుదల చేసింది. సంస్థ అడిగిన ప్రశ్నల్లో నాడీ వ్యవస్థ ఆరోగ్యకరంగా ఉండటం చాలా ముఖ్యమని 90 శాతం మంది అభిప్రాయపడినా, నరాలు, రక్తనాళాలు వేరన్న విషయం తెలిసినవారు కేవలం 38 శాతం మందిగా తేలింది.
- హైదరాబాద్‌లో అత్యధికంగా 47% మంది చెమట సమస్యతో బాధపడుతుండగా, భోపాల్‌లో 40%, దిల్లీలో 23% మంది బాధపడుతున్నారు.
- హైదరాబాద్‌లో 42% మంది కీళ్ల నొప్పులు, 30% మంది కండరాల బలహీనతతో సతమతమవుతున్నారు. తలనొప్పి, మత్తుగా అనిపించే సమస్యను లక్నోలో 79%, జైపూర్‌లో 55%, ముంబైలో 55%మంది ఎదుర్కొంటున్నారు.
- నరాల అనారోగ్య సమస్యల్ని హైదరాబాద్‌లో 34%, జైపూర్‌లో 85%, ముంబైలో 73%, రాంచీ 73%, భోపాల్ 72%, తిరువనంతపురం 70%, బెంగళూరు 69%, చెన్నై 66%, లక్నో 61%, కోల్‌కతా 60%, దిల్లీ 43%, చండీఘర్ 42% మంది నిర్లక్ష్యం చేస్తున్నారు.