అధిక బరువు.. ప్రస్తుతం చాలామంది ఎదుర్కొంటున్న సమస్యల్లో ఇదీ ఒకటి. దీనివల్ల రక్తపోటు, టైప్-2 డయాబెటిస్, గుండె సంబంధ వ్యాధులు.. మొదలైన వాటి బారిన పడే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి శరీర బరువును ఎంత త్వరగా తగ్గించుకుంటే అంత మంచిది. ఇందుకోసం బయట అందుబాటులో ఉండే చికిత్సలు ఫాలో అవుతూ ఉంటారు చాలామంది. అయితే ఇవి ఆరోగ్యానికి అంత మంచివి కావు. పైగా వీటివల్ల బరువు తగ్గడం అటుంచి.. లేనిపోని దుష్ప్రభావాలు ఎదురయ్యే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి.
కాబట్టి శరీర బరువును తగ్గించుకోవడానికి సహజసిద్ధమైన మార్గాలను అన్వేషించడం మంచిది. అందుకు మన వంటింట్లోని కొన్ని ఆహార పదార్థాలు ఉపయోగపడతాయి. వాటిలో అతి ముఖ్యమైంది 'దాల్చినచెక్క'. మరి, ఇది శరీర బరువును తగ్గించడంలో ఏ విధంగా ఉపయోగపడుతుందో మనమూ తెలుసుకుందామా..
ఇన్ని విధాలుగా..
బరువు తగ్గడం అంటే.. కేవలం శరీరంలో పేరుకుపోయిన అనవసర కొవ్వు కరగడం మాత్రమే కాదు.. ద్రవాల స్థాయులు కూడా తగ్గుతాయి. ఇలా రెండూ బ్యాలన్స్ అవుతూ.. ఒక క్రమపద్ధతిలో బరువు తగ్గడం వల్లనే శరీర పరిమాణం కూడా క్రమంగా తగ్గుతుంది. ఇందుకు దాల్చిన చెక్క బాగా ఉపయోగపడుతుంది. అదెలాగంటే..
* రక్తంలో చక్కెర స్థాయులు పెరగడం వల్ల శరీరంలో కొవ్వులు పేరుకుపోయే అవకాశం ఉంటుంది. దాల్చిన చెక్క వల్ల శరీరంలో ఇన్సులిన్ ప్రభావం పెరిగి.. తద్వారా రక్తంలోని చక్కెర స్థాయులు అదుపులో ఉంటాయి. ఫలితంగా శరీరంలో కొవ్వులు పేరుకుపోకుండా ఉండడంతో పాటు స్థూలకాయం, మధుమేహం.. వంటి ఆరోగ్య సమస్యలు దరిచేరకుండా జాగ్రత్తపడచ్చు.
* ఇందులో ఉండే క్రోమియం ఆకలిని అదుపులో ఉంచడంతో పాటు శరీరంలోని గ్లూకోజ్ స్థాయుల్ని స్థిరీకరించి తద్వారా బరువు తగ్గేందుకు సహాయపడుతుంది.
* ఈ పదార్థం శరీరంలోని వేడిని పెంచుతుంది. తద్వారా జీవక్రియల వేగం కూడా పెరుగుతుంది. ఇది అనవసర కొవ్వుల్ని కరిగించడంలో తోడ్పడుతుంది.
* అలాగే ఇందులోని హైడ్రాక్సీసినమాల్డిహైడ్ అనే సమ్మేళనం రక్తంలోని హానికారక కొవ్వుల్ని తగ్గిస్తుంది. అలాగే జీవక్రియల్ని వేగవంతం చేసి బరువు తగ్గడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.
* దాల్చిన చెక్కలోని యాంటీబ్యాక్టీరియల్ గుణాలు పొట్టలోని చెడు బ్యాక్టీరియాను తొలగించి.. మనం తీసుకున్న ఆహారంలోని మంచి బ్యాక్టీరియా పొట్టలోకి చేరేందుకు సహాయపడుతుంది. తద్వారా జీర్ణవ్యవస్థ శుభ్రంగా ఉండి ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. ఫలితంగా బరువు పెరగకుండా జాగ్రత్తపడచ్చు.
* దాల్చిన చెక్క శరీరంలోని చెడు కొవ్వుల్ని క్రమంగా తగ్గించి, మంచి కొవ్వుల స్థాయిని పెంచుతుంది. తద్వారా ఇతర హానికరమైన ఆరోగ్య సమస్యల బారినుంచి బయటపడడమే కాకుండా ఆరోగ్యంగా బరువు తగ్గడంలో దోహదం చేస్తుంది.