ఎవరో వచ్చి, ఏదో చేయరు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సంకల్పించుకోవాల్సింది మనమే. శ్రద్ధ తీసుకోవాల్సిందీ మనమే. ఆరోగ్య సంరక్షణలో అన్నింటికన్నా ముఖ్యమైంది, కీలకమైంది మన జీవనశైలే. మంచి ఆహారం, బరువు అదుపు, క్రమం తప్పని వ్యాయామం విషయంలో పెద్ద పెద్ద లక్ష్యాలే అవసరం లేదు. చిన్న చిన్న మార్పులైనా చాలు. నెమ్మదిగా ఆరంభించినా చాలు. పెద్ద ప్రయోజనమే కనిపిస్తుంది. క్రమంగా ఒక అలవాటుగా మారి, చక్కటి ఆరోగ్య జీవితానికి మార్గం సుగమం చేస్తుంది. ప్రపంచ ఆరోగ్య దినం పరోక్షంగా ఇదే సూచిస్తోంది. సమానమైన, మెరుగైన ఆరోగ్య ప్రపంచాన్ని నిర్మించాలని నినదిస్తోంది. పుట్టిన చోటు, పెరిగిన తీరు, చదివిన చదువు, చేస్తున్న పని, ఆర్థిక స్థితి, జీవన విధానం, వయసు, లింగ బేధం వంటివన్నీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేసేవే కావొచ్చు. వైద్య సదుపాయాలు, చికిత్సల విషయంలో ఇవి అసమానతలకూ దారితీస్తుండొచ్చు. కానీ వ్యక్తిగత శ్రద్ధకు ఇవేవీ ఆంటకాలు కావు. డబ్బున్నా లేకున్నా, ఎవరైనా ఎక్కడైనా మంచి జీవనశైలితో సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. జబ్బుల బారినపడకుండా హాయిగా, ఆనందంగా జీవించొచ్చు. మనసుంటే మార్గం దొరక్కపోదు. కొవిడ్-19 విజృంభణ నేపథ్యంలో ఇది మరింత ముఖ్యమనీ గ్రహించాలి.
ఒక్క నడకైనా మేలే
వ్యాయామంతో ఆరోగ్యం, ఆయుష్షు ఇనుమడిస్తాయి. రోగనిరోధకశక్తీ పెంపొందుతుంది. వ్యాయామాలు అనగానే జిమ్లకే వెళ్లాల్సిన పనిలేదు. ఖరీదైన పరికరాలూ అవసరం లేదు. ఒక్క నడకైనా చాలు. దీనికి పెద్దగా ఖర్చు కూడా కాదు. పాదాలకు మంచి దన్నునిచ్చే షూ వేసుకుంటే చాలు. నడక తేలికైన, శక్తిమంతమైన వ్యాయామం. అధిక రక్తపోటు, గుండెజబ్బు, పక్షవాతం, మధుమేహం ముప్పులు తగ్గటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎముకలు, కండరాలు బలం పుంజుకోవటానికీ దోహదం చేస్తుంది. లయ బద్ధంగా అడుగులేస్తుంటే సింపాథెటిక్ నాడీ వ్యవస్థ ఉత్తేజితమై ఆందోళన, ఒత్తిడీ తగ్గుముఖం పడతాయి. అందువల్ల రోజూ కనీసం అరగంట సేపు కాస్త వేగంగా నడవటం అన్ని విధాలా మంచిది. మొదట్లో కష్టంగా అనిపిస్తే రోజుకు 10 నిమిషాలతోనే ఆరంభించొచ్చు. ముందు కొద్దిసేపు నెమ్మదిగా, తర్వాత కొద్దిసేపు కాస్త వేగంగా, అనంతరం తిరిగి నెమ్మదిగా నడవటం మేలు.
కంటి నిండా నిద్ర
వేళకు ఆకలి వేయాలన్నా, తిన్నది సరిగా జీర్ణం కావాలన్నా, మనసు ప్రశాంతంగా ఉండాలన్నా, రోగనిరోధకశక్తి పుంజుకోవాలన్నా నిద్ర చాలా ముఖ్యం. కానీ ఇప్పుడదే కరవవుతోంది. ఉద్యోగాలు, పనులు, విందు వినోదాల వంటివి నిద్రకు పెద్ద శత్రువుగా పరిణమిస్తున్నాయి. దీన్ని సరిదిద్దుకోవటం కష్టమేమీ కాదు. రోజూ ఒకే సమయానికి పడుకోవటం, లేవటం ద్వారా జీవ గడియారాన్ని (సర్కేడియన్ రిథమ్) సరిచేసుకోవచ్చు. అలాగే పడకగది ప్రశాంతంగా, చల్లగా ఉంచుకోవాలి. మరీ ఎక్కువ వెలుతురు లేకుండా చూసుకోవాలి. పడుకోవటానికి గంటన్నర ముందే కంప్యూటర్లు, టీవీల వంటివి కట్టేయాలి. రాత్రి భోజనం తర్వాత మద్యం జోలికి వెళ్లకపోవటం ఉత్తమం. ఇది ముందు నిద్రమత్తు కలిగించినా మధ్యమధ్యలో మెలకువ వచ్చేలా చేస్తుంది. భోజనం చేసిన వెంటనే.. ముఖ్యంగా మసాలా పదార్థాలు తిన్న వెంటనే పడుకోవటం తగదు. ఇది ఛాతీలో మంటకు దారితీసి నిద్రను దెబ్బతీయొచ్చు. ప్రయత్నం చేస్తే ఇలాంటి మార్పులు క్రమంగా ఒక అలవాటుగా మారతాయి.
ఆహారమే బలం
ఆరోగ్యానికి ఆహారమే పునాది. చాలావరకు జబ్బులకు గతి తప్పిన ఆహార అలవాట్లే కారణం. ఆహారంలో ప్రొటీన్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు అన్నీ సమతులంగా ఉండేలా చూసుకోవాలి. రోజూ రంగు రంగుల పండ్లు, కూరగాయలు విధిగా తీసుకోవాలి. ఇవి గుండెపోటు, పక్షవాతం, క్యాన్సర్ వంటి జబ్బుల ముప్పులు తగ్గేలా చేస్తాయి. చూపు సమస్యల నివారణకూ తోడ్పడతాయి. అంతా వీటిల్లోని ఖనిజాలు, విటమిన్లు, వృక్ష రసాయనాల మహత్మ్యమే. రోజుకు 400 గ్రాముల పండ్లు, కూరగాయలు తినాలన్నది ప్రపంచ ఆరోగ్యసంస్థ సిఫారసు. వీటిల్లో 150 గ్రాముల పండ్లు, 250 గ్రాములు కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. కానీ మనదగ్గర పట్టణాల్లో 199 గ్రాములు, గ్రామాల్లో 126 గ్రాముల కూరగాయలే తింటున్నారు. ఇక పండ్లనైతే పట్టణాల్లో 38 గ్రాములు, గ్రామాల్లో 26 గ్రాములు మాత్రమే తీసుకుంటున్నారు. దీన్ని మార్చుకోవటం మన చేతుల్లోనే ఉంది. అల్పాహారంతో పాటు ఒక పండు తినటం అలవాటు చేసుకోవచ్చు. ఆమ్లెట్ల వంటివి వేసుకున్నప్పుడు అందులో కూరగాయ ముక్కలు కలపొచ్చు. స్థానికంగా, ఆయా కాలాల్లో దొరికే పండ్లు, కూరగాయలు తినటం మేలు. ఇవి చవకగానూ అందుబాటులో ఉంటాయి. ఉప్పు ఎంత తక్కువ తింటే అంత మంచిది. మిఠాయిలు, తీపి పానీయాలు ఎక్కువగా తీసుకోవటం తగదు.
- మాంసాహారులైతే పప్పు, కూరగాయల వంటివీ తోడుగా తినాలి. మాంసం ఒక్కటే అన్ని పోషకాలను అందించలేదు. మనదగ్గర కారం, మసాలాలు దట్టించి పలుచగా వండుకొని రోజంతా ఆ మాంసం కూరతోనే సరిపెట్టుకుంటుంటారు. దీంతో కడుపు నిండొచ్చేమో గానీ పోషకాలు అందవు.
బాగా నమిలి.. నెమ్మదిగా తిని..