సమస్య: నా వయసు 45 ఏళ్లు. రెండున్నర నెలల క్రితం కరోనా వచ్చి, తగ్గిపోయింది. అప్పట్నుంచీ గుండె దడగా ఉంటోంది. ఎప్పుడు చూసినా నిమిషానికి 95 సార్లు కొట్టుకుంటోంది. కాసేపు నడిచినా, చిన్న పనిచేసినా 130కి పెరుగుతోంది. అప్పుడప్పుడు ఛాతీలో నొప్పిగా అనిపిస్తోంది. దీంతో భయం వేస్తోంది. ఇదేమైనా గుండె సమస్యనా? పరిష్కారమేంటి?
-శ్రీనివాస్, హైదరాబాద్
సలహా: వివరాలను బట్టి చూస్తుంటే మీరు భయాందోళనలకు గురవుతున్నారని అనిపిస్తోంది. కొవిడ్-19 తగ్గిన తర్వాత (పోస్ట్, లాంగ్ కొవిడ్‌లో) మూడింట ఒకవంతు మందిలో గుండె దడ వంటి ఆందోళన లక్షణాలు చూస్తున్నాం. మీరు నిమిషానికి 95 సార్లు గుండె కొట్టుకుంటోందని, పని చేస్తే పెరుగుతోందని అంటున్నారు. నిజానికిది నార్మలే. ఇప్పుడు పల్స్ ఆక్సీమీటర్లు, స్మార్ట్‌వాచ్‌ల వంటి పరికరాలు వాడుకోవటం పెరిగింది. మీరు వీటితో అదేపనిగా గుండె వేగాన్ని గమనిస్తున్నట్టయితే మానెయ్యటం మంచిది.
ఎలా మారుతుంది?
నార్మల్ గుండె వేగం ఎంతన్నది తెలియకపోతే ఏమాత్రం ఎక్కువున్నా ఆందోళనకు దారితీస్తుంది. ఇది గుండె వేగం మరింత పెరిగేలా చేస్తుంది. గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకోవటం నార్మల్ అని చాలామంది భావిస్తుంటారు. దీనికి ఏమాత్రం అటుఇటైనా ఏదో అయిపోయిందని భయపడుతుంటారు. దీంతో గుండె దడ ఇంకాస్త పెరుగుతుంది కూడా. గుండె వేగం ఎప్పుడూ ఒకేలా ఉండదు. వయసు, పనులు, శరీర ఉష్ణోగ్రతలను బట్టి మారిపోతుంటుంది.