omicron treatment at home remedies: రోజురోజుకు కరోనా విజృంభిస్తోంది. బాధితుల్లో అత్యధికులకు ఒమిక్రాన్ సోకుతోందని ఇటీవల ప్రభుత్వ అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా ఒమిక్రాన్‌లో ఎగువ శ్వాసకోశ సంబంధిత సాధారణ ఇబ్బందులే తలెత్తుతున్నాయి. శరీరంలో ఆక్సిజన్ స్థాయి తగ్గడం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపించడం లేదు. అధిక శాతం బాధితులు ఇంటి వద్దే కోలుకుంటున్నారు. ఇలాంటి వారు వంటింటి దినుసులను ఉపయోగించుకుని కూడా కొంత ఉపశమనం పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా జలుబు, దగ్గు, తలనొప్పి, జ్వరం, ఒళ్లు నొప్పులు, గొంతులో గరగర, గొంతు నొప్పి తదితర సాధారణ సమస్యలను ఇంట్లో వాడే పదార్థాలతోనే సాంత్వన పొందొచ్చని ఎర్రగడ్డలోని ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్.ఉమాశ్రీనివాస్ తెలిపారు. 14 ఏళ్లు పైబడిన వారందరికీ ఈ వైద్యం ఉపయోగపడుతుందన్నారు. ఆ చిట్కాలు ఆయన మాటల్లోనే..
జ్వరం, జలుబు, దగ్గు:
అమృత (గుడూచి) ఆకులను దంచి రసాన్ని తీసి, టీస్పూన్ చొప్పున మూడు పూటలా తీసుకోవాలి. ఇలా అయిదు రోజులు చేస్తే.. జ్వరం, గొంతు నొప్పి తగ్గుతాయి. లేదా మహాలక్ష్మి విలాసరస్, లక్ష్మి విలాసరస్ మాత్రలు ఉదయం, సాయంత్రం ఒకటి చొప్పున 5 రోజులపాటు వేసుకోవచ్చు.
దగ్గు:
నాలుగు మిరియాలు దంచి తులసి ఆకుల రసంలో కలిపి ఉదయం, సాయంత్రం టీ స్పూన్ వంతున నాలుగు రోజులు తీసుకుంటే దగ్గు తగ్గుతుంది. గొంతునొప్పి పోవాలంటే పాలల్లో 5-6 గ్రాముల మిరియాల పొడి వేసి 5-7 రోజులపాటు తాగాలి.
తలనొప్పి:
శొంఠి అరగదీసి కణతలపై ఉదయం, సాయంత్రం పూసుకోవాలి.
జలుబు, దగ్గు:
పుదీనా ఆకు, తమలపాకుల రసం తీసి ఉదయం, సాయంత్రం టీ స్పూన్ చొప్పున తీసుకోవాలి. దీంతో పాటు ఒక లవంగ మొగ్గను నోట్లో వేసుకొని చప్పరించాలి.