Omicron Spread: డెల్టా మాదిరిగా ఒమిక్రాన్ రకం వైరస్‌తో తలెత్తే కొవిడ్ జబ్బు తీవ్రం కావటం లేదు. కానీ 70 రెట్లు ఎక్కువ వేగంగా విస్తరిస్తోంది. ఇంట్లో ఒకరికి వస్తే అందరికీ వచ్చినట్టేననీ అన్నా అతిశయోక్తి కాదు. ఇది చాలావరకు ముక్కు, గొంతు వరకే పరిమితమవుతోంది. శ్వాసనాళం, ఊపిరితిత్తులపై పెద్దగా ప్రభావం చూపటం లేదు. కొద్దిగా జ్వరం, ముక్కు దిబ్బడ, తలనొప్పి, ఒళ్లునొప్పులు, నీరసం, గొంతులో ఏదో అడ్డుపడినట్టు అనిపించటం వంటి లక్షణాలే ప్రధానంగా కనిపిస్తున్నాయి. అత్యవసరంగా ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి తలెత్తటం లేదు. ఆక్సిజన్ శాతం పడిపోవటం, ఆయాసం రావటం, శ్వాసవ్యవస్థ విఫలం కావటం వంటి తీవ్ర ఇబ్బందులేమీ ఉండటం లేదు. అందుకేనేమో చాలామంది ప్రస్తుతం కొవిడ్-19ను తేలికగా తీసుకుంటున్నారు. ఒమిక్రాన్ రకం వైరసే కదా, ఏమీ కాదులే అని అలసత్వం వహిస్తున్నారు. ఇది సరికాదు. కొవిడ్ బారినపడుతున్న అందరికీ ఒమిక్రాన్ వైరసే సోకిందని చెప్పలేం. ఎందుకంటే వాతావరణంలో డెల్టా వైరస్ ఇంకా అలాగే ఉంది. ప్రస్తుతం ఒమిక్రాన్ రకం వైరస్ ఎక్కువగా వ్యాప్తిలో ఉండటం వల్ల అంతా ఇదే అయ్యిండొచ్చని భావిస్తున్నారు. నిజానికి ఎవరికి ఏ రకం వైరస్ సోకిందనేది చెప్పటం కష్టం. మామూలు జలుబు లక్షణాలుంటే ఒమిక్రాన్ రకం వైరస్ అయ్యిండొచ్చన్నది వైద్యుల అంచనా మాత్రమే. కొవిడ్ నిర్ధరణ పరీక్షల్లో ఏ రకం వైరస్ అన్నది తేలదు. జన్యు విశ్లేషణ చేస్తేనే బయటపడుతుంది. మనదగ్గర కేవలం 5% నమూనాల్లోనే జన్యు విశ్లేషణ చేస్తున్నారు. కొన్నిచోట్ల ఎస్ జీన్ పరీక్షతో దీన్ని గుర్తించొచ్చని తప్పుదారి పట్టిస్తున్నారు. ఇది నెగెటివ్‌గా ఉంటే ఒమిక్రాన్ వైరస్ అయ్యిండొచ్చు గానీ కచ్చితంగా అదేనని చెప్పటం కష్టం. ఎలాంటి రకం వైరస్ అయినా అశ్రద్ధ చూపటం తగదు. పైగా ఒమిక్రాన్ చాలా వేగంగా విస్తరిస్తున్నందున మరింత అప్రమత్తంగా ఉండటం అత్యవసరం.
కాస్త సడలింపు
కొవిడ్ తీవ్రత తగ్గిన నేపథ్యంలో భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) కూడా నిర్ధరణ పరీక్షలు, విడిగా ఉండటం, చికిత్సల విషయంలో కొన్ని సడలింపులు సూచించింది. మధ్యస్థ, తీవ్రదశ ఇన్‌ఫెక్షన్‌లో మాత్రం చికిత్సల పరంగా ఎలాంటి మార్పులు చేయలేదు. అయితే ఇప్పుడు చాలామందికి తొలిదశలోనే జబ్బు నయమవుతోంది. మునుపటిలా ఆక్సిజన్, రెమ్‌డెసివిర్ అవసరపడటం లేదు. ఇదే ఇప్పుడు కాస్త ఊరట కలిగిస్తోంది.
అందరికీ తేలికగానే తగ్గుతుందా?
ఒమిక్రాన్ రకంతో వచ్చిన కొవిడ్-19 చాలామందికి తేలికగానే తగ్గుతుండటం నిజమే. కానీ అందరిలోనూ మామూలు లక్షణాలకే పరిమితమవ్వాలనేమీ లేదు. ఆరోగ్యవంతులను, ఇతరత్రా జబ్బుల్లేని వారిని, టీకాలు తీసుకున్నవారినిది పెద్దగా ఇబ్బంది పెట్టటం లేదు. అయితే మధుమేహం వంటి దీర్ఘకాలిక సమస్యలున్నవారికి, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి, టీకాలు పూర్తిగా తీసుకోనివారికి తీవ్రంగా పరిణమించే అవకాశం లేకపోలేదు. కాబట్టి నిర్లక్ష్యం వహిస్తే చేజేతులా ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్టే.
లక్షణాలు మామూలుగా ఉంటే ఇంట్లోనే..
ఒంట్లో ఏమాత్రం నలతగా ఉన్నా.. ముక్కుదిబ్బడ, జ్వరం, గొంతునొప్పి వంటి కొవిడ్ అనుమానిత లక్షణాలు కనిపించినా ముందుగా చేయాల్సింది ఇంట్లోనే ఉండటం. మామూలు జలుబే కదా అనుకొని అందరిలో కలిసి తిరగటం తగదు. ఈలోపు ఇంట్లోవాళ్లకు, బయటివాళ్లకు వైరస్ అంటుకునే ప్రమాదముంది. కొవిడ్ నిర్ధరణ అయినా, కాకున్నా చికిత్సలో పెద్దగా మార్పేమీ ఉండదు. వైరస్ నిర్మూలనకు ప్రత్యేకించి మందులేవీ ఇవ్వటం లేదు. ఆయా లక్షణాలను బట్టే చికిత్స చేస్తున్నారు. లక్షణాలు మామూలుగా ఉన్నప్పుడు జ్వరం, ఒళ్లునొప్పులు తగ్గటానికి పారాసిటమాల్ మాత్రలు.. ముక్కుదిబ్బడ, గొంతులో గరగరకు యాంటీ హిస్టమిన్ మాత్రలు.. దగ్గు వస్తుంటే దగ్గుమందు వాడుకోవచ్చు. వీటితో పెద్దగా దుష్ప్రభావాలేవీ ఉండవు. వీలైతే ఆన్‌లైన్‌లో డాక్టర్‌ను సంప్రదించి మందులు తీసుకుంటే మంచిది. లక్షణాలు తగ్గుముఖం పడుతుంటే పరీక్షలేవీ అవసరం లేదు. ఏడు రోజుల తర్వాతే బయటకు రావాలి. ఒకవేళ రెండు రోజులుగా మందులు వాడుతున్నా లక్షణాలు తగ్గకపోతే కొవిడ్ నిర్ధరణ పరీక్ష చేయించుకోవాలి. కొవిడ్ నిర్ధరణ అయ్యి, లక్షణాలు మామూలుగానే ఉంటే అవే మందులు కొనసాగించాల్సి ఉంటుంది. సాధారణంగా తేలికపాటి లక్షణాలు నాలుగైదు రోజుల్లో తగ్గిపోతాయి. ఒకవేళ లక్షణాలు ఐదు రోజులయినా తగ్గకపోతే ఇన్‌హేలర్ రూపంలో బుడిసెనైడ్ మందు వాడుకోవచ్చు.
ఆక్సిజన్ శాతం పరీక్షించుకోవాలి
ఒమిక్రాన్ రకం ఇన్‌ఫెక్షన్‌లో ఆక్సిజన్ శాతమేమీ తగ్గటం లేదు. కానీ ఏ రకం వైరస్ సోకిందో తెలియదు కాబట్టి ప్రతి 6 గంటలకు రక్తంలో ఆక్సిజన్ శాతం చూసుకోవటం మంచిది. అలాగే 6 నిమిషాల సేపు నడిచిన తర్వాత ఆక్సిజన్ శాతం పడిపోతోందేమో కూడా చూసుకోవాలి. ఆక్సిజన్ శాతం 93 కన్నా కిందికి పడిపోతుంటే అప్రమత్తం కావాలి. ఒకటికి రెండు సార్లు ఆక్సిజన్ శాతాన్ని పరిశీలించాకే తగ్గుతున్న విషయాన్ని నిర్ధరించుకోవాలి. ఆక్సీమీటర్‌ను కుడి చేయి మధ్యవేలుకు పెట్టుకొని, కాసేపు ఉంచి పరీక్షించుకోవాలి.
- ప్రతి 8 గంటలకు ఒకసారి థర్మామీటర్‌తో ఉష్ణోగ్రత ఎంతుందో చూసుకోవాలి.
- ప్రతి 6 గంటలకు ఒకసారి కాసేపు బోర్లా పడుకోవాలి. దీంతో శ్వాస బాగా ఆడుతుంది.
ద్రవాలు ఎక్కువగా తీసుకోవాలి
జ్వరం వచ్చినప్పుడు ఒంట్లోంచి నీరు, నీటితో పాటు లవణాలు బయటకు వెళ్లిపోతాయి. దీంతో నీరసం ఎక్కువవుతుంది. ఒంట్లో నీటిశాతం మరీ పడిపోతే కిడ్నీలు దెబ్బతినే ప్రమాదమూ ఉంది. కాబట్టి నీరు, ద్రవాలు ఎక్కువగా తీసుకోవాలి.
నిబ్బరంగా ఉండాలి
కొవిడ్-19 గతంలో తీవ్రంగా విరుచుకుపడింది. ఎంతోమందిని పొట్టన పెట్టుకుంది. ఆ భయాలు ఇంకా వీడలేదు. తిరిగి కొవిడ్ బారినపడితే అవి వెంటాడే ప్రమాదం లేకపోలేదు. కాబట్టి నిబ్బరంగా ఉండటం అలవరచుకోవాలి. భయపడితే రోగనిరోధక శక్తి తగ్గుతుంది. దీంతో సమస్య తీవ్రమవుతుంది. భయం మూలంగానే చాలామంది ఆసుపత్రిలో చేరటం చూస్తున్నాం. అందువల్ల భయపడకుండా చూసుకోవాలి. ఇందుకు ధ్యానం ఎంతగానో ఉపయోగపడుతుంది. కాలక్షేపానికి టీవీలో, ఫోన్‌లో వినోదాత్మక కార్యక్రమాలు చూడాలి. ఆత్మీయులతో ఫోన్‌లో మాట్లాడుకోవాలి. వీడియో కాల్స్ చేసుకోవాలి. జబ్బు నుంచి దృష్టి మరల్చి, మరచిపోయే ప్రయత్నం చేయాలి. ఇంట్లో ఖాళీగా ఉంటున్నామని, ఏమీ తోచటం లేదని సిగరెట్లు కాల్చటం, మద్యం తాగటం వంటివి చేయొద్దు. సామాజిక మాధ్యమాల సందేశాలను నమ్మొద్దు.
- ఇప్పటికే మధుమేహం వంటి దీర్ఘకాలిక జబ్బులు గలవారు ముందుగానే డాక్టర్‌ను కలిసి, చికిత్స తీసుకోవటం తప్పనిసరి.
- ఆక్సిజన్ 93% కన్నా తగ్గినా, ఆయాసం పెరుగుతున్నా, జ్వరం తీవ్రంగా ఉంటూ ఐదు రోజులైనా తగ్గకపోయినా, దగ్గు విపరీతంగా వస్తున్నా వెంటనే డాక్టర్ సలహా తీసుకోవాలి.
యాంటీవైరల్ మందు ప్రభావం అంతంతే