తెలంగాణ

telangana

By

Published : Nov 11, 2022, 8:37 AM IST

ETV Bharat / sukhibhava

వృద్ధాప్యంలోనూ ఉల్లాసంగా, ఉత్సాహంగా.. అది ఎలా అంటే?

వయస్సు మీద పడుతున్నా సరే.. ఉల్లాసంగా ఉత్సాహంగా జీవించాలనుకుంటారు మనుషులు. అయితే వృద్ధాప్యం కారణంగా అనేక సమస్యలు వచ్చి పడుతుంటాయి. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుని.. మలి వయస్సులోనూ యవ్వనంలా కనిపించొచ్చు అంటున్నారు వైద్యులు. అవి ఏంటో తెలుసుకోవాలనుందా.. అయితే ఈ స్టోరీ చదవాల్సిందే!

tips of old age look younger than your age
వృద్ధాప్యంలోనూ ఉల్లాసంగా

వృద్ధాప్యాన్ని జయించాలని అనుకోనివారెవరు? ఆయుష్షును పెంచుకోవాలని కోరుకోనివారెవరు? వయసు మీద పడుతున్నా హాయిగా, ఆనందంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా గడపాలనే ఉంటుంది. నలుగురిలో అందంగా, ఆకర్షణీయంగా కనిపించాలనే అనిపిస్తుంది. మరి ఇందుకోసం ఏం చేయాలి? పెద్దగా చేయాల్సిందేమీ లేదు. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకున్నా చాలు. మలి వయసులోనూ నవోత్సాహంతో తొణికిసలాడేలా చూసుకోవచ్చు.

స్నేహితులతో సరదాగా
మిత్రుల సమక్షంలో కలిగే ఉత్సాహమే వేరు. మన బాధలు, సంతోషాలను పంచుకోవటానికి స్నేహితులను మించినవారు లేరంటే అతిశయోక్తి కాదు. మనం ఎక్కడ నివసిస్తున్నాం? ఎక్కడ పనిచేస్తున్నాం? అనే వాటి కన్నా ఇతరులతో కలిసి గడిపే సమయమే ఆయుష్షు విషయంలో గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది.

సృజనాత్మకంగా
బొమ్మలు గీయటం వంటి సృజనాత్మక కళలు సంతోషాన్ని కలగజేస్తాయి. మరింత స్పష్టంగా ఆలోచించేలా, హాయిగా జీవించేలా చేస్తాయి. కాబట్టి ఏవైనా లలిత కళలను సాధన చేయటం మంచిది. వీటితో ఆత్మ విశ్వాసం ఇనుమడిస్తుంది. ఉత్సాహం తొణికిసలాడుతుంది. ఇలా ఇవి ఆయుష్షు పెరగటానికీ తోడ్పడతాయి.

వ్యాయామం తప్పకుండా
శరీరం ఆరోగ్యంగా ఉండటానికే కాదు, మనసు ఉల్లాసంగా ఉండటానికీ వ్యాయామం తోడ్పడుతుంది. ఇది వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తుంది. ఆలోచన సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది. వయసుతో వచ్చే అధిక రక్తపోటు, మధుమేహం, గుండెజబ్బుల నివారణకూ తోడ్పడుతుంది. మరీ పెద్ద పెద్ద వ్యాయామాలే చేయాలనేమీ లేదు. ఇంట్లో తోటపని చేసినా, ఇంటి చుట్టూ నడిచినా చాలు. వారానికి కనీసం రెండున్నర గంటల సేపు శరీరానికి శ్రమ కలిగేలా చూసుకుంటే మంచిది. పుషప్స్‌, బస్కీలు తీయటం వంటివైనా చేయొచ్చు.

కొత్త విషయాలు నేర్చుకోవటం
ఇది మెదడు క్షీణించకుండా కాపాడుతుంది. కాస్త శ్రమతో కూడిన కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటే ఇంకా మంచిది. ఉదాహరణకు- డ్యాన్స్‌ సాధన చేస్తే కండరాలకూ మేలు చేస్తుంది. అదే సమయంలో నలుగురితో కలిసి పనిచేయటమూ అలవడుతుంది. ఇలా మనసుకు, శరీరానికి రెండిందాలా ఉపయోగపడుతుంది.

దంతాలు శుభ్రంగా
రోజూ ఉదయం నిద్ర లేచాక, రాత్రి పడుకునే ముందు పళ్లు తోముకోవటం ఎంతైనా అవసరం. సన్నటి దారంతో దంతాల మధ్య కూడా శుభ్రం చేసుకోవాలి. దీంతో చిగుళ్లు దెబ్బతినకుండా చూసుకోవచ్చు. లేకపోతే చిగుళ్లు కిందికి జారిపోవచ్చు. ఇది వయసు మీద పడిన భావన కలిగిస్తుంది. పళ్లను శుభ్రంగా ఉంచుకుంటే గుండెజబ్బు, పక్షవాతం, క్లోమ క్యాన్సర్‌ వంటి తీవ్ర సమస్యల ముప్పునూ తగ్గించుకోవచ్చు.

పొగకు దూరం
సిగరెట్లు, చుట్టల వంటివి కాలిస్తే రక్తనాళాల లోపలి మార్గం సన్నబడుతుంది. దీంతో చర్మం పైపొరకు రక్త సరఫరా తగ్గిపోయి ముడతలు పడతాయి. ఇవి వయసు మీద పడినట్టు కనిపించేలా చేస్తాయి. పొగ అలవాటుతో గుండె, ఊపిరితిత్తుల జబ్బులూ తలెత్తుతాయి. వీటితో ఉత్సాహమే కాదు.. అందం, ఆకర్షణా తగ్గుతాయి.

ABOUT THE AUTHOR

...view details