తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

మనకు మనమే బరువవుతున్నామా..?

2020లో కొవిడ్ కారణంగా ఇళ్లల్లో బందీలై పుష్టికరమైన ఆహారం తీసుకొని బరువయ్యారా? వ్యాయామం కొరవడిందా? అధిక శరీర బరువుతో ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న అలాంటి వారికోసం డాక్టర్. పి.వి.రంగనాయకులు (పి.హెచ్.డి) కొన్ని సూచనలు ఇస్తున్నారు. అధిక బరువు ఊబకాయానికి దారితీయకుండా ఉండాలంటే ఏం చేయాలి? అసలు, ఊబకాయానికి అధిక బరువుకు ఉన్న తేడాలేమిటో వివరించారు డాక్టర్ రంగనాయకులు.

obesity
మనకు మనమే బరువవుతున్నామా..?

By

Published : Feb 23, 2021, 8:19 PM IST

గడిచిన 50 సంవత్సరాలలో ఊబకాయుల సంఖ్య మూడు రెట్లు పెరిగినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు చెబుతున్నాయి. అయితే ముందుగా ఊబకాయానికి అధిక బరువుకు మధ్య ఉన్న తేడాను మనం గుర్తించాలి. అధిక బరువు ఉన్నంత మాత్రాన వారిని ఊబకాయులు అనలేం. అంత కచ్చితమైన కొలత కాకపోయినా శరీరం ఎత్తు, బరువు (బి.ఎమ్.ఐ.)ల నిష్పత్తి కొంతవరకు ఉపయోగపడుతుంది. బి.ఎమ్.ఐ. ఫలితం 30కి పైగా ఉంటేనే స్థౌల్యం లేదా ఊబకాయం అవుతుంది. 25 నుంచి 30 వరకూ బి.ఎమ్.ఐ. ఉంటే అధికబరువుగా పరిగణించాలి. 25 లోపు ఉన్నవారిని (కార్శ్యం) అనగా బలహీనులుగా గుర్తించాలి. శరీర బరువులో స్త్రీలలో 23 శాతం వరకు, పురుషులలో 18 శాతం వరకూ కొవ్వు ఉండవచ్చు. అంతకుమించి ఉంటే అధిక బరువుగానే పరిగణించాలి.

భారత్లోనూ ఊబకాయుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అధిక బరువు అతిపోషణ వల్ల కలగవచ్చు. ఊబకాయం వ్యాధి అయితే, అధిక బరువు వ్యాధి కాదు. బరువు పెరగడానికి జీవన శైలిలో కలిగే అనూహ్యమైన మార్పులే కారణాలుగా కనిపిస్తున్నాయి. కొందరిలో మాత్రమే ఊబకాయం ఒక వ్యాధిగా మారవచ్చు. అధిక బరువు ఊబకాయంగా మారకుండా ఉండటం కోసం ఇక్కడ సూచించిన ఆరోగ్య సూత్రాలు, గృహ వైద్యం, చికిత్సలను వైద్యులు తెలియజేస్తున్నారు.

అధిక బరువుకు కారణాలు:

  • తియ్యటి, చల్లని, నూనెతో కూడిన పదార్ధాలను అధికంగా తినడం
  • శారీరక వ్యాయామం తగినంతగా లేకపోవటం
  • పగటి నిద్ర
  • లైంగికాసక్తి తగ్గించుకోవడం
  • మానసిక శ్రమ (మెదడుకు పని) తగినంతగా లేకపోవడం

ఊబకాయానికి కారణాలు:

  • గర్భస్త దశలో ఉన్నపుడు తల్లి అధికంగా తీపి పదార్ధాలను తిని ఉండటం
  • బీజదోషం వల్ల కొన్ని ధాతువుల, ప్రధానంగా మేదో ధాతువు, అతి వృద్ధి
  • మేదో ధాతువు దూషితమవటం

ఊబకాయంలో లక్షణాలు:

  • శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది (ఎగశ్వాస)
  • దప్పిక
  • ఆకలి
  • ఎక్కువగా చెమట పట్టడం
  • శరీరంపై దుర్వాసన
  • నిద్రలో గురక
  • లైంగిక పటుత్వం తగ్గటం

ఊబకాయం ఒక వ్యాధేకాక ఇతర వ్యాధులను కూడా కలిగిస్తుంది. ముఖ్యంగా మధుమేహం, భగందరం మొదలైన ఇతర ఉపద్రవాలకు ఊబకాయం ఒక కారణం. ఇంటిపట్టున ఉండి, ఎక్కువ శారీరక శ్రమ లేకుండా, అధిక అహారం తీసుకుంటూ ఉంటే అధిక బరువు కలుగుతుంది. శారీరక వ్యాయామంతో పాటు ఆహార సేవన తగ్గినపుడు బరువు తగ్గితే అది ఊబకాయం కాదు. ఊబకాయులకు ఆకలి ఎక్కువగా ఉంటుంది. అలోపతి వైద్యంలో శాస్త్రవేత్తలు లెప్టిన్ అనే ఉత్తేజకాన్ని 1994లో కనుగొన్నారు. దీన్ని కొవ్వునిల్వ ఉన్న అడిపోజ్ కణాలే తయారుచేస్తాయి. లెప్టిన్ తగ్గడం మెదడుపై ప్రభావం చూపి ఎక్కువ ఆహారం తినేట్టు చేస్తుంది. లెప్టిన్ ఉన్నట్టు మెదడు గ్రహిస్తే మనం త్వరగానే తిన్న ఆహారంతో సంతృప్తి పొందుతాము. ఈ సంతులనం లోపించినపుడు ఊబకాయం కలుగుతుంది. అధిక బరువుకు ఊబకాయానికి కొన్ని రోజులలోనే తేడాను గుర్తించవచ్చు. కొన్ని వైద్యపరీక్షల ద్వారానూ కనుగొనవచ్చు. వీటిలో బాడీ మాస్ ఇండెక్స్ (శరీరం ఎత్తు, బరువుల నిష్పత్తి) ఒక మార్గం. అయితే ఇదే అంతిమం కాదు.

చికిత్స..

ఔషధ సేవన కంటే ముందుగా శారీరక, మానసిక శ్రమను అలవాటు చేసుకోవాలి. రాత్రులందు నిద్ర మేల్కోవడం, బాధ, దు:ఖం మొదలైన అంశాలు శరీర బరువును తగ్గిస్తాయి. తేనె వాడకం శరీర బరువు తగ్గిస్తుంది. తేనెను ఆయుర్వేదం లేఖనం (కొవ్వును కరిగించేది) గా గుర్తించింది.

బార్లీ (యవ), కొర్రలు, జొన్నలు, రాగులు, సజ్జలు మొదలైన చిరుధాన్యాలు, పెసలు, ఉలవలు, కందిపప్పు, ఉసిరి, మజ్జిగ, తేనె ఆహారంగా తీసుకోవాలి. వంకాయ వేపుడు, చేపలు, చేదుగా ఉన్న ఆహార పదార్థాలు, మద్యం అలవాటు ఉంటే చాలా పరిమితంగా తీసుకోవాలి.

  • నవక గుగ్గులు, రోజుకు 2 మాత్రలు తేనెతో సేవించాలి.
  • విడంగాది చూర్ణం, రోజుకు 2 నుంచి 4 గ్రాములు తేనెతో సేవించాలి.
  • త్రిఫలాది గుగ్గులు, రోజుకు 2 మాత్రలు నీటితో సేవించాలి.

నిషేధం

  • చన్నీటితో స్నానం
  • కొత్త బియ్యం, గోధుమల ఆహారాన్ని తినడం
  • మాంసాహారం
  • పగటి నిద్ర
  • తీపి పదార్థ సేవన

ABOUT THE AUTHOR

...view details