Obstructive Sleep Apnea:డిస్కో కింగ్ బప్పీ లహిరి ఫిబ్రవరి 15న తుదిశ్వాసవిడిచారు. దీంతో భారత చిత్రసీమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రముఖ సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు. అయితే.. బప్పి లహిరి మరణానికి కారణం 'అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా' అని వైద్యులు ధ్రువీకరించారు. అసలేంటీ సమస్య? లక్షణాలేంటి?
స్లీప్ అప్నియా అంటే?
స్లీప్ అప్నియా అనేది నిద్ర రుగ్మత. పడుకొని ఉన్నప్పుడే శ్వాస ప్రక్రియకు అంతరాయం కలిగి.. నిద్రలోనే మరణం సంభవించొచ్చు. ఈ సమస్యతో బాధపడేవారికి గురక కూడా వస్తుంది. దీనిని అరికట్టాలంటే బాధితుడి బరువును నియంత్రించాలి. బీఎంఐ కూడా మెరుగైన స్థితిలో ఉండాలి.
దీని గురించి హైదరాబాద్ వీఐఎన్‌ఎన్ హాస్పిటల్ వైద్య నిపుణులు డా. రాజేశ్ వుక్కలను సంప్రదించగా.. ఆయన పలు విషయాలు వెల్లడించారు.
''మనం శ్వాస తీసుకొని, వదిలేటప్పుడు.. ఆక్సిజన్, కార్బడ్ డయాక్సైడ్ స్థాయులు సరిపోలాలి. కానీ.. అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా ఉంటే ఇవి సరిపోలవు.''
- డా. రాజేశ్ వుక్కల, వైద్య నిపుణులు, వీఐఎన్‌ఎన్ హాస్పిటల్
Obstructive Sleep Apnea symptoms:
వ్యాధి లక్షణాలేంటి?
- బిగ్గరగా గురక
- అసలు విశ్రాంతి తీసుకోనట్లు కనిపిస్తారు. అలసిపోయినట్లుగానే నిద్ర లేస్తారు.
- తేలికపాటి తలనొప్పి
- ఏకాగ్రత ఉండకపోవడం
- దీర్ఘకాలిక అలసట
- రోజువారీ పనులు కూడా చేసుకోలేకపోవడం
- ఉక్కిరిబిక్కిరి అవడం, ఆకస్మికంగా మెలకువ రావడం.
- ఒత్తిడికి లోనవడం.
ఇలాంటి బాధితులు.. మధుమేహం, రక్తపోటు, కీళ్లవ్యాధులు, థైరాయిడ్ సంబంధిత వ్యాధుల బారినపడే అవకాశం కూడా ఉందని డా. రాజేశ్ తెలిపారు.
''శరీరంలో ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ అసమతుల్యత కారణంగా.. కీలక అవయవాలైన గుండె, మెదడు, ఊపిరితిత్తులపైనా ప్రభావం పడుతుంది.''
- డా. రాజేశ్ వుక్కల
Obstructive Sleep Apnea reasons:
వ్యాధికి కారణాలు..
- ఊబకాయం(అధిక బరువు)
- పొడవైన మెడ(17 అంగుళాలకంటే ఎక్కువగా) ఉండటం.
- బీఎంఐ 25 కంటే ఎక్కువగా ఉండటం.
- అలెర్జీ
- సైనసైటిస్
- ఆస్తమా
Obstructive Sleep ApneaDiagnosis:
వ్యాధి నిర్ధరణ ఎలా?
స్లీప్ అప్నియా వ్యాధిని.. పాలీసోమ్నోగ్రఫీ ద్వారా నిర్ధరించవచ్చు. ఒక యంత్రం ఉంటుంది. దీని సాయంతో బాధితుడి నిద్రను నిశితంగా పరిశీలించాలి. ఆ వ్యక్తి నిద్రలో ఉన్నప్పుడు కొన్ని పారామితులను గమనించాల్సి ఉంటుంది.
అవేంటంటే?
- వ్యక్తి శ్వాస ఎలా తీసుకుంటున్నారు?
- ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ స్థాయులు ఎలా ఉన్నాయి?
- గుండె ఎలా కొట్టుకుంటుంది?
- బీపీ నియంత్రణలో ఉందా?
వీటిని పరిగణనలోకి తీసుకొని.. ఆ వ్యక్తి స్లీప్ అప్నియాతో బాధపడుతున్నాడో లేదో చెప్పొచ్చు. అప్నియా ఇండెక్స్‌తో.. బాధితుడు ఎన్ని సార్లు శ్వాస తీసుకోవడం ఆపేస్తున్నాడో గుర్తించవచ్చు. దీని ప్రకారం.. అప్నియా ఇండెక్స్‌లో రీడింగ్ 6.5 లోపు ఉంటే సాధారణంగా ఉన్నట్లు లెక్క. 6.5 దాటితే.. స్లీప్ అప్నియా లక్షణాలు ఉన్నట్లే.
ఎలా అదుపు చేయొచ్చు..?
- వ్యాధికి కారణాలు తెలుసుకొని, వాటిని నియంత్రించే దిశగా ప్రయత్నించాలి.
- బీఎంఐ అధికంగా ఉంటే.. బరువు తగ్గించుకోవాలి.
- ఇవన్నీ నియంత్రణలోకి వస్తే.. స్లీప్ అప్నియా నుంచి బయటపడొచ్చు.
- బాధితుడు వృద్ధుడు అయినట్లయితే.. దీని నుంచి బయటపడేందుకు శస్త్రచికిత్స మార్గాన్ని ఎంచుకోవడం ఉత్తమం.
జీవనశైలిలో మార్పులు చేసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుందని డా. రాజేశ్ చెబుతున్నారు. బరువును అదుపులో ఉంచుకోవడం, ప్రాణాయామం వంటి యోగాసనాలు వేయడం, ఏరోబిక్స్ చేయడం, నడక, నిద్ర పొజిషన్స్ మార్చుకోవడం, మంచి వెంటిలేషన్ ఉండేలా చేసుకోవడం వంటివి అలవాటు చేసుకుంటే మంచిదని వివరించారు.
ఇవీ చూడండి:కలయికను ఆస్వాదించలేకపోతున్నారా.. కారణం ఇదే కావచ్చు?
చర్మం పొడిబారిపోతుందా? ఈ చిట్కా ట్రై చేయండి..
'రోజూ మందు తాగే అలవాటు ఉందా? సంతానోత్పత్తి కష్టమే!'