తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

సర్కారు ఆసుపత్రుల్లో పెరుగుతున్న సాధారణ ప్రసవాలు

సర్కారు దవాఖానాల్లో సాధారణ ప్రసవాలను పెంచడానికి రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ చేసిన ప్రయోగం సత్ఫలితాలిస్తోంది. సాధారణ ప్రసవాలు జరగాల్సిన సందర్భాల్లోనూ ‘కోతల’ పర్వం కొనసాగుతుండంతో దానికి స్వస్తి చెప్పాలని నిర్దేశించుకుంది. రాష్ట్రంలోని ఏయే ప్రభుత్వాస్పత్రుల్లో ఎక్కువగా కోతల ద్వారా ప్రసవాలు జరుగుతున్నాయో ముందుగా గుర్తించింది. వాటిలో మిడ్‌వైఫ్‌ (మంత్రసాని) విధానాన్ని అమలు చేస్తూ... వీలైనంత వరకు కోతల పర్వాన్ని తగ్గించేందుకు కృషి చేస్తున్నారు.

By

Published : Feb 28, 2021, 8:25 AM IST

normal deliveries increasing in telangana
normal deliveries increasing in telangana

రాష్ట్రంలో ప్రధానంగా మహబూబాబాద్‌, సిరిసిల్ల, గోదావరిఖని, పెద్దపల్లి, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, భద్రాచలం, గజ్వేల్‌, కోస్గి దవాఖానాల్లో శస్త్ర చికిత్స ద్వారా ప్రసవాలు ఎక్కువగా జరుగుతున్నాయని సర్కారు గుర్తించింది. ఆయా ఆస్పత్రుల్లో మిడ్‌వైఫ్‌ (మంత్రసాని) విధానాన్ని గత సెప్టెంబరు నుంచి అమలు చేస్తున్నారు. ఒక్కో ఆసుపత్రిలో నలుగురు స్టాఫ్‌ నర్సులకు మిడ్‌వైవ్స్‌గా బాధ్యతలు ఇచ్చారు. అనంతరం తొలికాన్పులో సాధారణ ప్రసవాలు పెరుగుతున్నట్లు స్టాఫ్ ‌నర్సులు చెబుతున్నారు. చాలా ఆసుపత్రుల్లో 80 శాతం పైగా ఉన్న కోతల ప్రసవాలను 33 శాతానికి తగ్గించారు. ఈ విధానంతో రానున్న రోజుల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాల సంఖ్య పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

సంవత్సరం పాటు ప్రత్యేక శిక్షణ..

రాష్ట్రంలో వివిధ ఆసుపత్రుల్లోని స్టాఫ్‌నర్సులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు 2017లో రాష్ట్ర వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ 30 మందిని ఎంపిక చేసింది. వారికి ఎన్‌ఆర్‌హెచ్‌ఎం ద్వారా యునిసెఫ్‌ సమన్వయంతో ఫెర్నాండెజ్‌ ఆసుపత్రి నుంచి లండన్‌కు చెందిన ఇద్దరు మిడ్‌వైవ్స్‌ నిపుణులు ఏడాది పాటు కరీంనగర్‌లో శిక్షణ ఇచ్చారు. ఆరు నెలల పాటు సంగారెడ్డిలో వృత్యంతర శిక్షణ ఇచ్చారు.అనంతరం రాష్ట్రంలో ఎక్కువగా కోతల ద్వారా ప్రసవాలు జరుగుతున్నట్లు గుర్తించిన ఆసుపత్రులకు వీరిని పంపించారు. సుశిక్షితులైన వీరు తాము పనిచేస్తున్న ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని ఇతర స్టాఫ్‌నర్సులకు కూడా శిక్షణ ఇస్తున్నారు.

2020 సెప్టెంబరు 1 నుంచి రాష్ట్రంలోని భద్రాచలం, మహబూబాబాద్‌, గోదావరిఖని, సిరిసిల్ల, పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్‌, గజ్వేల్‌, కోస్గిలలోని ప్రభుత్వాస్పత్రుల్లో శిక్షణ పొందిన వారిని నలుగురు చొప్పున మిడ్‌వైవ్స్‌ను నియమించారు. వీరు విధుల్లోకి చేరిన 5 నెలల్లోనే మంచి ఫలితాలు వచ్చాయి. గతేడాది సెప్టెంబరు నుంచి 2021 జనవరి వరకు భద్రాచలం ఆసుపత్రిలో 1,518 ప్రసవాలు జరిగితే అందులో మొదటి, రెండో కాన్పులో సాధారణ ప్రసవమైనవి 734 ఉన్నాయి. జనవరిలో ఈ ఆసుపత్రిని రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ వాకాటి కరుణ సందర్శించి సాధారణ ప్రసవాలు పెరగడంతో మిడ్‌వైవ్స్‌ సిబ్బందిని అభినందించారు. మహబూబాబాద్‌లో 297, గోదావరిఖనిలో 322, పెద్దపల్లిలో 175, ఆసిఫాబాద్‌లో 863 సాధారణ ప్రసవాలు అయ్యాయి. పెద్దపల్లిలో కేవలం సాధారణ ప్రసవాలే ఉండగా.. కోతల ప్రసవానికి ఇక్కడి వారు సాధారణంగా కరీంనగర్‌, గోదావరిఖనికి వెళుతుంటారు.

ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ..

గర్భం దాల్చిన రెండో నెల నుంచే ఆసుపత్రికి వైద్యపరీక్షలకు వచ్చిన మహిళకు మిడ్‌వైవ్స్‌ ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్నారు. సాధారణ, కోతల ద్వారా ప్రసవాలకు భవిష్యత్తులో జరిగే లాభనష్టాలను వివరిస్తున్నారు. గర్భం దాల్చిన వారాలను బట్టి 5-6 రకాల వ్యాయామాలు చేయిస్తున్నారు. ఆహారం, మందులపై అవగాహన కల్పిస్తున్నారు. ఎక్కువ ప్రమాదం (హైరిస్క్‌) కేసులుంటే వారికి వైద్యుడి సలహాతో అవగాహన కల్పిస్తున్నారు.

అప్పుడు భయపడేవాళ్లం..

స్టాఫ్‌నర్సుగా నేను 20 ఏళ్లుగా పనిచేస్తున్నా. మొదట్లో సాధారణ ప్రసవం చేసే సమయంలో పూర్తిస్థాయిలో అనుభవం లేకపోవడంతో కాస్త భయపడ్డాం. ఇప్పుడు ప్రత్యేక శిక్షణ తరువాత ధైర్యంగా ప్రసవం చేస్తున్నాం. - మాధురి, స్టాఫ్‌నర్సు (మిడ్‌వైఫ్‌), మహబూబాబాద్‌

సాధారణ ప్రసవానికి ఎదురుచూపులు..

సెప్టెంబరుకు ముందు భద్రాచలం ఆసుపత్రిలో కోతల ప్రసవాలే ఎక్కువగా అయ్యేవి. మిడ్‌వైఫ్‌గా నాతో మరో ముగ్గురు స్టాఫ్‌నర్సులు విధుల్లో చేరినప్పటి నుంచి సాధారణ ప్రసవాలు పెరిగాయి. మిడ్‌వైవ్స్‌ సేవలు బాగుండటంతో చాలా మంది సాధారణ ప్రసవానికి ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలోని కొన్ని ఆసుపత్రుల్లో సిబ్బందికి మేము నేర్చుకున్న అంశాలపై శిక్షణ ఇస్తున్నాం. - విజయశ్రీ, స్టాఫ్‌నర్సు (మిడ్‌వైఫ్‌), భద్రాచలం

ఇదీ చూడండి:పెద్దగట్టు జాతర సందడికి వేళైంది..

ABOUT THE AUTHOR

...view details