Children Sleep Hours : చిన్నారులకు మంచి పోషకాహారం ఇవ్వటమే కాదు, కంటి నిండా నిద్ర పోయేలా చూసుకోవటమూ ముఖ్యమే. 6-12 ఏళ్ల పిల్లలు రోజుకు కనీసం 9 గంటల సేపు నిద్ర పోవాలన్నది నిపుణుల సూచన. కానీ చాలామందికిది కలగానే మిగిలిపోతోంది. ఇలా తక్కువసేపు నిద్రపోతే ఇబ్బందులు తప్పవని యూనివర్సిటీ ఆఫ్ మేరీలాండ్ అధ్యయనం హెచ్చరిస్తోంది. రోజుకు కనీసం 9 గంటల సేపు నిద్రించే పిల్లలను (9-10 ఏళ్ల వయసువారు), అలాగే తక్కువసేపు నిద్రపోయే పిల్లలను ఎంచుకొని పరిశోధకులు పరిశీలించారు. తక్కువగా నిద్రపోయే పిల్లలు ఒత్తిడి, ఆందోళన, కుంగుబాటు, ఉద్రిక్త ప్రవర్తన వంటి మానసిక, ప్రవర్తన సమస్యలను మరింత ఎక్కువగా ఎదుర్కొంటున్నట్టు గుర్తించారు.
6-12 ఏళ్ల పిల్లలు రోజుకు ఎన్ని గంటలు నిద్రపోవాలో తెలుసా? - sleep time information for kids
6-12 ఏళ్ల పిల్లలు రోజుకు కనీసం తొమ్మిది గంటల సేపు నిద్ర పోవాలని నిపుణులు చెబుతున్నారు. తక్కువ సేపు నిద్రపోతే అనేక ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఒత్తిడి, ఆందోళన, కుంగుబాటు వంటి సమస్యలను ఎదుర్కొనే అవకాశమున్నట్లు తెలిపారు.
వీళ్లు నిర్ణయాలు తీసుకోవటంలో, సవాళ్లను ఎదుర్కోవటంలో, విషయాలను నేర్చుకోవటంలో ఇబ్బంది పడుతున్నట్టు కనుగొన్నారు. ఈ పిల్లల మెదడులో మార్పులూ తలెత్తుతుండటం గమనార్హం. అధ్యయనం ఆరంభించినప్పుడు, అలాగే రెండేళ్ల తర్వాత తీసిన మెదడు స్కాన్ చిత్రాలను పోల్చిచూడగా వీరి మెదడు ఆకృతిలో మార్పులు బయటపడ్డాయి. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, అడ్డంకులను అధిగమించటం వంటి పనులకు కారణమయ్యే మెదడు భాగం పరిమాణం తక్కువగా ఉంటోందని పరిశోధకులు చెబుతున్నారు.
ఇది విషయాలను నేర్చుకునే సామర్థ్యం, భావోద్వేగాల నియంత్రణ మీద ప్రభావం చూపుతున్నట్టు కనిపిస్తోందని అనుకుంటున్నారు. మెదడులో వచ్చిన మార్పులు తిరిగి కుదురుకుంటాయా అనేది తెలుసుకోవటానికి మరిన్ని అధ్యయనాలు చేయాల్సి ఉందని భావిస్తున్నారు. ఒకవేళ మార్పులు కుదురుకోకపోతే జీవితాంతం వీటి పరిణామాలు వెంటాడుతూ వస్తాయనే అనుకోవచ్చు. కాబట్టి పిల్లల నిద్ర విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవటం తప్పనిసరి.