Negative Impacts Of Poor Sleep : ప్రస్తుత బిజీ లైఫ్ షెడ్యూల్స్ వల్ల.. చాలా మంది కంటి నిండా నిద్రకు దూరం అవుతున్నారు. ఉన్న కాస్త టైమ్‌లో కూడా గంటలు గంటలు సెల్‌ఫోన్ పట్టుకొని జాగారం చేస్తున్నారు. ఫలితంగా.. తక్కువ సమయం నిద్రపోతున్నారు. దీనివల్ల చాలా అనారోగ్య సమస్యలు వెంటాడుతాయని నిపుణులు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నారు. అయితే, ఆరోగ్యం పాడవడమే కాకుండా.. అందం కూడా దెబ్బతింటుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో.. అసలు రోజులో కనీసం ఎన్ని గంటలు నిద్రపోవాలి? కంటి నిండా నిద్ర లేకపోతే సౌందర్యం ఎలా కరిగిపోతుంది? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని కొనసాగించాలంటే రోజూ కనీసం 7 నుంచి 8 గంటల వరకు నిద్ర అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. కానీ, చాలా మంది ఈ రోజుల్లో పని ఒత్తిడి, అనారోగ్య సమస్యలు, ఫోన్ల కారణంగా.. ఎంతో విలువైన నిద్రకు దూరం అవుతున్నారు. దీనివల్ల శరీరంలో అనేక అనారోగ్యకర మార్పులు జరుగుతాయని నిపుణులంటున్నారు. అది ముఖంపై కూడా ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు. ప్రధానంగా.. 5 చర్మ సంబంధిత సమస్యలు కనిపిస్తాయని చెబుతున్నారు.
చర్మం డల్‌గా కనిపిస్తుంది..
శరీరానికి తగినంత నిద్ర లేకపోతే చర్మం పొడిబారినట్లు ఉంటుందని నిపుణులంటున్నారు. అలాగే శరీరంలో పీహెచ్ స్థాయి దెబ్బతిని చర్మం నిస్తేజంగా కనిపిస్తుందట. దీనివల్ల తక్కువ వయస్సు ఉన్న కూడా ఎక్కువ వయస్సున్న వారిలా కనిపిస్తారట. ఎక్కువ కాలం పాటు నిద్రకు దూరమైతే ముఖంపై మొటిమలు వస్తాయి. ఇది దీర్ఘకాలికంగా కొనసాగితే చర్మంపై ముడతలు వస్తాయి.
నిద్ర రావట్లేదా? - అల్లం, అశ్వగంధతో డీప్ స్లీప్!
డార్క్ సర్కిల్స్..
నేటి కాలంలో ఎక్కువ మందిని వేధిస్తున్న సమస్యల్లో డార్క్ సర్కిల్స్ ఒకటి. కంటినిండా నిద్రలేకపోతే కళ్ల కింద డార్క్ సర్కిల్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనం నిద్రపోతున్నప్పుడు శరీరంలో దెబ్బతిన్న కణాలు అన్నీ పునరుత్పత్తి అవుతుంటాయి. అలాంటిది.. నిద్ర దూరమైతే.. అది కళ్ల కింద డార్క్ సర్కిల్స్ వచ్చేలా ప్రభావం చూపుతుందని అంటున్నారు.