తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

వాల్​స్ట్రీట్​లో ఉద్యోగం వదిలేసి.. పేదల జీవితాల్లో వెలుగు నింపింది - గేట్స్​ ఫౌండేషన్​ ద్వారా పేద మహిళలకు ఉపాధి కల్పిస్తున్న నీరు నుండా

హార్వర్డ్‌లో ఎంబీఏ... న్యూయార్క్‌ వాల్‌స్ట్రీట్‌లో ఉద్యోగం... తన చిన్ననాటి కలల్ని త్వరగానే నిజం చేసుకున్నారు నీరా నుండి. కానీ పాతికేళ్లు వచ్చేసరికి ఆమెకు అవేవీ సంతృప్తినివ్వలేదు. వాల్‌స్ట్రీట్‌ వదిలి భారత్‌ వచ్చి ఓ స్వచ్ఛంద సంస్థ పెట్టారు. దాని ద్వారా లక్షల మంది జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు.

neeru nunda helping poor people through gates foundation
వాల్​స్ట్రీట్​లో ఉద్యోగం వదిలేసి.. పేదల జీవితాల్లో వెలుగు నింపింది

By

Published : Aug 22, 2020, 7:41 PM IST

నీరా నుండా.. ఆమె తల్లిదండ్రులు కెనడాలో స్థిరపడ్డ భారతీయ ఇంజినీర్లు. అక్కడే గ్రాడ్యుయేషన్‌ వరకూ చదువుకున్న నీరా... హార్వర్డ్‌లో ఎంబీఏ చేసి మోర్గాన్‌ స్టాన్లీలో ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్‌గా చేరారు. నీరా తల్లి ఆదివాసీల పిల్లల కోసం ఖరగ్‌పుర్‌ సమీపంలో ఒక గురుకులాన్ని నెలకొల్పారు. అక్కడ వందల మంది పిల్లలు చదువుకునేవారు. వారి జీవితాల్లో మార్పు తేవడానికి నీరా తల్లి ఎంతో కృషిచేసేవారు. కానీ వారికి నిధుల కొరత ఉండేది. ఎంబీఏలో భాగంగా భారత్‌లో మహిళాభివృద్ధికి కృషిచేస్తున్న ఓ స్వచ్ఛంద సంస్థలో ఇంటర్న్‌షిప్‌ చేశారు నీరా. మారుమూల పల్లెల్లోనూ సిబ్బంది కష్టపడి పనిచేస్తున్నా విరాళాలు తెచ్చుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కోవడం చూశారామె. అప్పుడే తన బ్యాంకింగ్‌, మేనేజ్‌మెంట్‌ నైపుణ్యాలను ఉపయోగించి స్వచ్ఛంద సంస్థలకు నిధులు తేవాలనుకున్నారు.

'ఇంటర్న్‌షిప్‌ తర్వాత అమెరికా వెళ్లా. నా చదువు కోసం తీసుకున్న రుణం తీర్చడానికి ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్‌గా పనిచేశా. రుణం చెల్లించడం పూర్తయ్యాక భారత్‌ తిరిగి రావాలనుకున్నా’ అని చెబుతారు నీరా. మోర్గాన్‌ స్టాన్లీలో పనిచేస్తున్నపుడు నీరాకు కాబోయే భర్త దేవల్‌ సంఘ్వీతో పరిచయమైంది. ప్రవాస భారతీయుడైన దేవల్‌ భారత్‌లో ఒక ఎన్జీఓలో ఇంటర్న్‌షిప్‌ చేశారు. ఇద్దరి ఆలోచనలూ కలిశాయి. భారత్‌లో ఎన్జీవో ప్రారంభించి దాని ద్వారా మహిళలూ, పిల్లలూ, నిరుపేదలకోసం పనిచేసే ఎన్జీఓలూ, లాభాపేక్షలేని సంస్థలకు నిధులు అందించాలనుకున్నారు. ఈ అంశంపైన ‘పవర్‌పాయింట్‌ ప్రెజెంటేషన్‌’ను సిద్ధం చేసి ఆఫీసులో మిత్రులకి చూపించారు. వారినుంచి కేవలం రూ.40వేలు విరాళాలుగా వచ్చాయి. అదే సమయంలో మోర్గాన్‌ స్టాన్లీ ఛైర్మన్‌గా ఉన్న రిచర్డ్‌ బి ఫిషర్‌ను కలిశారు. ‘దాతృత్వ కార్యక్రమాలకు విరాళాలు ఇవ్వాలనుకుంటున్నా. అది మీతోనే మొదలుపెడతా'... అని చెప్పి అప్పటికప్పుడే కోటి రూపాయల చెక్‌ ఇచ్చారు. తర్వాత అయిదేళ్లపాటు ఏటా రూ.35 లక్షలు చొప్పున ఇస్తామనీ మాటిచ్చారాయన. ఫిషర్‌ ఇచ్చిన భరోసాతో ఇండియా వచ్చి 1999లో ‘దసరా’ పేరుతో ఓ సంస్థను మొదలుపెట్టారు నీరా, దేవల్‌. ప్రారంభంలో విద్య, ఉపాధి కల్పనలో కృషిచేస్తున్న మ్యాజిక్‌బస్‌, విల్‌గ్రో సంస్థలకు నిధులు ఇచ్చారు.

గేట్స్‌ ఫౌండేషన్‌ నుంచి...

దాతల్ని విరాళాల కోసం ఒప్పించడం అంత సులభం కాదంటారు నీరా. 2002లో ఫిషర్‌ చనిపోవడంతో నిధులు మధ్యలోనే ఆగిపోయాయి. మరో దాత మిలియన్‌ డాలర్లు ఇస్తానని మాటిచ్చాడు. కానీ డాట్‌కామ్‌ బుడగ పేలిపోవడంతో ఆయన చేతులెత్తేశాడు. ఈ అనుభవాలతో చాలా పాఠాలు నేర్చుకున్నారు. కార్పొరేట్‌ ఫౌండేషన్లు, దాతల్ని కలిసి వారి విరాళాల్ని వ్యూహాత్మకంగా ఇవ్వాలని చెప్పేవారు. ఇప్పటికే పనిచేస్తున్న ఎన్జీఓలకు ఆసరా ఇస్తే వారి కార్యక్రమాలు విస్తరిస్తాయనీ తద్వారా విస్తృతస్థాయిలో సమస్యల్ని పరిష్కరించవచ్చనీ వివరించేవారు.

కొందరు ఏడాది, రెండేళ్లు ఆలోచించి స్పందించేవారు. అనేక కార్పొరేట్‌ సంస్థలతోపాటు హార్వర్డ్‌, స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీలూ, యూఎస్‌ఎయిడ్‌, గేట్స్‌ ఫౌండేషన్‌ల నుంచి ప్రస్తుతం నిధులు సమీకరిస్తున్నారు నీరా. ‘దసరా గివింగ్‌ సర్కిల్‌’ పేరుతో దాతల్ని ఒక వేదికమీదకు తీసుకొస్తున్నారు. గత రెండు దశాబ్దాల్లో 800 లాభాపేక్షలేని సంస్థలకు ఆర్థిక చేయూతనిచ్చారు. ప్రస్తుతం లెండ్‌ ఎ హ్యాండ్‌, స్నేహ, ఎడ్యుకేట్‌ గర్ల్స్‌, సారథి, ఆంగన్‌.. లాంటి వందకుపైగా ఎన్జీఓలతో పనిచేస్తున్నారు. ఇప్పటివరకూ దసరా ద్వారా రూ.500 కోట్లు సేకరించి స్వచ్ఛంద సంస్థలకు అందించారు. దసరాతో సాధ్యమైనంత ఎక్కువమంది జీవితాల్లో వెలుగులు నింపాలనేదే తమ లక్ష్యమని చెబుతారు నీరా.

ఇదీ చూడండి:'యుద్ధప్రాతిపదికన దెబ్బతిన్న రోడ్లను పునరుద్ధరించండి'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details