తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

మైగ్రెయిన్‌తో బాధపడుతున్నారా? అయితే ఈ చిట్కాలు మీకోసమే! - Telangana News Updates

మైగ్రెయిన్.. దీని గురించి తెలియని వాళ్లు చాలా తక్కువమందే అని చెప్పుకోవాలి. లైట్, సౌండ్ సెన్సిటివిటీ వల్ల ఇది ఎక్కువగా వస్తుంటుంది. తలనొప్పితో పాటు వికారం, నీరసాన్ని కూడా మోసుకొచ్చే ఈ ఆరోగ్య సమస్య వల్ల ప్రపంచవ్యాప్తంగా చాలామంది తమ తమ పనుల పట్ల శ్రద్ధ పెట్టలేక ఇంటికే పరిమితమవుతున్నారని అధ్యయనాల్లో వెల్లడైంది. కొన్ని ఆహార పదార్థాలను మన రోజువారీ మెనూలో చేర్చుకోవడంతో పాటు మరికొన్ని సులభమైన చిట్కాల్ని పాటించడం వల్ల మైగ్రెయిన్ నుంచి కాస్త ఉపశమనం పొందచ్చు. మరి, మీరూ మైగ్రెయిన్‌తో బాధపడుతున్నారా? అయితే ఆ చిట్కాలేంటో చూసేయండి.

మైగ్రెయిన్‌తో బాధపడుతున్నారా? అయితే ఈ చిట్కాలు మీకోసమే!
మైగ్రెయిన్‌తో బాధపడుతున్నారా? అయితే ఈ చిట్కాలు మీకోసమే!

By

Published : Feb 25, 2021, 2:54 PM IST

  • నొప్పి ఏదైనా సత్వర ఉపశమనం కోసం చాలామంది ఆశ్రయించే చిట్కా ఐస్ ప్యాక్స్. ఇది మైగ్రెయిన్‌ విషయంలోనూ ఉపయోగపడుతుంది. ఐస్‌ప్యాక్‌ని నుదురుపై ఉంచి కాసేపు అద్దుతుండాలి. తద్వారా నొప్పి నుంచి కాస్త రిలీఫ్‌గా ఉంటుంది. ఒకవేళ ఐస్‌ప్యాక్ అందుబాటులో లేకపోయినా ఫ్రోజెన్ జెల్ రాయడం లేదంటే చల్లటి నీళ్లలో ముంచిన క్లాత్‌తో నొప్పి ఉన్న చోట అద్దడం వంటివి చేసినా చక్కటి ఫలితం ఉంటుంది.
  • కాఫీ, టీలలో ఉండే కెఫీన్‌కి కూడా మైగ్రెయిన్‌ను తగ్గించే శక్తి ఉంది. కాబట్టి ఈ సమయంలో కాఫీ లేదా టీ తాగడం వల్ల కాస్త ఉపశమనం ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. అయితే త్వరగా తగ్గాలని వీటిని ఎక్కువ మొత్తంలో తీసుకుంటే నొప్పి తగ్గడమేమో గానీ మరింత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఒకటి లేదా రెండు కప్పులకు మించి తాగకూడదు.
  • లైట్, సౌండ్ సెన్సిటివిటీ వల్ల మైగ్రెయిన్ వచ్చే అవకాశం ఎక్కువ అంటున్నారు వైద్యులు. అందుకే వీటికి దూరంగా డిమ్ లైటింగ్, ప్రశాంతమైన వాతావరణం ఉన్న గదిలో విశ్రాంతి తీసుకోవడం మంచిదని వారు సూచిస్తున్నారు. తద్వారా సమస్య నుంచి త్వరగా విముక్తి కలిగే అవకాశం ఉందంటున్నారు.
  • మైగ్రెయిన్ తరచూ రావడానికి ఒత్తిడి కూడా ఓ కారణమే. మరి, దీన్నుంచి విముక్తి పొందాలంటే రోజువారీ వ్యాయామాలు తప్పనిసరి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల పదే పదే మైగ్రెయిన్ బారిన పడకుండా జాగ్రత్తపడచ్చు. అంతేకాదు.. వ్యాయామం మనలోని ఒత్తిళ్లను తగ్గించి హాయిగా నిద్రపట్టేందుకు కూడా దోహదం చేస్తుంది.
  • నిద్రలేమి మనలో ఒత్తిళ్లకు దారితీస్తుంది. తద్వారా మైగ్రెయిన్ బారిన పడే అవకాశముంది. కాబట్టి రాత్రుళ్లు ఎనిమిది గంటలు ప్రశాంతమైన నిద్రకు కేటాయించడం తప్పనిసరి.
  • హెడ్ మసాజ్ వల్ల రిలాక్సేషనే కాదు.. పదే పదే మైగ్రెయిన్ బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు.
  • హాట్ షవర్ చేస్తూ లేదా వేడి నీళ్లతో తలస్నానం చేస్తూ.. మెడ కింది భాగంలో ఐస్ ప్యాక్ అప్త్లె చేసుకోవడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది. వేడి నీళ్లు, ఐస్‌ప్యాక్ చల్లదనం ఒకేసారి శరీరంపై పడడం వల్ల మైగ్రెయిన్ నొప్పి నుంచి ఉపశమనం పొందచ్చు.
  • క్రమం తప్పకుండా యోగా చేయడం వల్ల పదే పదే వచ్చే మైగ్రెయిన్ నొప్పికి చెక్ పెట్టచ్చు. అలాగే మానసిక ప్రశాంతత కూడా చేకూరుతుంది.
  • పచ్చటి ప్రకృతి మధ్య కాసేపు అటూ ఇటూ నడవడం వల్ల కూడా మైగ్రెయిన్‌ నొప్పి నుంచి ఉపశమనం పొందచ్చు.
  • ఆక్యుప్రెజర్ థెరపీ కూడా మైగ్రెయిన్ నొప్పిని తగ్గించడంలో దోహదం చేస్తుంది. ఈ క్రమంలో నొప్పి ఉన్న చోట బొటన వేళ్లతో నెమ్మదిగా నొక్కడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది.


ఈ ఆహారంతో చెక్!

  • మెగ్నీషియంలో మైగ్రెయిన్‌ నొప్పిని తగ్గించే గుణాలుంటాయి. అందుకే ఇది అధికంగా లభించే ఆకుకూరలు, ఆకుపచ్చ కూరగాయలు, నట్స్, తృణధాన్యాలు, డార్క్ చాక్లెట్ ఎక్కువగా ఆహారంలో భాగం చేసుకోవాలి.
  • చేపలు, ఛీజ్, పాల పదార్థాలు, చికెన్.. వంటి వాటిలో విటమిన్ బి2 ఎక్కువగా ఉంటుంది. ఇది మైగ్రెయిన్ నుంచి ఉపశమనం కలిగించడంలో దోహదం చేస్తుంది.
  • నరాలను శాంతపరిచి రక్తప్రసరణను మెరుగుపరచడంలో పుదీనాకు సాటి వేరే ఏదీ లేదంటే అతిశయోక్తి కాదు. కాబట్టి రోజూ పుదీనా టీ తాగడం వల్ల ఇటు మైగ్రెయిన్ బారిన పడకుండా ఉండడంతో పాటు అటు ఆరోగ్యాన్నీ పెంపొందించుకోవచ్చు.
  • చెర్రీ పండ్లలో క్వెర్సెటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. దీంతో పాటు ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు మైగ్రెయిన్ నొప్పులకు వ్యతిరేకంగా పోరాడతాయి.
  • చేపల్లోని ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు మైగ్రెయిన్ నొప్పిని తగ్గించడంలో సహకరిస్తాయి. అందుకే వీటిని క్రమం తప్పకుండా ఆహారంలో భాగం చేసుకోమని చెబుతున్నారు నిపుణులు.
  • క్వినోవాలో ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు సమానంగా ఉంటాయి. ఇవి జీర్ణకోశం పనితీరును మెరుగుపరచడంతో పాటు మైగ్రెయిన్ బారిన పడకుండా కాపాడతాయి.
  • నీళ్లు సరిగ్గా తాగకపోవడం వల్ల డీహైడ్రేషన్ బారిన పడే అవకాశముందన్న సంగతి తెలిసిందే. అంతేకాదు.. దీనివల్ల మైగ్రెయిన్ బారిన పడే అవకాశం ఉందంటున్నారు వైద్యులు. అందుకే రోజుకు కనీసం రెండు నుంచి మూడు లీటర్ల నీరు తాగడం తప్పనిసరి అని చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details