ఆహారాన్ని మితంగా తీసుకుంటే ఔషధం, అడ్డూ అదుపు లేకుండా తీసుకుంటే విషం అంటారు. ఆకలేసినప్పుడు ఎవరైనా తింటారు. కానీ, కొందరు ఎలాంటి భావోద్వేగాలొచ్చినా ఆహారంతోనే దిగమింగుతారు. కాస్త బోర్ కొట్టినట్టు అనిపించినా నోరాడిస్తూ టైంపాస్ చేస్తారు. అవును, భావోద్వేగానికి లోనైనప్పుడు.. రక్తంలో విడుదలయ్యే కోర్టిసాల్ హార్మోన్ వల్ల ఆకలి పెరుగుతుంది. పైగా స్వీట్ల వంటి రుచికరమైన ఆహారం తినాలని కోరిక పుడుతుంది. అలాంటి వారికి చక్కటి పరిష్కారం చెబుతున్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ డా. దివ్యా గుప్తా.
మనం ఏం తింటామో అది సరాసరి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందంటున్నారు డాక్టర్ దివ్వా గుప్తా. లాక్డౌన్ వేళ.. సమయం, సందర్భం లేకుండా కలిగే 'భావోద్యేగ ఆకలి'ని జయించే చిట్కాలు ఈటీవీ భారత్‌తో పంచుకున్నారు.
ధ్యానాస్త్రం..
లాక్డౌన్ వేళ భావోద్వేగ ఆకలి వేస్తే.. దానిని జయించే అస్త్రంగా ఉపయోగపడుతుంది ధ్యానం. వీలైనంత ఎక్కువ గాలిని పీల్చి.. మెల్లగా వదలడం వల్ల మీపై మీకు నియంత్రణ వస్తుంది. శ్వాసపై ధ్యాస పెట్టడం వల్ల కాసేపటి వరకు ఆకలిని మర్చిపోతారు. అందుకే యోగాలో నయా ట్రెండ్‌ను ట్రై చేయండి!
ఆకలి మీ ఫీలింగేనా?
సాధారణంగా రోజుకు మూడు పూటలు తింటే శరీరానికి సరిపోతుంది. కానీ, మధ్యలో బోర్‌కొట్టినప్పుడు నోటికి ఆకలేస్తుంది. అందుకే, ఆకలి శరీరానికా, మీ భావోద్వేగానికా అనేది తేల్చుకుంటే సగం సమస్య పరిష్కారమవుతుంది. మూడు పూటలు తిన్నాక కూడా ఆకలిగా ఉంటే, మీరు మెచ్చే రుచులతోనే ఆరోగ్యకరమైన ఆహారంతయారు చేసుకోవాలి. దీంతో మితంగా తినడం అలవాటు అవుతుంది.