Most Common Reasons for Divorce : "పెళ్లి ఎంత సహజమో.. విడాకులు కూడా అంతే" అనే పరిస్థితి వచ్చేసింది సమాజంలో! పలు రకాల కారణాలను చూపిస్తూ.. "ఇక కలిసి ఉండడం సాధ్యం కాదు" అనే నిర్ణయానికి చాలా ఈజీగా వచ్చేస్తున్నారు! కష్ట సుఖాల్లో కడదాకా కలిసి ఉంటామంటూ పెళ్లినాడు చేసిన ప్రమాణాలకు నీళ్లొదిలి.. విడాకులు(Divorce)తీసుకుంటున్నారు. మరి, "విడాకులకు దారి తీసే పరిస్థితులు ఏంటి..?" అన్నప్పుడు ఒకటీ అరా జంటల్లో వేర్వేరు కారణాలు ఉన్నప్పటికీ.. చాలా మంది విషయంలో మాత్రం.. కామన్ పాయింట్సే ఎక్కువగా ఉంటున్నాయట. మరి, అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆర్థిక సమస్యలు :ప్రస్తుత కాలంలో.. విడాకులకు ఏదో రూపంలో డబ్బు ప్రధాన కారణం అవుతోందట. ఆర్థిక ఇబ్బందులతో కొన్ని బంధాలు తెగిపోతున్నాయి. మరికొన్ని జంటలు ఆర్థిక స్వేచ్ఛ పేరుతో.. ఒకరికొకరు జవాబుదారీతనం లేకుండా వ్యవహరించడం కూడా.. చినికి చినికి గాలివానలా మారుతోందని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి విభేదాలు.. వివాదాలుగా మారి.. చివరకు భార్యాభర్తల బంధాన్నే ముక్కలు చేసుకునే వరకు వెళ్తోందట.
మోసగించుకోవడం : విడాకులకు మరో పెద్ద కారణం.. భాగస్వామిని మోసం చేయడం. ఎదుటి వ్యక్తిపై ఆకర్షణతోనో.. భాగస్వామిపై కోపంతోనో.. వివాహేతర సంబంధాల వైపు మొగ్గు చూపుతున్న వారి సంఖ్య తక్కువేమీ లేదు! కానీ.. నిజం కలకాలం దాగదు కదా! ఏదో ఒకరోజు తప్పు బయటపడి తీరుతుంది. దాంతో.. హృదయం ముక్కలైన భాగస్వామి.. కలిసి ఉండలేక.. బంధానికి వీడ్కోలు పలుకుతున్నారట.
Husband Extramarital Affair : నా భర్తకు విడాకులివ్వమంటోంది.. నేనేం చేయాలి..?
ప్రేమ లేకపోవడం :భార్యాభర్తల మధ్య ప్రేమ లేకపోవడం కూడా విడాకులు తీసుకోవడానికి మరొక కారణం అవుతోందట. పెళ్లయిన తొలినాళ్లలో ఆకర్షణ కారణంగా.. దంపతులు పరస్పరం ప్రేమాభిమానాలను చూపించుకుంటున్నప్పటికీ.. దీర్ఘకాలంలో అది సన్నగిల్లుతోందట! కాలక్రమంలో పిల్లల ఎదుగుదల, కుటుంబ బరువులు, వ్యక్తిగత సమస్యల నేపథ్యంలో.. ఆకర్షణ వెలిసిపోతోందట. ఫలితంగా.. చాలా మంది భార్యాభర్తలు గొడవలు పడుతున్నారట. చిరాకులు, కోపాలు.. చివరకు ద్వేషంగా మారి.. విడిపోవడమే దీనికి పరిష్కారం అని ఫిక్స్ అయిపోతున్నారట.
అత్యాశ :ప్రతి ఒక్కరికీ వైవాహిక జీవితంపై అంచనాలు ఉంటాయి. ఉదాహరణకు.. ఒకరు తెలివైన, కష్టపడి పనిచేసే భాగస్వామిని కోరుకుంటారు. మరొకరు సరదాగా ఉంటూ.. ప్రేమించే శృంగార భాగస్వామిని కోరుకుంటారు. ఇంకొకరు డబ్బున్న భాగస్వామిని కావాలనుకుంటారు. కానీ.. పెళ్లైన తర్వాత పరిస్థితులు అనుకున్న విధంగా ఉండకపోవచ్చు. ఇలాంటప్పుడు వాస్తవాన్ని గుర్తించి.. సర్దుకుపోతే బంధం నిలబడుతుంది. కానీ.. ఈ పరిస్థితులను అంగీకరించలేని భాగస్వాములు నిరుత్సాహమైన జీవితాన్ని గడుపుతూ.. చివరకు విడాకుల వరకు వెళ్తున్నారట.