ఉదయం లేవగానే మనసు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది. ఉదయపు వాతావరణంలో ఎంతో జీవం ఉంటుందని నిపుణులు చెబుతారు. అయితే ఇది రోజు వాకింగ్ జాగింగ్ చేసేవారికి అనుభవం. అధిక బరువుతో బాధపడేవారు మాత్రం వాకింగ్ చేయడానికి కాస్త బద్దకించవచ్చు. మరి బరువు తగ్గాలంటే కచ్చితంగా వ్యాయామం చేయాల్సిందే. ఉదయం లేవగానే బరువు చెక్ చేసుకోవాలి. దాని బట్టి రోజులో ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎంత పరిమాణంలో తీసుకోవాలి, ఎలాంటి వ్యాయామాలు చేయాలి అనే వాటిని నిర్ణయించుకోవచ్చు.
అల్పాహారం
ఉదయం లేచి బ్రష్ చేశాక కచ్చితంగా గ్లాస్ లేదా రెండు గ్లాస్‌ల నీరు తాగాలి. నీటిలో ఎలాంటి కేలరీలు ఉండవు కాబట్టి శరీరానికి ఎలాంటి కేలరీలు అందవు. పైగా కడుపునిండిన భావన కలుగుతుంది. దీంతో కాస్త ఆకలి తగ్గుతుంది. ఫలితంగా ఉదయం ఎక్కువ అల్పాహారం తినాలని ఉండదు. టిఫిన్ ద్వారా శరీరానికి ఎక్కువ క్యాలరీలు అందే అవకాశం ఉండదు. అంతేకాకుండా నీరు ఎక్కువగా తాగడం వల్ల శరీరంలో మెటబాలిజం జరుగుతుంది. దీంతో పాటు నిద్ర కూడా చాలా అవసరమని నిపుణులు చెబుతున్నారు.
"మనం మంచిగా నిద్రపోయామా లేదా అనేది చాలా ముఖ్యం. ప్రతిరోజు 8గంటల నిద్ర అనేది చాలా అవసరం. దానివల్ల హర్మోనల్ బ్యాలెన్స్ అవుతుంది. ఎక్కువగా నిద్రపోయేవారే తొందరగా బరువు తగ్గడంలో విజయవంతం అవుతున్నారు. ఉదయం టిఫిన్‌లో అధిక ప్రొటీన్ ఉండే పాలు, గుడ్లు, కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. వ్యాయామం కూడా తప్పనిసరిగా చేయాలి. యోగా, మెడిటేషన్ చేయాలి. దీని వల్ల బ్రెయిన్ పనితీరు మెరుగుపడుతుంది. దానివల్ల ఎక్కువ ఫ్యాట్, కార్బోహైడ్రేట్స్ లేని ఫుడ్‌ను మనం తీసుకోగలుగుతాం. చాలా మంది తరచుగా బయట తింటుంటారు. అలా కాకుండా ఇంట్లో వండిన ఆహారాన్నే తీసుకోవాలి. అలాగే ఉదయాన్నే సగం లీటరు నీరు తీసుకుంటే ముప్పై శాతం వరకు బరువు తగ్గే అవకాశాలున్నాయి. ప్రతిరోజు 8వేల స్టెప్స్ అనేది చాలా ముఖ్యం. ప్రతిరోజూ యాక్టివిటీ ఉంటే కేలరీలు ఎక్కువగా బర్న్ అయ్యి బరువు తగ్గే అవకాశాలుంటాయి. తగిన మోతాదులో కేలరీలు తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఎక్కువ కేలరీలను ఉదయం పూట తీసుకోవచ్చు."
-డా.వుక్కల రాజేశ్, జనరల్ ఫిజీషియన్