Metabolism Boost Fruits Naturally :ప్రతి ఒక్కరూ రోజంతా ఫుల్ యాక్టివ్‌గా, ఎనర్జిటిక్‌గా ఉండాలని కోరుకుంటారు. అలా జరగాలంటే మన బాడీలో తగిన స్టామినా ఉండాలి. అప్పుడే మానసికంగా, శారీరకంగా హెల్తీగా ఉంటాం. ఇవన్నీ సాధ్యపడాలంటే ముందు మన జీవక్రియ సరిగ్గా పనిచేయాలి. అయితే ప్రస్తుత కాలంలో మారిన ఆహారపు అలవాట్లు, జీవనశైలి చాలా మందిలో జీవక్రియ(Metabolism)ను దెబ్బతీస్తూ.. అనారోగ్య సమస్యలను పెంచుతున్నాయి. ఇలా కాకుండా మీరు యాక్టివ్‌గా ఉండాలంటే మెటబాలిజమ్ రేటును పెంచుకోవాలి. అందుకోసం పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. నేచురల్‌గా లభించే పండ్లు తింటే సరిపోతుందని నిపుణులు అంటున్నారు. మరి అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
మెటబాలిజమ్ అంటే ఏమిటంటే..ఇది బాడీ సక్రమంగా పనిచేయడానికి అవిశ్రాంతంగా పనిచేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మనం తినే ఆహారాన్ని శక్తిగా మార్చే ప్రక్రియ. శ్వాస తీసుకోవడం దగ్గర నుంచి కను రెప్ప వేయడం వరకు అన్ని విధులకు ఇంధనం అందించేది మెటబాలిజమ్ ద్వారా వచ్చే ఎనర్జీ. అలాగే బాడీలో కేలరీలను బర్న్ చేయడానికీ ఇది బాధ్యత వహిస్తుంది. ఇవన్నీ సరిగ్గా జరగ్గాలంటే మన జీవక్రియ రేటు మెరుగ్గా ఉండాలి. ఇంతకీ ఆ పండ్లు ఏంటంటే..?
బెర్రీలు : బ్లూబెర్రీస్, బ్లాక్ బెర్రీస్, స్ట్రాబెర్రీలు, రాస్ప్బెర్రీస్ లాంటి పండ్లలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఇందులో ఉండే ఆంథోసైనిన్లు జీవక్రియ రేటును పెంచడంలో చాలా బాగా సహాయపడతాయి. అదనంగా వీటిలో ఉండే అధిక ఫైబర్ కంటెంట్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
ద్రాక్షపండ్లు : జీవక్రియను పెంచే లక్షణాలకు ప్రసిద్ధి చెందిన పండ్లలో ఒకటి.. ద్రాక్ష. వీటిలో కేలరీలు తక్కువగా ఉండి ఫైబర్ అధికంగా ఉంటుంది. అలాగే ఇది ఇన్సులిన్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడే సమ్మేళనాలనూ కలిగి ఉండి బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తుంది. మీ అల్పాహారంలో ద్రాక్షపండ్లను చేర్చడం లేదా ఒక గ్లాసు తాజా ద్రాక్ష పండ్ల జ్యూస్‌ని తాగడం వల్ల ఆ రోజు జీవక్రియకు మంచి బూస్టింగ్ ఇవ్వొచ్చు.
యాపిల్స్ : మీ జీవక్రియ రేటును పెంచుకోవడానికి ఉపయోగపడే మరో సహజసిద్ధమైన ఫ్రూట్ యాపిల్. వీటిలో ఫైబర్, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఇందులో ఉండే ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో పాటు ఆకలిని కంట్రోల్ చేస్తుంది. ఫలితంగా అతిగా తినడాన్ని తగ్గిస్తుంది. అందుకే డాక్టర్లు కూడా రోజుకో యాపిల్ తీసుకోవాలని సూచిస్తుంటారు.
అవకాడో :ఇవి కూడా మెటబాలిజమ్ పెంచడంలో చాలా బాగా సహాయపడతాయి. వీటిలో ఉండే ఆరోగ్యకరమైన మోనోశాచురేటెడ్ కొవ్వులు జీవక్రియను పెంచడంతో పాటు బరువు తగ్గడానికి తోడ్పడుతాయి. కాబట్టి మీ ఆహారంలో అవకాడోలను చేర్చుకోవడం వల్ల బాడీలో స్థిరమైన శక్తి విడుదలను అందిస్తుంది. దాంతో ఆ రోజంతా యాక్టివ్‌గా ఉంటారు.