కరోనా వ్యాప్తి నియంత్రణకు భౌతిక దూరం పాటించే చర్యలను ప్రపంచ దేశాలు అమలు చేస్తున్నాయి. ఫలితంగా ప్రజలందరు ఇళ్లకే పరిమితమైపోయారు. అయితే ఎప్పుడూ బిజీబిజీగా గడిపే ప్రజలు.. ఒకేసారి ఇన్ని రోజుల పాటు నిర్బంధంలో ఉండటం వారి మానసిక స్థితిని ప్రభావితం చేస్తుందని ఓ అధ్యయనంలో తేలింది.
స్వల్ప, దీర్ఘకాలంలో వ్యక్తులు స్వీయ నిర్బంధంలో ఒంటరిగా ఉన్నప్పుడు వారి మానసిక స్థితి ఎలా ఉంటుందన్న అంశంపై అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు అధ్యయనం చేశారు.
అమెరికన్ మెడికల్ అసోసియేషన్ అనే జర్నల్లో ఈ అధ్యయనం ప్రచురితమైంది.
వేధింపులు పెరుగుతాయి!
మానసిక ఒత్తిడి వల్ల మనిషి ప్రవర్తనలో మార్పులు వస్తాయని, అవి గృహ హింస, పిల్లలను వేధించడం వంటి పలు సమస్యలకు దారి తీస్తాయని అధ్యయనంలో తేలింది. ఇటువంటి పరిస్థితులు మానసిక ఆరోగ్యంపై తక్షణ ప్రభావం చూపుతాయని, దీర్ఘకాలంలోనూ కొనసాగుతాయని పరిశోధకులు తెలిపారు.