తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

Good Health: మన ఆరోగ్యం మన బాధ్యత.. అందుకే ఈ మార్పులు తప్పనిసరి.! - మంచి ఆరోగ్యం కోసం పాటించాల్సిన నియమాలి

Suggestions for Good Health: శారీరక శ్రమ, వ్యాయామం లేకపోవడం, జీవనశైలిలో లోపాలతో పాటు వాతావరణం- నీరు- ఆహార కాలుష్యాలు అనారోగ్యానికి కారణాలవుతున్నాయని వైద్య నిపుణులు అభిప్రాయపడ్డారు. సెల్‌ఫోన్‌తో ఎక్కువ సమయం గడపడం, అతిగా తినడం, మద్యం- పొగతాగడం వంటి అలవాట్లతో 25 ఏళ్ల పైబడినవారిలో మధుమేహం, అధిక రక్తపోటు, ఊబకాయం వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని తెలిపారు. ‘ఈనాడు- సుఖీభవ’ ఆధ్వర్యంలో జీవనశైలి వ్యాధులపై ఆదివారం నిర్వహించిన ప్రత్యేక వెబినార్‌లో పలువురు వైద్య నిపుణులు ఆయా సమస్యలకు కారణాలు, పరిష్కార మార్గాలను సూచించారు.

Suggestions for Good Health
వ్యాయామంతో ఆరోగ్యం

By

Published : Apr 4, 2022, 7:56 AM IST

Suggestions for Good Health: మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు.. ఆరోగ్యంపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి. గంటల తరబడి కంప్యూటర్​ ముందు కూర్చోవడం, అదే పనిగా టీ, కాఫీలు తాగడం.. జంక్​ ఫుడ్​ వీటన్నిటి ద్వారా అనారోగ్యాన్ని కొనితెచ్చుకోవడమే. ఫలితంగా 50 ఏళ్లలోపే గుండె సమస్యలు ఎదురవుతున్నాయి. మరి వాటికి పరిష్కారాలేంటి?. ముందు మనం మారితే మన ఆరోగ్యం కూడా బాగుంటుందని చెబుతున్నారు వైద్య నిపుణులు. మరి ఆ మార్పుల విషయానికొస్తే..

మెడికల్‌ ప్రిస్క్రిప్షన్‌లా వ్యాయామం :"పిల్లలు ఆటలకు దూరమై సెల్‌ఫోన్‌కు బానిస అవుతున్నారు. చాలామంది నిపుణుల సలహాలు తీసుకోకుండా నచ్చిన పద్ధతుల్లో వ్యాయామం చేయడం.. కీళ్లు, కండరాల నొప్పులు వంటివి వస్తే.. చిన్న సమస్యే అని వదిలేయంతో దీర్ఘకాలంలో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. వ్యాయామం కూడా మెడికల్‌ ప్రిస్క్రిప్షన్‌ తరహాలో ఉండాలి. వ్యాయామంలో నొప్పులు వస్తుంటే.. ఫిజియోథెరపీ నిపుణులను సంప్రదించాలి."

-డా.ఎస్‌.రాజేశ్‌, ఫిజియోథెరపిస్ట్‌

తల్లిదండ్రులే జాగ్రత్తలు తీసుకోవాలి :పదేళ్లలోపు చిన్నారుల్లో టైప్‌-1 డయాబెటిస్‌ ఉన్నవారికి ఇన్సులిన్‌ ఇంజెక్షన్లు ఇవ్వాల్సిందేనని మధుమేహ పరిశోధకులు డా.పి.వి రావు స్పష్టం చేశారు. 10 నుంచి 20 ఏళ్ల మధ్య టైప్‌-2 డయాబెటిస్‌ వచ్చినవారిలో 30 శాతం మంది లావుగా ఉంటున్నారని చెప్పారు. వీరు పీడియాట్రిక్‌ డయాబెటిస్‌తో బాధపడుతున్నట్లు గుర్తించారు. వీరికి త్వరగా చికిత్స అందించకపోతే రక్తపోటు, మూత్రపిండాల వ్యాధులు ఎక్కువవుతున్నాయన్నారు. వీరి విషయంలో తల్లిదండ్రులే జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 25 ఏళ్లు పైబడినవారిలో అధిక బరువు, శారీరక శ్రమ లేకపోవడం, మానసిక ఒత్తిడి వల్ల ఇటీవల టైప్‌-2 మధుమేహం సమస్య పెరుగుతోందని.. దీంతో కాలేయ వ్యాధులూ ఉత్పన్నమవుతున్నాయని వివరించారు.

50 సంవత్సరాల లోపే గుండె సమస్యలు :ఒత్తిడి, వాతావరణంలో మార్పులతో గుండె జబ్బులు పెరుగుతున్నాయని ప్రముఖ కార్డియాలజిస్ట్​ డా. రమేశ్​ గూడపాటి అన్నారు. బాధితుల్లో 50 సంవత్సరాల లోపువారే ఎక్కువగా ఉంటున్నారని.. వంద మరణాల్లో మూడోవంతు గుండె, రక్తనాళాలకు సంబంధించినవే ఉంటున్నాయని చెప్పారు. గుండె సమస్యలు లేకపోయినా అందుకు దారితీసే రిస్క్‌ ఫ్యాక్టర్లను కనిపెట్టి నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు. కొలెస్ట్రాల్‌, బీపీ, బరువు ఎక్కువగా ఉండటం, ఒత్తిడి సమస్యలు ఉంటే.. ముందే గుర్తించి చికిత్స తీసుకోవాలని పేర్కొన్నారు. 50 సంవత్సరాలు దాటినవారు సంవత్సరానికోసారి జనరల్‌ చెకప్‌ చేయించుకోవాలని.. రోజుకు 30 నిమిషాల చొప్పున వారంలో 5 రోజులు వ్యాయామం చేయాలన్నారు. చిన్నారులకూ ఈ తరహా జీవనశైలిని అలవాటు చేయాలని వివరించారు.

పళ్లెంలో ఆ నాలుగు రకాలు ఉండాలి :"తినే పళ్లెంలో రెండు భాగాలు పండ్లు, కూరగాయలు, ఒక భాగం గింజ ధాన్యాలు, నూనెలు, మరోభాగం మాంసకృత్తులు (పప్పు దినుసులు, చేప, గుడ్లు) ఉండాలి. అల్పాహారం తినకుండా మధ్యాహ్నం పూట ఎక్కువగా తినడం వల్ల స్థూలకాయం పెరిగిపోతోంది. 25 నుంచి 30 గ్రాముల పీచు తీసుకుంటే మలబద్ధకం రాదు. నీరు కూడా పోషకాహారం లెక్కలోకే వస్తుంది. శీతలపానీయాలకు దూరంగా ఉండాలి. రసాలకు బదులు పండ్లను తినాలి. కాఫీ, టీ వీలైనంత తగ్గించాలి."

- డా.సి.అంజలీదేవి, విశ్రాంత న్యూట్రిషన్‌ ప్రొఫెసర్‌

యోగా, ధ్యానంతో ఒత్తిడి దూరం :చికాకు, ఆకలి వేయకపోవడం, అలసిపోవడం, నిద్రపట్టకపోవడం, రక్తపోటు వంటివాటికి ఒత్తిడే కారణమని సంగారెడ్డి ప్రభుత్వ కళాశాల హెచ్​వోడీ డా. శ్రీలక్ష్మీ పింగళి పేర్కొన్నారు. రుణాత్మక ఆలోచనలే ఒత్తిడిని తీసుకొస్తాయని అనుకోవడం పొరపాటేనని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉదాహరణకు విడాకులు ఎంత ఒత్తిడో.. పెళ్లి కూడా అంతే ఒత్తిడని.. పదోన్నతి ఎంత ఒత్తిడో.. రాకపోవడమూ అంతే ఒత్తిడని చెప్పారు. ఒక పరిస్థితికి అనుగుణంగా మనసు సర్దుబాటయ్యే సమయంలో ఒత్తిడి మొదలవుతుందని.. యోగా, ధ్యానంతో వీటికి పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. పాజిటివ్‌గా ఆలోచించడంపై సాధన అవసరమని సూచించారు.

ఇదీ చదవండి:Harishrao Review On Health: 'ఆసుపత్రుల్లో ఇక నెలనెలా ఆకస్మిక తనిఖీలు'

ABOUT THE AUTHOR

...view details