ఒత్తిడి, నిద్రలేమి, భావోద్వేగ సమస్యల వంటివన్నీ మానసిక స్థితి (మూడ్) మీద ప్రభావం చూపుతాయి. ఇందులో పోషకాహారం పాత్ర తక్కువదేమీ కాదు. తీపి పానీయాలు, వేపుళ్లు, మాంసం ఉత్పత్తులు, ఎక్కువ వెన్నతో కూడిన పాల పదార్థాలు, మిఠాయిల వంటి వాపును (ఇన్‌ఫ్లమేషన్) ప్రేరేపించే ఆహారంతో కుంగుబాటు, మానసిక సమస్యల ముప్పు పెరుగుతున్నట్టు అధ్యయనాలూ పేర్కొంటున్నాయి. రక్తంలో గ్లూకోజు మోతాదుల హెచ్చుతగ్గులు, పోషకాల లోపం మూడ్ మారిపోవటానికి, భావోద్వేగాలు అదుపు తప్పటానికీ దారితీస్తాయి. కాబట్టి ఆహార అలవాట్లు, పదార్థాలు మన మూడ్, శారీరక ఆరోగ్యం మీద ఎలాంటి ప్రభావం చూపుతాయో అర్థం చేసుకొని ఉండటం మంచిది.
చెయ్యకూడనివి
భోజనం మానెయ్యటం:వేళకు ఆహారం తీసుకోవటం మనసు కుదురుగా ఉండటానికీ తోడ్పడుతుంది. భోజనం మానేస్తే.. ముఖ్యంగా ఉదయం అల్పాహారం తినకపోతే రక్తంలో గ్లూకోజు మోతాదులు పడిపోతాయి. ఫలితంగా నీరసం ఆవహిస్తుంది. ఉల్లాసం తగ్గుతుంది. ఏకంగా ఆలోచనా విధానమే మారిపోతుంది.
కొన్ని పదార్థాలు తినకపోవటం: మనకు అన్నిరకాల పోషకాలు అవసరం. వివిధ రకాల పదార్థాలు తింటేనే ఇవన్నీ లభిస్తాయి. కానీ కొందరు కొన్ని పదార్థాలు తినకుండా భీష్మించుకుంటారు. దీంతో శరీరానికి అత్యవసరమైన పోషకాలు లోపించే ప్రమాద ముంది. ముఖ్యంగా ఐరన్, జింక్, మెగ్నీషియం, విటమిన్ బి, విటమిన్ డి, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు లోపిస్తే మూడ్ దెబ్బతింటుంది. శక్తి సన్నగిల్లి మానసికంగా జావగారిపోవటం ఖాయం.
పాలిష్ పదార్థాలు ఎక్కువగా తినటం: బాగా పొట్టుతీసిన గోధుమలతో చేసిన బ్రెడ్డు, కేకుల వంటివి రక్తంలో వేగంగా గ్లూకోజు హెచ్చుతగ్గులకు దారితీస్తాయి. ఫలితంగా మూడ్ మారిపోయి నీరసం, చిరాకు వంటివి తలెత్తుతాయి.
చేయాల్సినవి
కొద్దికొద్దిగా ఎక్కువసార్లు తినాలి: గ్లూకోజు మోతాదులు తగ్గితే నీరసం, అలసట ముంచుకొస్తాయి. కాబట్టి రోజంతా తగినంత శక్తి అందేలా తక్కువ తక్కువగా ఎక్కువసార్లు తినటం అలవాటు చేసుకోవాలి. దీంతో రక్తంలో గ్లూకోజు మోతాదులు స్థిరంగా ఉంటాయి. పొట్టుతీయని ధాన్యాలతో చేసిన పదార్థాలు, గింజపప్పులు, విత్తనాల వంటివి తీసుకుంటే ఇంకా మంచిది.