Many Benefits For Heart With Calcium: క్యాల్షియం అనగానే ఎముకల పటుత్వమే గుర్తుకొస్తుంది. అయితే ఇది ఒక్క ఎముకలు, దంతాల ఆరోగ్యానికే కాదు. రక్తం మామూలుగా గడ్డ కట్టేలా చూడటం కండరాలు, నాడులు సక్రమంగా పనిచేయటం గుండె నార్మల్‌గా కొట్టుకునేలా చేయటంలోనూ పాలు పంచుకుంటుంది. మన శరీరంలో క్యాల్షియం చాలావరకు ఎముకల్లోనే ఉంటుంది. తగినంత క్యాల్షియం తీసుకోకపోతే శరీరం ఎముకల నుంచి దీన్ని తీసుకొని, వాడుకుంటుంది.
ఇది ఎముకల క్షీణత(ఆస్టియోపోరోసిస్)కు దారితీస్తుంది. తగినంత క్యాల్షియం తీసుకోకపోతే రక్తపోటు కూడా పెరుగుతుంది. ఫలితంగా గుండె జబ్బు ముప్పూ పెరుగుతుంది. అందువల్ల తగినంత క్యాల్షియం లభించేలా చూసుకోవాలి. చాలామంది ముఖ్యంగా వృద్ధులు ఎముకల క్షీణతను నివారించుకోవటానికి క్యాల్షియం మాత్రలు వేసుకోవటం తెలిసిందే. అయితే వీటితో గుండె కవాట సమస్యల ముప్పు పెరుగుతున్నట్టు, ఇవి చివరికి గుండె వైఫల్యానికి దారితీస్తున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి.