తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

కరోనా కాలంలో మధుమేహం నియంత్రణ ఇలా... - how to control Blood sugar levels

మధుమేహం ఉన్నవారికి, ఇతరులకు వైరస్​ సోకే విషయంలో తేడాలు ఉండవు. కానీ... కరోనా వస్తే మాత్రం మిగిలినవారికన్నా చక్కెర వ్యాధిగ్రస్థులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి ఆ పరిస్థితి రాకుండా చూసుకోవడం ఎలా? లాక్​డౌన్​ నిబంధనలు కచ్చితంగా పాటిస్తూనే షుగర్​ లెవల్స్​ను అదుపులో ఉంచుకునేందుకు ఏం చేయాలి?

Managing your diabetes and keeping your blood sugar under control
కరోనా కాలంలో మధుమేహం నియంత్రణ ఇలా...

By

Published : Apr 28, 2020, 1:47 PM IST

Updated : May 21, 2020, 4:50 PM IST

7 కోట్లు... భారత్​లో మధుమేహం వ్యాధిగ్రస్థుల సంఖ్య. దేశంలోని ఒక్కో కుటుంబంలో సగటున ఐదుగురు ఉన్నారనుకుందాం. అంటే భారత్​లోని 35 కోట్ల మందిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావం చూపుతోంది చక్కెర వ్యాధి.

మరి మధుమేహ బాధితులపై కరోనా ప్రభావం ఎంత? ఎంతో మంది మదిని తొలుస్తున్న ప్రశ్న ఇది. చక్కెర వ్యాధిగ్రస్థులకు, ఇతరులకు వైరస్​ సోకే విషయంలో తేడాలు ఉండవు. కానీ... కరోనా వస్తే మాత్రం మిగిలినవారికన్నా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మధుమేహం ఉండి, వయసు 60 ఏళ్లు పైబడిన వారైతే ఈ సమస్యల తీవ్రత మరింత ఎక్కువ. అనేక దేశాల్లో కరోనా రోగుల పరిస్థితిపై అధ్యయనం ద్వారా ఈ విషయం వెల్లడైంది.

మధుమేహం + కరోనా = ?

మధుమేహం ఉన్నవారికి కరోనా సోకితే చక్కెర స్థాయిపై ప్రభావం పడుతుంది. వైరస్​తో పోరాడేందుకు శరీరం అధికంగా శ్రమిస్తుంది. ఫలితంగా చక్కెర స్థాయిల్లో హెచ్చుతగ్గులు వస్తాయి. ఈ పరిణామం కళ్లు, అరికాళ్లు, మూత్రపిండాలు, శరీరంలోని ఇతర భాగాలకు సంబంధించిన సమస్యల్ని పెంచుతుంది.

వ్యాయామం, సరైన ఆహారం తీసుకోవడం ద్వారా చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకునే అవకాశముంది. కానీ... లాక్​డౌన్​ కారణంగా వాకింగ్​కు, జిమ్​కు వెళ్లే పరిస్థితి లేదు. ఆహారనియమాల్లోనూ ఇదే పరిస్థితి. ఇంటి దగ్గర్లోని కిరాణా దుకాణంలో దొరికిన నిత్యావసరాలతో కడుపు నింపుకోవడం తప్పా.. ప్రత్యేక డైట్ ఫాలో కావడం కుదరదు. అందుకే మధుమేహం ఉన్నవారు కరోనా కాలంలో ఇతరుల కన్నా మరింత అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండడం అవసరం.

మధుమేహం ఉన్నవారు ఏం చేయాలి?

1. ఇల్లు దాటి బయటకు రాకూడదు. ఇతరులకు 1-2 మీటర్ల భౌతిక దూరం కచ్చితంగా పాటించండి. బయటకు వెళ్లి ఏమైనా కొనాల్సి ఉంటే... కుటుంబంలోని ఇతరులెవరినైనా పంపడమే ఉత్తమం.

2. మధుమేహం ఉన్నవారు మాత్రమే కాక ఇంట్లోని ప్రతి ఒక్కరూ తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలి.

3. మధుమేహం కోసం ఎప్పటినుంచో తీసుకుంటున్న మందుల్ని అలానే కొనసాగించాలి. మీ అంతట మీరు ఔషధాలు తీసుకోవడం అపొద్దు, డోస్ తగ్గించొద్దు. బీపీ నియంత్రణ ట్యాబ్లెట్లు, యాస్పిరిన్​ వంటివి తీసుకుంటున్నా వాటిని అలానే కొనసాగించండి.

4. మధుమేహం నియంత్రణకు మీరు వాడే మందుల్ని 3-4 వారాలకు సరిపడా కొని పెట్టుకోండి.

5. మీ ఔషధాల నిల్వను ఎప్పటికప్పుడు సరిచూసుకోండి. వారం రోజులకన్నా తక్కువకు సరిపడా ఉన్నాయనుకుంటే వెంటనే తెప్పించుకోండి. లాక్​డౌన్​ కారణంగా మీరు ఎప్పుడూ వాడే బ్రాండ్లు దొరకకపోవచ్చు. మీ వైద్యుడు లేదా ఔషధ దుకాణం ప్రతినిధితో మాట్లాడి ప్రత్యామ్నాయాలు ఏమున్నాయో తెలుసుకోండి. బ్రాండ్ మారినా సరే మధుమేహం మందుల్ని క్రమం తప్పకుండా తీసుకోవడం తప్పనిసరి.

6. డైట్​ను మార్చొద్దు. రోజుకు 3 సార్లు తినడంకన్నా ఎక్కువసార్లు తక్కువ మొత్తంలో తినడం మేలు. వేసవి కాలం కాబట్టి మంచినీళ్లు కాస్త ఎక్కువగానే తాగాలి.

7. ఇంట్లోనే బ్లడ్ షుగర్​ స్థాయి చెక్ చేసుకునే అలవాటు ఉంటే అలాగే కొనసాగించండి. వ్యాయామం ఏమీ చేయడం లేదు కాబట్టి కొంచెం ఎక్కువసార్లు చెక్ చేసుకోవడమే మేలు.

8. హైపర్​గ్లైసీమియా(చక్కెర స్థాయి పెరగడం), తరచూ మూత్రవిసర్జన చేయాల్సి రావడం, బాగా దాహం వేయడం, తలనొప్పి, అలసట, బద్ధకం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయేమో గమనిస్తూ ఉండండి.

9. రెగ్యులర్ చెక్ అప్ కోసం ఆస్పత్రికి వెళ్లొద్దు. లాక్​డౌన్​ ముగిశాక మీరు బయటకు వెళ్లొచ్చని చెప్పాకే ఆ పని చేయండి.

10. ఇంట్లోనే ఉండమన్నంత మాత్రాన రోజువారీ వ్యాయామం మానేయమని కాదు. వాకింగ్ కోసం మీరు బయటకు వెళ్లలేకపోవచ్చు. కానీ ఇంట్లోనే ఆ పని చేయండి. రోజుకు 4 సార్లు 400-500అడుగులు వేయడం 1.5-2 కిలోమీటర్లు నడిచినదానితో సమానం. స్ట్రైచ్చింగ్, బెండింగ్ ఎక్సర్​సైజులూ చేయండి. ఒకేచోట ఎక్కువసేపు కూర్చోవద్దు. ప్రతి 45-60 నిమిషాలకు కాసేపు నడవండి. కూర్చుని ఉన్నప్పుడు కూడా కాసేపు పాదాలు, చేతులు కదుపుతూ ఉండండి.

11. మీ పిల్లలు, మనవళ్లు, మనమరాళ్లు, జీవిత భాగస్వాములతో సరదాగా గడపండి. గత అనుభవాలు నెమరువేసుకోండి.

12. మీ ఇంట్లో ఎవరికైనా కరోనా సోకినట్లు అనుమానం వచ్చినా లేక నిర్ధరణ అయినా... వారు కచ్చితంగా మీకు, మీ కుటుంబసభ్యులకు దూరంగా ఉండేలా చూడండి.

(డా. జీవీఎస్​ మూర్తి, ఇండియన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్​ పబ్లిక్ హెల్త్, హైదరాబాద్)

Last Updated : May 21, 2020, 4:50 PM IST

ABOUT THE AUTHOR

...view details