భారత్‌లో మధుమేహం వ్యాధిగ్రస్థుల సంఖ్య సుమారు ఏడు కోట్లకు పై మాటగానే ఉంది. దేశంలోని ఒక్కో కుటుంబంలో సగటున ఐదుగురు ఉన్నారనుకుంటే... భారత్‌లోని 35 కోట్ల మందిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావం చూపుతోంది చక్కెర వ్యాధి.
మరి మధుమేహ బాధితులపై కరోనా ప్రభావం ఎంత? ఎంతో మంది మదిని తొలుస్తున్న ప్రశ్న ఇది. చక్కెర వ్యాధిగ్రస్థులకు, ఇతరులకు వైరస్ సోకే విషయంలో తేడాలు ఉండవు. కానీ... కరోనా వస్తే మాత్రం మిగిలినవారికన్నా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మధుమేహం ఉండి, వయసు 60 ఏళ్లు పైబడిన వారైతే ఈ సమస్యల తీవ్రత మరింత ఎక్కువ. అనేక దేశాల్లో కరోనా రోగుల పరిస్థితిపై అధ్యయనం ద్వారా ఈ విషయం వెల్లడైంది.
మధుమేహం + కరోనా = ?
మధుమేహం ఉన్నవారికి కరోనా సోకితే చక్కెర స్థాయిపై ప్రభావం పడుతుంది. వైరస్‌తో పోరాడేందుకు శరీరం అధికంగా శ్రమిస్తుంది. ఫలితంగా చక్కెర స్థాయిల్లో హెచ్చుతగ్గులు వస్తాయి. ఈ పరిణామం కళ్లు, అరికాళ్లు, మూత్రపిండాలు, శరీరంలోని ఇతర భాగాలకు సంబంధించిన సమస్యల్ని పెంచుతుంది.
వ్యాయామం, సరైన ఆహారం తీసుకోవడం ద్వారా చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకునే అవకాశముంది. కానీ... కరోనా కారణంగా వాకింగ్‌కు, జిమ్‌కు వెళ్లే పరిస్థితి లేదు. ఆహారనియమాల్లోనూ ఇదే పరిస్థితి. ఇంటి దగ్గర్లోని కిరాణా దుకాణంలో దొరికిన నిత్యావసరాలతో కడుపు నింపుకోవడం తప్పా.. ప్రత్యేక డైట్ ఫాలో కావడం కుదరదు. అందుకే మధుమేహం ఉన్నవారు కరోనా కాలంలో ఇతరుల కన్నా మరింత అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండడం అవసరం.
మధుమేహం ఉన్నవారు ఏం చేయాలి?
1. ఇల్లు దాటి బయటకు రాకూడదు. ఇతరులకు 1-2 మీటర్ల భౌతిక దూరం కచ్చితంగా పాటించండి. బయటకు వెళ్లి ఏమైనా కొనాల్సి ఉంటే... కుటుంబంలోని ఇతరులెవరినైనా పంపడమే ఉత్తమం.
2. మధుమేహం ఉన్నవారు మాత్రమే కాక ఇంట్లోని ప్రతి ఒక్కరూ తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలి.
3. మధుమేహం కోసం ఎప్పటినుంచో తీసుకుంటున్న మందుల్ని అలానే కొనసాగించాలి. మీ అంతట మీరు ఔషధాలు తీసుకోవడం అపొద్దు, డోస్ తగ్గించొద్దు. బీపీ నియంత్రణ ట్యాబ్లెట్లు, యాస్పిరిన్ వంటివి తీసుకుంటున్నా వాటిని అలానే కొనసాగించండి.