Male Infertility Problems : ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో బిజీ లైఫ్ వల్ల సరిగ్గా ఆహారం తీసుకోకపోవడం, ఇతర అనారోగ్య సమస్యల వల్ల భార్యాభర్తలకు సంతానం కలగడం లేదు. పెళ్లై ఏళ్లు గడుస్తున్నా తమకు సంతానం కలగడం లేదని బాధపడుతూ ఉంటారు. ఇందుకోసం ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ లక్షలు ఖర్చు చేస్తుంటారు. కానీ మహిళ గర్భం దాల్చకపోవడానికి పురుషుల్లో ఉండే కొన్ని సమస్యలు కూడా కారణం అవుతాయి. పురుషుల్లో వీర్య కణాలు తక్కువగా ఉత్పత్తి కావడం, వీర్య కణాలు ఆరోగ్యకరంగా లేకపోవడం, జన్యుపరమైన సమస్యలు సంతానరాహిత్యానికి కారణం అవుతాయని డాక్టర్లు చెబుతున్నారు. వంశపార్యపరంగా పురుషుల్లో వీర్య కణాలు తగ్గిపోవడం, సెక్సువల్ ఇన్‌ఫెక్షన్లు, వేడి ప్రాంతాల్లో పని చేయడం, బిగుతైన లోదుస్తులు, టైట్ జీన్స్ ధరించడం వల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గడం కూడా మగవారిలో సంతానలేమికి కారణంగా చెప్పవచ్చు.
వేడి ప్రాంతాల్లో పనిచేసేవారికి సమస్యలు..
Male Infertility Causes : వేడి ప్రాంతాల్లో ఎక్కువగా పనిచేయడం, మొబైల్ ఫోన్లను జీన్స్ పాకెట్‌లో పెట్టుకోవడం వల్ల శరీరం వేడికి గురై వీర్య కణాలు తగ్గే అవకాశం ఉంటుంది. దీని వల్ల మగవారిలో సంతానలేమి సమస్య ఏర్పడుతుంది. దీంతో వేడి ప్రాంతాల్లో పనిచేసేవారు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలి?
Male Infertility Test : వీర్యకణాల శాంపిల్స్‌ను సేకరించి టెస్టులు నిర్వహిస్తారు. వీర్య కణాల ఉత్పత్తి, బలం, ఆరోగ్య స్థితి గురించి అంచనా వేస్తారు. అవసరమైతే బ్లడ్ టెస్టులు కూడా నిర్వహిస్తారు. వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉంటే హార్మోన్ టెస్టులు చేస్తారు.