Causes For Under Eye Dark Circles :నేటి కాలంలో ఎక్కువ మందిని వేధిస్తున్న సమస్యల్లో.. కళ్ల కింద డార్క్ సర్కిల్స్(Dark Circles Under The Eyes) ఒకటి. ఈ సమస్య తలెత్తడానికి నిద్రలేమి.. అలసట, టీవీ, కంప్యూటర్ స్క్రీన్ అతిగా చూడడం వంటివి ప్రధాన కారణాలుగా భావిస్తుంటారు. అయితే.. ఇవే కాకుండా మీరు చేసే కొన్ని పొరపాట్ల వల్ల కూడా కళ్లకింద నల్లటి వలయాలు వస్తాయని సౌందర్య నిపుణులు చెబుతున్నారు.
ఆడవాళ్లు అందంగా కనిపించడం కోసం.. నిత్యం ఏవేవో సౌందర్య సాధనాలు ముఖానికి రాస్తుంటారు. ఇవి కూడా ఆ సమస్యకు కారణం కావొచ్చంటున్నారు నిపుణులు. వీటిని ఎక్కువగా ఉపయోగించండం వల్ల వచ్చే అలర్జీల కారణంగా కళ్ల కింద డార్క్ సర్కిల్స్ వస్తాయని చెబుతున్నారు. కొందరైతే ఈ మచ్చలు వచ్చినప్పుడు వాటిని దాచడానికి అధిక రెటినాయిడ్స్ ఉపయోగిస్తుంటారు. అలా యూజ్ చేయడం ద్వారా అందులోని కెమికల్స్ కారణంగా వర్ణద్రవ్యం మరింత దెబ్బతిని ఫేస్‌పై భారీ పిగ్మెంటేషన్ రావడం లాంటి చర్మ సమస్యలకు కారణమవుతుందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి వీలైనంత వరకు బ్యూటీ ప్రొడక్ట్స్‌కు దూరంగా ఉండడమే మంచిదంటున్నారు నిపుణులు. ఒకవేళ వాడినా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ తక్కువ మోతాదులో యూజ్ చేయడం బెటర్ అని అంటున్నారు.
కళ్ల కింద డార్క్ సర్కిల్స్ రావడానికి మరో కారణమేంటంటే.. టీ, కాఫీ అతిగా తాగడం. వీటిని ఎక్కువగా తీసుకోవడం ద్వారా వచ్చే డీహైడ్రేషన్ ప్రాబ్లమ్ కూడా ముఖ్యంగా కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడడానికి కారణమవుతుందట! దీని కారణంగా చర్మం పొడి బారడంతోపాటు మచ్చలు మరింత నలుపుగా కనిపించేలా చేస్తుందట. కాబట్టి టీ, కాఫీలను తాగడం తగ్గించి బాడీని ఎప్పటికప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలని చెబుతున్నారు.